ముగ్గురు పోలీస్‌‌ ఆఫీసర్లపై వేటు

ముగ్గురు పోలీస్‌‌  ఆఫీసర్లపై వేటు

వరంగల్‌‌ సిటీ, వెలుగు : అవినీతి ఆరోపణల కేసులో ఓ ఏసీపీతో పాటు సీఐ, ఎస్సైపై సస్పెన్షన్‌‌ వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే... గతంలో వరంగల్‌‌ ఏసీపీగా నందిరాంనాయక్‌‌, మట్టెవాడ సీఐగా గోపీరెడ్డి, ఎస్సైగా విఠల్‌‌ పనిచేశారు. ఏసీపీ నందిరాంనాయక్‌‌ ఓ రౌడీషీటర్‌‌ బర్త్‌‌డే వేడుకల్లో పాల్గొని అనుచితంగా మాట్లాడడంతో పాటు, రౌడీషీటర్లకు అనుకూలంగా ఉండేవారని, తన మాట వినని కింది స్థాయి సిబ్బందిని సైతం వేధించేవారని ఆరోపణలు వచ్చాయి. 

అలాగే సీఐ గోపి, ఎస్సై విఠల్‌‌ మట్టెవాడ పీఎస్‌‌లో పనిచేస్తున్న టైంలో తప్పుడు కేసులు నమోదు చేసి, అమాయకులను ఇబ్బందులకు గురి చేశారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ముగ్గురిని గతంలోనే ట్రాన్స్‌‌ఫర్‌‌ చేసి విచారణ ప్రారంభించారు. ముగ్గురు అధికారులపై వచ్చిన ఆరోపణలు నిజమేనని ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో ఏసీపీతో పాటు సీఐ, ఎస్సైని సస్పెండ్‌‌ చేస్తూ డీజీపీ శివధర్‌‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.