- టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
హనుమకొండ, వెలుగు: విద్యుత్ అంతరాయం లేకుండా మిరుమిట్లు గొలిపే కాంతులతో మేడారం మహాజాతరను సక్సెస్ ఫుల్ గా నిర్వహించినట్లు టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. విద్యుత్‌శాఖ ఆఫీసర్లు, ఉద్యోగులు, సిబ్బంది, ఏజెన్సీ సమష్టి కృషితోనే మహాజాతర కనులవిందు చేసిందని పేర్కొన్నారు. హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో శనివారం మేడారం జాతర విద్యుత్ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
చీఫ్ గెస్ట్ గా సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హాజరై మాట్లాడారు. 2024 జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మెరుగైన సౌకర్యాలతో వెలుగుల మేడారంగా తీర్చిదిద్దామన్నారు. విద్యుత్ అంతరాయాలు నివారించడానికి మొదటిసారిగా 33 కేవీ లైన్లో కవర్ కండక్టర్ ఏర్పాటు చేశామని చెప్పారు. మరింత మెరుగైన సరఫరాలో భాగంగా అండర్ గ్రౌండ్ కేబుల్, కవర్డ్ కండక్టర్ రింగ్ మెయిన్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. రాబోయే మినీ మేడారం జాతరలోగా అగ్రికల్చర్ సర్వీస్ లోడు బదలాయిస్తామని, గట్టమ్మ దగ్గర కొత్తగా ఏర్పాటు చేసే సబ్ స్టేషన్ వల్ల లోడ్ తగ్గుతుందని చెప్పారు. దీంతో చిలకలగుట్ట, జంపన్న వాగు వివిధ ప్రాంతాల్లో సిబ్బంది కోసం కంటైనర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
రాబోయే గోదావరి పుష్కరాలకు సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మళ్లీ వచ్చే మేడారం జాతర నాటికి సిబ్బందికి ప్రత్యేక యూనిఫామ్ అందిస్తామని చెప్పారు. జాతర సమయంలో కంట్రోల్ రూమ్‌ను మరింత సాంకేతికంగా అభివృద్ధి చేస్తామన్నారు. తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారికి ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసేల స్కానర్లు సిబ్బందికి అందిస్తామన్నారు. జాతర సమయంలో ఎక్కడైనా విద్యుత్ అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించేలా సైరన్ తో కూడిన టు వీలర్లను అందుబాటులోకి తెస్తామన్నారు. అనంతరం మేడారం జాతరలో పని చేసిన ఆఫీసర్లు, ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్ , సి.ప్రభాకర్, సీఈలు కె.తిరుమల్ రావు , కె.రాజుచౌహన్, సురేందర్, శ్రవణ్ కుమార్, భూపాలపల్లి, ములుగు ఎస్ఈలు మల్చూరు నాయక్, ఆనందం పాల్గొన్నారు.
