- మరో రెండు దూడలు హతం
- డ్రోన్, ట్రాప్ కెమెరాకు చిక్కట్లే
- నర్మెట నుంచి సిద్దిపేట వైపు పయనం..!
జనగామ, వెలుగు : రాయల్ బెంగాల్ టైగర్ రాజసంగా తిరుగుతోంది. అది విసిరిన పంజాకు మరో రెండు దూడలు హతమయ్యాయి. దూడలపై దాడి చేసిన తర్వాత పాదముద్రలను బట్టి అది సిద్దిపేట జిల్లావైపునకు పయనించినట్టుగా ఫారెస్ట్ ఆఫీసర్లు భావిస్తున్నారు. రాయల్ బెంగాల్ టైగర్ యథేచ్ఛగా తిరుగుతూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను ముప్పుతిప్పలు పెడుతోంది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చిన ఈ బెంగాల్ టైగర్ ఆదిలాబాద్. కామారెడ్డి, సిద్దిపేట మీదుగా గత నెల 17న యాదాద్రి జిల్లాలోకి అడుగుపెట్టింది. ఈ జిల్లాలో ఆవులు, దూడలను చంపేసి జనగామ జిల్లాలో ఈ నెల 5న రాత్రి అడుగుపెట్టింది.
రఘునాథపల్లి మండలం లోని మండలగూడెంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ దూడను చంపేసి అక్కడి నుంచి నర్మెట్ట వైపునకు వెళ్లింది. అక్కడ శనివారం తెల్లవారుజామున రెండు దూడలను చంపేసి సిద్దిపేట జిల్లా మద్దూరు, దొమ్మాట వైపునకు వెళ్లిందని పులి పాదముద్రలను గుర్తించిన ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు.
డ్రోన్, ట్రాప్ కెమెరాలకు చిక్కట్లే..
యాదాద్రి జిల్లాలో పులిని బంధించడానికి ఫారెస్ట్ ఆఫీసర్లు రాళ్లజనగాం, దత్తాయిపల్లి, ఇందిరానగర్, జనగామ జిల్లా సిద్దెంకి, మండలగూడెంలోనూ డ్రోన్, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిలో యాదాద్రి జిల్లాలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో ఒక్కసారి మాత్రమే పులి చిక్కింది. మేకను ఎరగా వేసి బోన్లు ఏర్పాటు చేసినా పులి
ఆ వైపునకు వెళ్లలేదు.
నాలుగున్నరేండ్లు..
నాలుగున్నరేండ్ల వయసున్న ఈ రాయల్ బెంగాల్ టైగర్ దాదాపు 300 కిలోలకు పైగా బరువు ఉంటుంది. ఇది ఒకేసారి 25 కిలోల మాంసం తింటుందని చెబుతున్నారు. రోజుకు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తోంది. ఆడపులి మూడేండ్ల వయసు, మగపులి నాలుగేండ్ల వయసు నుంచి సంతానోత్పత్తికి రెడీగా ఉంటాయి. ఈ వయసులోనే తల్లిని వదిలి తోడు కోసం వెతుకుతూ ఉంటాయి. ఇప్పుడు మూడు జిల్లాల్లో ప్రయాణించిన రాయల్ బెంగాల్ టైగర్ కూడా తోడు కోసం వెతుకుతోందని ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు.
