గెలిస్తే హెచ్1బీపై సస్పెన్షన్‌‌ ఎత్తేస్త

గెలిస్తే హెచ్1బీపై సస్పెన్షన్‌‌ ఎత్తేస్త
  • డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ బిడెన్ ప్రకటన

వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో తాను గెలిస్తే హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ విధించిన టెంపరరీ సస్పెన్షన్‌‌ను ఎత్తివేస్తానని డెమోక్రటిక్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ జో బిడెన్ ప్రకటించారు. హెచ్1బీ వీసా హోల్డర్లు దేశం కోసం ఎంతో చేశారని కొనియాడారు. ‘‘ఆయన (అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్).. హెచ్1బీ వీసాలు ఈ ఏడాదంతా లేకుండా చేశారు. నా పాలనలో అలా ఉండబోదు” అని చెప్పారు. కంపెనీ వీసా మీద వచ్చిన వాళ్లు ఈ దేశాన్ని నిర్మించారన్నారు. ఆసియా అమెరికన్, పసిఫిక్ ద్వీపవాసుల (ఏఏపీఐ) సమస్యలపై డిజిటల్ టౌన్ హాల్ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రెసిడెంట్ అయ్యాక మొదటి 100 రోజుల పరిపాలనలో చేపట్టబోయే కీలక చర్యలపై మీడియా ప్రశ్నించగా.. బిడెన్ ఈ ప్రకటనలు చేశారు. హెచ్1 బీ, హెచ్ 4, హెచ్ 2 బీ వీసా, జే, ఎల్ వీసాలతోపాటు పలు నాన్-ఇమ్మిగ్రేషన్ వీసాలను ఈ ఏడాది ఆఖరు వరకు సస్పెండ్ చేస్తూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గత నెలలో నిర్ణయం తీసుకున్నారు.

కుటుంబాలను కలపడమే నా ఇమ్మిగ్రేషన్ విధానం

‘‘17 లక్షల మంది ఏఏపీఐ కమ్యూనిటీ వాళ్లతోపాటు.. మొత్తం 1.1 కోట్ల మంది లెక్కలోకి రాని ఇమ్మిగ్రెంట్లకు సిటిజన్​షిప్ ఇచ్చేందుకు సంబంధించిన లెజిస్లేటివ్ ఇమ్మిగ్రేషన్ రీఫార్మ్​ బిల్లును కాంగ్రెస్​ముందు మొదటి రోజే ఉంచుతాను. మైగ్రెంట్లు దేశానికి ఎంతో చేశారు. కుటుంబాలను కలిపి ఉంచడమే నా ఇమ్మిగ్రేషన్ విధానం. ఇమ్మిగ్రేషన్ సిస్టమ్​ను మోడ్రనైజ్ చేస్తాను” అని చెప్పారు. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలు క్రూరమైనవని ఆరోపించారు. డ్రీమర్లను కాపాడేందుకు వెంటనే యాక్షన్ తీసుకుంటానని తెలిపారు. ముస్లిం ట్రావెల్ బ్యాన్​ను రద్దు చేస్తానని ప్రకటించారు.

ఇండియాతో బంధం బలోపేతానికి ప్రాధాన్యం

ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో తాను గెలిస్తే.. సహజ భాగస్వామి అయిన ఇండియాతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని బిడెన్ చెప్పారు. అమెరికా, ఇండియా రిలేషన్​షిప్​పై ప్రశ్నించగా.. ‘‘ఆ రీజియన్​లో మన సేఫ్టీ దృష్ట్యా ఇండియా మనకు భాగస్వామిగా ఉండాలి. నిజం చెప్పాలంటే వారికి కూడా అవసరం” అని చెప్పారు. ఇండియా, యూఎస్ న్యాచురల్ పార్ట్​నర్స్ అని అన్నారు. అమెరికా నేషనల్ సెక్యూరిటీకి ఇండియా కీలకమా? అని ప్రశ్నించగా.. ‘‘ఆ భాగస్వామ్యం.. వ్యూహాత్మక భాగస్వామ్యం. మన సెక్యూరిటీకి అది చాలా అవసరం, ముఖ్యం” అని చెప్పారు. గతంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్​గా కూడా బిడెన్ పని చేశారు. నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్​తో బిడెన్ పోటీ పడనున్నారు.
చైనా అసలు

రూపం అదే: వైట్ హౌస్

‘‘ఇండియా, ఇతర దేశాలపై చైనా దూకుడు వైఖరిని చూస్తే.. కమ్యూనిటీ పార్టీ ఆఫ్ చైనా నిజ స్వరూపం అదేనని తెలుస్తోందని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. లడఖ్​లోని గల్వాన్ వ్యాలీ గొడవ తర్వాత ఇండియా, చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితిని అమెరికా మానిటర్ చేస్తోంది. శాంతియుత పరిష్కారానికి మేం మద్దతు తెలుపుతాం” అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కేయ్​లీ మెక్ఎనానీ చెప్పారు. ‘‘ఇండియా, చైనా సరిహద్దులో చైనా దురాక్రమణ వైఖరి, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో దూకుడు వైఖరికి సరిపోతుంది. ఈ చర్యలు చైనా కమ్యూనిస్ట్ పార్టీ నిజమైన స్వభావాన్ని మాత్రమే ధ్రువీకరిస్తాయి” అని అన్నారు.