మా మధ్య గొడవల్లేవు..రోహిత్ తో విభేదాలపై కొహ్లీ

మా మధ్య గొడవల్లేవు..రోహిత్ తో విభేదాలపై కొహ్లీ

రోహిత్‌‌శర్మ, విరాట్‌‌ కోహ్లీ మధ్య దూరం పెరిగింది. గ్రౌండ్‌‌లో రిజల్ట్స్‌‌ ఎలా ఉన్నా  డ్రెస్సింగ్‌‌ రూమ్‌‌ పరిస్థితి బాలేదు. వెస్టిండీస్‌‌ టూర్‌‌కు ముందు జరగాల్సిన ప్రెస్‌‌మీట్‌‌ విషయంలోనూ సస్పెన్స్‌‌..వరల్డ్‌‌కప్‌‌ తర్వాత  టీమిండియాపై ఇలా రోజుకో వార్త.  అసలు జట్టులో ఏం జరుగుతుందని అనుమానాలు రేపాయి. అయితే రోహిత్‌‌తో తనకు ఎలాంటి గొడవలు లేవని కోహ్లీ స్పష్టం చేశాడు. జట్టు పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంటే  ఈ స్థాయికి ఎలా చేరుతామని  వెస్టిండీస్​తో టీ20ల కోసం  అమెరికా ఫ్లైట్‌‌ ఎక్కే ముందు చెప్పిన కెప్టెన్‌‌ విరాట్‌‌  అపోహలకు బ్రేకులేశాడు.

ముంబైటీమిండియా ఓపెనర్‌‌,  వైస్‌‌ కెప్టెన్‌‌ రోహిత్‌‌శర్మతో తనకు ఎలాంటి విబేధాలు లేవని కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ స్పష్టం చేశాడు. రోహిత్‌‌–కోహ్లీ మధ్య దూరం పెరిగిందంటూ వచ్చిన వార్తలన్నీ కట్టుకథలేనని తేల్చిచెప్పాడు. వరల్డ్‌‌కప్‌‌ సెమీఫైనల్లో టీమిండియా ఓటమి తర్వాత కోహ్లీ, రోహిత్‌‌ ఒకరినొకరు కలుసుకున్న దాఖలాలు లేవు. మరోపక్క కెప్టెన్సీ మార్పుపై కూడా వార్తలు వచ్చాయి. అయితే వెస్టిండీస్‌‌ టూర్‌‌కు బయలుదేరేముందు కోచ్‌‌ రవిశాస్త్రితో కలిసి సోమవారం మీడియా ముందుకొచ్చిన విరాట్‌‌ కోహ్లీ ఆయా అంశాలపై క్లారిటీ ఇచ్చాడు. ఆ వివరాలు అతని మాటల్లోనే..

మా మధ్య ఏం లేదు

రోహిత్‌‌–కోహ్లీ మధ్య విభేదాలని, డ్రెస్సింగ్‌‌ రూమ్‌‌లో పరిస్థితి బాలేదని  వచ్చిన వార్తల గురించి నేను విన్నా. నిజంగా అలాంటి స్థితి ఉండి ఉంటే వరల్డ్‌‌ క్రికెట్‌‌లో మా జట్టు ఈ స్థాయిలో ఎలా ఉంటుంది. ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌లో రాణించడం వెనుక డ్రెస్సింగ్‌‌ రూమ్‌‌ వాతావరణం ఎంత ప్రభావం చూపుతుందో నాకు తెలుసు. గొడవలంటూ వచ్చిన వార్తలన్నీ కట్టుకథలు, అపోహలే. ఈ మధ్య కొన్ని పబ్లిక్‌‌ ఈవెంట్స్‌‌లో పాల్గొన్నా, ఎక్కడికెళ్లినా ‘మీరు బాగా ఆడారు’ అని అందరూ హర్షం వ్యక్తం చేశారు.  కానీ, కొంత మంది అబద్ధాలను సృష్టించి పోషిస్తున్నారు. మంచి విషయాలను, నిజాలను పెడచెవిన పెడతున్నారు. అపోహలు, ఊహాగానాలతో కట్టుకథలను సృష్టించి నిజాన్ని నమ్మడానికి ఇష్టపడడం లేదు. ఇటీవల. వ్యక్తిగత జీవితాలను కూడా వివాదాల్లోకి లాగుతున్నారు. ఓ స్థాయి దాటిన తర్వాత అది ఓ వ్యక్తిని అవమానించడమే అవుతుంది.

డౌటుంటే డ్రెస్సింగ్‌‌ రూమ్‌‌కు రండి

ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌లో డ్రెస్సింగ్‌‌ రూమ్‌‌ వాతావరణం ప్రభావం నాకు తెలుసు.  అది బాగుంది కాబట్టే మేము ఈ స్థాయిలో ఉన్నాం. మీకు అనుమానం ఉంటే రూమ్‌‌లోకి వచ్చి చూడండి. మేము చహల్‌‌తో ఎలా మాట్లాడతామో చూడండి. జట్టులో సీనియర్‌‌ అయిన ధోనీని ఎలా ఆటపట్టిస్తామో చూడండి. మేము అన్ని వీడియోలు తీసి చూపించలేం. పదేపదే అబద్ధాలు విని జట్టు పరిస్థితి బాగాలేదు అనేదే నిజమని అనుకుంటున్నారు. లేనివాటిని సృష్టించి మాపై రుద్దితే మేము జట్టుగా ఆడలేం అని గుర్తించండి. ఇండియన్‌‌ క్రికెట్‌‌ను ముందుకు తీసుకెళ్లడంపైనే మా దృష్టి ఎప్పుడు ఉంటుంది.

కొత్త వాళ్లకు మంచి చాన్స్‌‌

విండీస్‌‌తో జరిగే టీ20 సిరీస్‌‌ రాహుల్‌‌ చహర్‌‌, దీపక్‌‌ చహర్‌‌, నవదీప్‌‌ సైనీ లాంటి వాళ్లకు మంచి చాన్స్‌‌. కొత్త కుర్రాళ్లకు అవకాశమివ్వాలని సెలెక్టర్లు కూడా చెప్పారు. అందువల్ల తొలిసారి జట్టులోకి వచ్చిన వాళ్లకు ఈ సిరీస్‌‌ గొప్ప అవకాశం. వన్డేల్లో సీనియర్లతోపాటు కొత్తవాళ్లతో జట్టు బ్యాలెన్స్‌‌డ్‌‌గా ఉంది. టెస్టుల్లో మేము బాగానే ఆడుతున్నాం కాబట్టి  టీ20 సిరీస్‌‌ విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నా. ఐపీఎల్‌‌లో, దేశవాళీ టీ20 టోర్నీల్లో తమని తాము నిరూపించుకున్న వాళ్లు ఈ సారి జట్టులోకి వచ్చారు. జట్టులో నిలదొక్కుకునేందుకు వాళ్లకు ఈ సిరీస్‌‌ చాలా పెద్ద చాన్స్‌‌.

వెస్టిండీస్‌‌లో ఆడడం బాగుంటుంది

క్రికెట్‌‌ ఆడేందుకు వెస్టిండీస్‌‌ కంటే గొప్ప ప్లేస్‌‌ మరొకటి ఉండదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ క్రికెట్‌‌ ఆడడాన్ని మా జట్టంతా ఎంజాయ్‌‌ చేస్తుంది. కాగా, వెస్టిండీస్‌‌ సిరీస్‌‌ కోసం టీమిండియా సోమవారం రాత్రి అమెరికా బయలుదేరింది. ఇండియా, విండీస్‌‌ మధ్య తొలి రెండు టీ20లు ఫ్లోరిడాలో జరగనున్నాయి. అయితే హెడ్‌‌ కోచ్‌‌ రవిశాస్త్రి మాత్రం జట్టుతో బయలు దేరలేదు. కాస్త ఆలస్యంగా జట్టుతో కలవనున్నాడు.

నా మొహం చెప్పేస్తుంది..

రోహిత్‌‌కు నాకు  మధ్య ఎలాంటి విభేదాలు లేవు. నిజంగా నాకు ఎవరైనా నచ్చకపోతే అది నా మొహంలో క్లియర్‌‌గా కనిపిస్తుంది.  జట్టు పరిస్థితి నిజంగా బాగాలేకపోతే మేము ఎలా బాగా ఆడతాం. నేను 11 ఏళ్లుగా, రోహిత్‌‌ పది పన్నెండేళ్లుగా క్రికెట్‌‌ ఆడుతున్నాం. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. మా మధ్య అంతా బానే ఉంది. అవకాశం దొరికిన ప్రతీసారి రోహిత్‌‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తుంటా. ఎందుకంటే అతను ఎంత గొప్ప ప్లేయరో నాకు తెలుసు. ఇండియన్‌‌ క్రికెట్‌‌ను టాప్‌‌ ప్లేస్‌‌కు చేర్చడంపైనే మేము దృష్టి పెడితే కొందరు బయటి వ్యక్తులు పరువు తీయాలని చూస్తూ కట్టుకథలు సృష్టిస్తున్నారు.

రవి కొనసాగితే హ్యాపీనే

కోచ్‌‌ ఎంపిక అంశం క్రికెట్‌‌ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) బాధ్యత. ఈ విషయంలో సీఏసీ నన్ను ఇప్పటిదాకా సంప్రదించలేదు. ఒకవేళ కమిటీ నా అభిప్రాయం కావాలని కోరితే ఖచ్చితంగా వెళ్లి మాట్లాడతా. రవి భాయ్‌‌తో జట్టుకు మంచి అనుబంధం ఉంది. అతను నాకు మంచి కామ్రేడ్‌‌. ఒకవేళ అతను కోచ్‌‌గా కొనసాగితే సంతోషమే. కానీ కోచ్‌‌ ఎంపిక విషయంలో తుది నిర్ణయం సీఏసీదే.

ఎప్పుడెప్పుడా అని చూస్తున్నాం

ఐసీసీ వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాం.  ఈ చాంపియన్‌‌షిప్‌‌ లాంగ్‌‌ ఫార్మాట్‌‌ గేమ్‌‌పై ఆసక్తిని పెంచుతుంది. టెస్ట్‌‌ క్రికెట్‌‌ ఎప్పుడు సవాలే. ట్రెడిషనల్‌‌ ఫార్మాట్‌‌లో సత్తా చాటిన ప్రతీసారి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇటీవల టీమిండియా టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తుంది. చాంపియన్‌‌షిప్‌‌ అవకాశాలు మాకు మెరుగ్గానే ఉన్నాయి.

జట్టులో విభేదాల వార్తపై హెడ్‌‌ కోచ్‌‌ రవిశాస్త్రి తీవ్రంగా స్పందించాడు. ఈ విషయంపై కోహ్లీ మాట్లాడుతుండగా కల్పించుకున్న రవి ‘ఆటగాళ్ల భార్యలు బ్యాటింగ్‌‌, బౌలింగ్‌‌ చేస్తున్నారని త్వరలో వినే స్థాయికి పరిస్థితి దిగజారింది. జట్టులో విభేదాలు, వర్గాలు, సభ్యుల మధ్య గొడవలు ఉంటే ఏ జట్టు కూడా అన్ని ఫార్మాట్లో ఇంత నిలకడగా ఇన్నేళ్లు రాణించలేదు. డ్రెస్సింగ్‌‌ రూమ్‌‌లో ఓ సభ్యుడిగా చెబుతున్నా అక్కడ ఎలాంటి గొడవలు లేవు. జట్టులో ఏ ఒక్కరూ ఆట కంటే గొప్ప కాదు.  అది కోహ్లీ అయినా నేనైనా. అందరూ జట్టు కోసమే ఆలోచిస్తున్నారు’ అని చెప్పాడు.