ఆన్​లైన్​లో ‘గాంధీపీడియా’

ఆన్​లైన్​లో ‘గాంధీపీడియా’

మహాత్మ గాంధీ రాసిన పుస్తకాలు, లేఖలు, ఆయన చేసిన ప్రసంగాల కాపీల వంటివన్నీ ఇకపై ఒకే పోర్టల్​లో అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ‘గాంధీపీడియా’ వెబ్ పోర్టల్ త్వరలో ప్రారంభం కానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో గాంధీజీకి సంబంధించిన సోషల్ నెట్​వర్క్​ను నిర్మిస్తున్నామని గాంధీనగర్, ఖరగ్​పూర్ ఐఐటీలు, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ​సైన్స్ మ్యూజియమ్స్ (ఎన్ సీఎస్ఎం) వెల్లడించాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదట గాంధీజీ ఆత్మకథ ‘మై ఎక్స్ పెరిమెంట్స్ విత్ ట్రుత్’ పుస్తకాన్ని డిజిటైజేషన్ చేస్తున్నామని తెలిపాయి. ఈ ఏడాది గాంధీజీ 150వ జయంతి నేపథ్యంలో ఈ ప్రాజెక్టును చేపట్టామని ఐఐటీ ఖరగ్ పూర్ ప్రొఫెసర్ అనిమేశ్ ముఖర్జీ వెల్లడించారు. తొలిదశలో గాంధీజీ రాసిన 40 పుస్తకాలను డిజిటల్ రూపంలోకి మార్చి పోర్టల్​లో పెడతామని ఆయన తెలిపారు. మార్చి 2024 నాటికి నాలుగు దశల్లో మొత్తం గాంధీజీకి సంబంధించిన100 పుస్తకాలు, ఇతర అన్ని అంశాలను డిజిటైజ్ చేసి, ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేస్తామన్నారు. గాంధీజీ స్ఫూర్తితో విజయాలు సాధించిన వ్యక్తులు, ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న ప్రముఖ వ్యక్తుల సమాచారం కూడా ఇందులో ఉంటుందని చెప్పారు. పోర్టల్ లోని పుస్తకాల నుంచి తరచూ కొన్ని భాగాలను ట్విట్టర్​లో పోస్టు కూడా చేస్తామన్నారు.