ఫ్యాకల్టీ జీతాలూ స్టూడెంట్ల ఫీజులోనే

ఫ్యాకల్టీ జీతాలూ స్టూడెంట్ల ఫీజులోనే
  •     ఆర్థిక స్వతంత్రత కోసం ఫీజులు పెంచాలంటున్న ఐఐటీలు
  •     ప్రతిపాదనలపై కమిటీ వేసిన హెచ్​ఆర్​డీ

ఫ్యాకల్టీల జీతాలు, కాలేజీల మెయింటెనెన్స్​, ఇతర ఖర్చులనూ స్టూడెంట్ల ఫీజులోనే రాబట్టాలని ఐఐటీలు భావిస్తున్నాయి. అందుకు తగ్గట్టే ఆర్థిక స్వతంత్రత కోసం ఫీజులను పెంచాలన్న నిర్ణయానికొచ్చాయి. అంతేకాదు, ఇనిస్టిట్యూట్​ల ఆదాయం పెరిగేలా కాలేజీల్లో స్టూడెంట్ల సంఖ్యనూ పెంచాలని భావిస్తున్నాయి. ఈ మేరకు గత శుక్రవారం జరిగిన ఐఐటీ కౌన్సిల్​ మీటింగ్​లో ప్రతిపాదనలు పెట్టాయి. ఇక, జీతాలు, మెయింటెనెన్స్​ ఖర్చులు ట్యూషన్​ ఫీజు నుంచి తీసుకున్నా, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన ఖర్చులకు గానూ హయ్యర్​ ఎడ్యుకేషన్​ ఫైనాన్సింగ్​ ఏజెన్సీ (హెచ్​ఈఎఫ్​ఏ) నుంచి లోన్ల ద్వారా డబ్బును సమకూర్చుకుంటామని ఐఐటీలు ప్రతిపాదించాయి. పెంచిన ఫీజులను తట్టుకునేలా స్టూడెంట్ల ఆర్థిక స్థితిగతులకు తగ్గట్టు నగదు బదిలీ (డైరెక్ట్​ బెనిఫిట్​ ట్రాన్స్​ఫర్​) ద్వారా కేంద్ర ప్రభుత్వం స్కాలర్​షిప్పులు ఇవ్వాలని సూచించింది. ‘‘ఆదాయ సృష్టిలో అడ్డంకులను అధిగమించేందుకే ఈ ఆర్థిక స్వతంత్రత ఉద్దేశం. ప్రస్తుతం ఐఐటీల అభివృద్ధికి కేంద్రం ఇచ్చే బడ్జెట్​పైనే ఆధారపడుతున్నాం. ఆర్థిక స్వతంత్రత వల్ల ప్రభుత్వం ఇచ్చే నిధులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది” అని ఓ ఐఐటీ డైరెక్టర్​ చెప్పారు. అయితే, దీని వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సాయం తగ్గుతుందని కొన్ని ఐఐటీల అధికారులు అంటున్నారు. ఆర్థిక స్వతంత్రత వల్ల ఇనిస్టిట్యూట్​లు అభివృద్ధి చెందడంతో పాటు రీసెర్చ్​కు ప్రాధాన్యం పెరుగుతుందని హెచ్​ఆర్​డీ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​ అన్నారు. అయితే, ఓ నిర్ణయానికి వచ్చేముందు ఐఐటీల ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఆయన చెప్పారు. ఆ ప్రతిపాదనలపై కమిటీ వేశామన్నారు