రెండేండ్లలో ఇమేజ్‌‌ టవర్స్‌‌

రెండేండ్లలో ఇమేజ్‌‌ టవర్స్‌‌

‘ఇండియాజాయ్ 2019’ ప్రారంభించిన కేటీఆర్
దేశంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్  డిజిటల్ ఫెస్టివల్
వీఎఫ్‌‌‌‌ఎక్స్, గేమింగ్‌‌లో కోట్లాది రూపాయల వ్యాపారం
ప్రపంచవ్యాప్తంగా  230 కోట్ల మంది యాక్టివ్ గేమర్స్
రెండేళ్లలో ఇమేజ్‌‌ టవర్స్‌‌ రెడీ  ఇందులో కంపెనీలకు సబ్సిడీలిస్తాం.. కేటీఆర్

యానిమేషన్‌‌, వీఎఫ్‌‌ఎక్స్‌‌, గేమింగ్‌‌, కామిక్‌‌(ఏవీజీసీ) రంగం కోసం వెయ్యి కోట్ల పెట్టుబడితో రూపొందిస్తున్న ఇమేజ్‌‌ టవర్స్‌‌ రెండేళ్లలో అందుబాటులోకి వస్తయి. తెలంగాణ యానిమేషన్‌‌, గేమింగ్‌‌కు చక్కని వేదిక అవుతయ్‌‌. దీని ద్వారా యువతకు ఏవీజీసీలో ఉద్యోగావకాశాలు కల్పిస్తం. ఇవి పోలీస్‌‌ కమాండ్‌‌ కంట్రోల్‌‌ రూమ్‌‌ బిల్డింగ్‌‌ కంటే రెండింతలు పెద్దదిగా ‘T’ డిజైన్‌‌లో ఉంటయి.                  – కేటీఆర్‌‌, రాష్ట్ర ఐటీ మంత్రి

హైదరాబాద్, వెలుగుయానిమేషన్, గేమింగ్ ఇండస్ట్రీని హైదరాబాద్‌‌తో పాటు టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరిస్తామని ఐటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్‌‌ డెవలప్‌‌మెంట్ మంత్రి కేటీఆర్ అన్నారు. యానిమేషన్, గేమింగ్ యూనిట్ల కోసం కడుతున్న ఇమేజ్​ టవర్స్​ రెండేళ్లలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద గేమింగ్, మీడియా, ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ ఫెస్టివల్ ‘ఇండియాజాయ్ 2019’ను హెచ్‌‌ఐసీసీలో కేటీఆర్‌‌‌‌ ప్రారంభించారు. ఈ ఈవెంట్ ప్రారంభోత్సవ వేడుకలో కేటీఆర్‌‌‌‌తో పాటు ఐటీ  ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, త్వాగా(తెలంగాణ వీఎఫ్‌‌ఎక్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్) ప్రెసిడెంట్ రాజీవ్ చిలుక, నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నటి నమ్రతా శిరోత్కర్ పాల్గొన్నారు.

యానిమేషన్, గేమింగ్‌‌కు అవసరమైన యువతను తయారు చేస్తామని, ఇండస్ట్రీకి అవసరమైన విధంగా కోర్సులను కూడా ప్రవేశపెడతామని కేటీఆర్ చెప్పారు. ప్రపంచ స్థాయి స్టూడియోలు మన దగ్గర ఉన్నాయని, సినీ ఇండస్ట్రీలోని పోస్ట్ ప్రొడక్షన్‌‌లో అంతర్జాతీయ స్థాయిని హైదరాబాద్ చేరుకుందని కేటీఆర్ చెప్పారు. యానిమేషన్, వీఎఫ్‌‌ఎక్స్ వచ్చాక, వరల్డ్ క్లాస్ స్టూడియోలు ఏర్పాటు చేయడానికి తక్కువ స్థలమే సరిపోతుందన్నారు. మూవీ మేకింగ్ లో వీఎఫ్‌‌ఎక్స్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. వీఎఫ్‌‌ఎక్స్‌‌లో 70 శాతం పని ఇక్కడే జరుగుతుందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన బాహుబలి, ఈగ, మగధీర వంటి చిత్రాల వీఎఫ్‌‌ఎక్స్ వర్క్ హైదరాబాద్‌‌లోనే జరిగిందన్నారు.

గేమింగ్ స్టార్టప్‌‌లు పదింతలు పెరిగాయ్… 

గేమింగ్ స్టార్టప్‌‌లు 2010లో 25 ఉంటే, ప్రస్తుతం అవి 250కి చేరుకున్నాయని కేటీఆర్‌‌‌‌ చెప్పారు. ఈ స్టార్టప్‌‌లు కంటిన్యూగా వృద్ధి సాధిస్తున్నాయని అన్నారు. గేమింగ్ ఇండస్ట్రీ కూడా ఏటా 25 శాతం వృద్ధిని సాధిస్తోందని, కేవలం మొబైల్ గేమింగ్ మార్కెట్ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా 300 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనావేశారు. వీఎఫ్‌‌ఎక్స్, యానిమేషన్, గేమింగ్ రంగంలో కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మంది యాక్టివ్ గేమర్స్ ఉన్నట్టు చెప్పారు. హైదరాబాద్‌‌లో కూడా 150 వీఎఫ్‌‌ఎక్స్, 2డీ, 3డీ వంటి కంపెనీలున్నాయని, ఇవి డైరెక్ట్‌‌గా 30 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయని చెప్పారు.

యానిమేషన్ ఇండస్ట్రీ 2020 నాటికి 270 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఓ సర్వే అంచనావేసిందన్నారు. యానిమేషన్‌‌కూ డిమాండ్‌‌ భారీగా పెరుగుతుందని, ఓటీటీ ప్లాట్‌‌ఫామ్స్ యానిమేషన్ స్టూడియోలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాయని చెప్పారు.  ఓటీటీ ప్రతేడాది 8 శాతం వృద్ధి సాధిస్తుందన్నారు.  ఓటీటీ బ్రాడ్‌‌కాస్టర్ కూడా లోకల్ భాషలో కంటెంట్ అందిస్తోందని చెప్పారు.

డిజిటల్ యాడ్స్ బాగా పెరుగుతాయ్…

డిజిటల్ అడ్వర్‌‌‌‌టైజింగ్‌‌ సైజు వచ్చే ఐదేళ్లలో భారీగా పెరుగుతుందని, 70 శాతం అడ్వర్‌‌‌‌టైజ్‌‌మెంట్లు గూగుల్, ఫేస్‌‌బుక్, యూట్యూబ్ లాంటి సంస్థలకే వెళ్తాయని కేపీఎంజీ డిజిటల్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ హెడ్‌‌ గిరీష్ మీనన్ అన్నారు. ఆన్‌‌లైన్ అడ్వర్‌‌‌‌టైజ్‌‌మెంట్లలో మనీ పెట్టడానికి అడ్వర్‌‌‌‌టైజర్లు అసలు ఆలోచించడం  లేదని వైకామ్18 డిజిటల్ వెంచర్స్  సీఓఓ గౌరవ్ రక్షిత్ చెప్పారు. కస్టమర్లను పొందడం కోసం జియో లాంటి సంస్థలతో డిజిటల్ పార్టనర్‌‌‌‌షిప్‌‌లు ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. ఓటీటీ పెద్ద మొత్తంలో ఆసక్తిని జనరేట్ చేస్తుందని తెలిపారు.

1000 కోట్ల పెట్టుబడి 16 లక్షల ఎస్ఎఫ్టీ

ఏవీజీసీ(యానిమేషన్, వీఎఫ్‌‌ఎక్స్, గేమింగ్, కామిక్స్) రంగం కోసం రూ. వెయ్యి కోట్ల పెట్టుబడితో రూపొందించబోతున్న ‘ఇమేజ్ టవర్స్’ 2021 చివరిలో లేదా 2022 ప్రారంభంలో అందుబాటులోకి వస్తుందని కేటీఆర్ వెల్లడించారు. ఈ టవర్స్ అచ్చం టీ ఫర్ తెలంగాణ ఆకారంలో ఉంటుంది. చార్మినార్‌‌‌‌ తరహాలో తెలంగాణ వారసత్వ సంపదగా ఈ బిల్డింగ్ నిలువాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ టవర్స్ ద్వారా ఏవీజీసీలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నామని చెప్పారు. గేమింగ్ అండ్ యానిమేషన్ కోసం సబ్సిడీలను ప్రకటించబోతున్నట్టు తెలిపారు. ఇండియాజాయ్ ద్వారా గేమింగ్ అండ్ డిజిటల్‌‌ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ సెక్టార్‌‌‌‌ను ప్రమోట్ చేయనున్నట్టు చెప్పారు. తెలంగాణ యానిమేషన్, గేమింగ్ ఇండస్ట్రీకి చక్కని వేదికవుతుందని అభిప్రాయపడ్డారు. 16 లక్షల చదరపు అడుగుల స్పేస్‌‌లో… పోలీసు కమిషనరేట్ బిల్డింగ్ కంటే రెండింతలు పెద్దదిగా ఇది ఉండబోతుంది. గేమింగ్, యానిమేషన్‌‌ రంగంలోని కంపెనీలకు పూర్తి ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను దీని ద్వారా అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్టార్టప్‌‌లకు ఇది అందుబాటులో ఉంటుంది.

మరిన్ని వార్తల కోసం