రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లో మళ్లీ గెహ్లాట్‌‌‌‌‌‌‌‌ x పైలట్

రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లో మళ్లీ గెహ్లాట్‌‌‌‌‌‌‌‌ x పైలట్
  • రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లో మళ్లీ గెహ్లాట్‌‌‌‌‌‌‌‌ x పైలట్
  • గత బీజేపీ ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ సచిన్ పైలట్ డిమాండ్

జైపూర్ : రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లో అధికార కాంగ్రెస్ పార్టీలో మళ్లీ వేడి రాజుకుంది. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య నాలుగేండ్లుగా జరుగుతున్న ఆధిపత్య పోరు ఎన్నికలకు కొన్ని నెలల ముందు మరోసారి రచ్చకెక్కింది. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తానంటూ సచిన్ పైలట్ చేసిన ప్రకటన కలకలం రేపింది. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం షహీన్ స్మారకం వద్ద ఒకరోజు దీక్ష చేయనున్నట్లు అల్టిమేటమ్ జారీ చేశారు. ఆదివారం జైపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 2018లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చేసిన ప్రకటనలు, ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందని రాష్ట్ర  ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.

ప్రభుత్వం ఫెయిల్

‘‘వసుంధర రాజే ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిపై (గెహ్లాట్ సర్కారు) ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రూ.45 వేల కోట్ల మైన్స్ స్కామ్‌‌‌‌‌‌‌‌పై దర్యాప్తు జరిపిస్తామని మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చాం. ఎన్నికలకు ఇంకా ఆరేడు నెలలు మాత్రమే సమయం ఉంది. ఏదో కుట్ర/కుమ్మక్కు జరిగిందనే భ్రమను ప్రత్యర్థులు వ్యాప్తి చేయొచ్చు. అందుకే.. మన మాటలు, చేతల్లో తేడా ఉండదని కాంగ్రెస్ కార్యకర్తలు భావించేలా వీలైనంత త్వరగా యాక్షన్ తీసుకోవాలి’’ అని పైలట్ డిమాండ్ చేశారు. ఎక్సైజ్ మాఫియా, ఇల్లీగల్ మైనింగ్, భూముల ఆక్రమణలు, లలిత్ మోడీ అఫిడవిట్ కేసుల విషయంలో చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ‘‘కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ.. నాకు రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు అప్పగించారు. వసుంధర రాజే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ తప్పుడు విధానాలను ఇతర నేతలతో కలిసి నేను వ్యతిరేకించా. అవినీతి అంశాన్ని బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నాడు కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది. అందువల్లే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోంచి దిగిపోయింది” అని సచిన్ పైలట్ చెప్పుకొచ్చారు. 

గెహ్లాట్ మాట్లాడిన వీడియోల ప్రదర్శన

బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ.. అసెంబ్లీలో, ఇతర వేదికల్లో గతంలో గెహ్లాట్ చేసిన ప్రకటనలకు సంబంధించిన వీడియోలను సచిన్ పైలట్ ప్రదర్శించారు. ‘‘బీజేపీ ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకోవాలని సీఎం అశోక్ గెహ్లాట్‌‌‌‌‌‌‌‌కు గతేడాది మార్చి 28న, నవంబర్ 2న లెటర్లు రాశాను. కానీ ఎలాంటి సమాధానం రాలేదు. అవినీతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరించాలి. దాన్ని మరింత బలోపేతం చేసేందుకు పారదర్శకంగా, ప్రభావవంతంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది’’ అని చెప్పారు. దురుద్దేశపూరిత చర్యలు తీసుకోవాలని తానెప్పుడూ కోరలేదని, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నిర్మించుకున్న విశ్వసనీయతను నిలబెట్టుకోవాలని స్పష్టం చేశారు. ‘‘ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మనం ఎన్నికలకు వెళ్లలేం. మన దగ్గర ఆధారాలున్నాయి. చర్యలు తీసుకోవాలి. త్వరలో మోడల్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ కండక్ట్‌‌‌‌‌‌‌‌ అమల్లోకి వస్తుంది. ప్రజలకు మనం జవాబుదారీగా ఉండాలి’’ అని చెప్పుకొచ్చారు.