ఇండియా కూటమి.. ప్రధాని అభ్యర్థిగా ఖర్గే!

ఇండియా కూటమి.. ప్రధాని అభ్యర్థిగా ఖర్గే!
  • ఇండియా కూటమి.. ప్రధాని అభ్యర్థిగా ఖర్గే!
  • ప్రతిపాదించిన ​బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
  • సున్నితంగా తిరస్కరించిన ఖర్గే
  • ముందు స్పష్టమైన మెజార్టీ తీసుకురావాలని కామెంట్​
  • ఢిల్లీలో నాలుగో సారి ఇండియా కూటమి నేతల భేటీ

న్యూఢిల్లీ: ‘ఇండియా’ కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంగళవారం ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే, ఖర్గే మాత్రం ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్లు ఇండియా కూటమి వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకించే ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కూడా ఖర్గే అభ్యర్థిత్వానికి ఆమోదించినట్లు తెలిసింది. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ నాలుగో సమావేశం మంగళవారం ఢిల్లీలోని అశోక హోటల్​లో జరిగింది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, కూటమిలో సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై సభ్యులు చర్చించారు. కూటమి  తరఫున ప్రధాని అభ్యర్థిగా ఎవరు ఉండాలనేది కూడా చర్చకు వచ్చింది. అప్పుడే.. ఖర్గే పేరును మమతా బెనర్జీ ప్రతిపాదించారు. మొత్తం 28 పార్టీల అధ్యక్షులు, ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

దళితుడే ప్రధాని.. వ్యూహంతో ముందుకు..

ఖర్గే దళిత సామాజిక వర్గానికి చెందిన కీలక నేత కావడంతో మమత ఈ ప్రతిపాదనను కూటమి ముందుంచారని కూటమి వర్గాలు తెలిపాయి. మొత్తం 28 పార్టీల లీడర్లు కూడా మమతా బెనర్జీ ప్రతిపాదనతో ఏకీభవించాయి. అయితే, ఖర్గే సున్నితంగా తిరస్కరించారని చెప్పాయి. తాను అణగారిన వర్గాల కోసం మాత్రమే పని చేయాలనుకుంటున్నానని ఆయన వెల్లడించారు. 

ప్రధానమంత్రి కావాలనే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. ‘‘ముందు కూటమికి స్పష్టమైన మెజారిటీ తీసుకురావాలి. దీనికోసం మనం ఏంచేయాలో ఆలోచిద్దాం. మెజారిటీ ఎంపీలే లేనప్పుడు ప్రధాని అభ్యర్థి గురించి చర్చించడం ఏంటి? ముందు భారీ మెజారిటీతో గెలుద్దాం.. ఆ తర్వాతే ప్రధాని ఎవరనేది నిర్ణయిద్దాం” అని సభ్యులతో ఖర్గే పేర్కొన్నారని కూటమి వర్గాలు తెలిపాయి.

రాష్ట్రపతి ఎన్నికల టైమ్​లో ఎస్సీ, ఎస్టీ తెగలకు చెందిన రామ్‌‌నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ములపై అభ్యర్థిని నిలబెట్టినందుకు అధికార బీజేపీ నుంచి ప్రతిపక్షం తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నది. కాంగ్రెస్, ఇతర పార్టీలు దళితులు, గిరిజనులకు వ్యతిరేకమని బీజేపీ ఆరోపించింది. ఈ క్రమంలోనే బీజేపీ విమర్శలకు చెక్ పెట్టేందుకు మమతా బెనర్జీ వ్యూహాత్మకంగా ఖర్గే పేరును ప్రతిపాదించారనే చర్చ జరుగుతున్నది. సమావేశానికి అపోజిషన్ పార్టీల లీడర్లు సోనియా గాంధీ, శరద్‌‌ పవార్‌‌, బీహార్‌‌ సీఎం నితీశ్​, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌‌, రాహుల్‌‌ గాంధీ, ఉద్ధవ్‌‌ ఠాక్రే ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు.

22న దేశవ్యాప్తంగా నిరసన: ఖర్గే

దేశ చరిత్రలో మొదటిసారి పెద్ద సంఖ్యలో ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారని ఖర్గే మండిపడ్డారు. ఇది బీజేపీ అహంకారానికి పరాకాష్ట అని ధ్వజమెత్తా రు. కూటమి సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌‌లో అపోజిషన్ పార్టీల సభ్యులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 22న దేశ వ్యాప్త ఆందోళన నిర్వహించాలని నిర్ణయిం చామన్నారు.

రాష్ట్ర స్థాయిలో సీట్ల సర్దుబా టు అంశంపై చర్చిస్తామన్నారు. తర్వాత కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. సీట్ల సర్దుబా టుపైనా చర్చించినట్టు వెల్లడించారు. వచ్చే లోక్‌‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలు, ఉమ్మడి ప్రచారం వంటి అంశా లపై చర్చించనున్నట్లు తెలిపారు. అయితే, సీట్ల సర్దుబాటుపై పార్టీలన్నీ డిసెంబర్ 31ను డెడ్​లైన్ పెట్టినట్లు తెలిసింది.