పాక్ పై ఇండియా గ్రాండ్ విక్టరీ

 పాక్ పై ఇండియా గ్రాండ్ విక్టరీ

దుబాయ్‌‌‌‌: చూడటానికి చిన్న టార్గెటే.. కానీ బాల్‌‌ బాల్‌‌కు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌‌లో హార్దిక్‌‌ పాండ్యా (17 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 33 నాటౌట్‌‌, 3/25) అద్భుతం చేశాడు. అటు బౌలింగ్‌‌, ఇటు బ్యాటింగ్‌‌లో సూపర్‌‌ షో చూపెట్టడంతో.. ఆసియా కప్‌‌లో ఇండియా బోణీ చేసింది. ఆదివారం జరిగిన గ్రూప్‌‌–ఎ లీగ్‌‌ మ్యాచ్‌‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌‌ను చిత్తు చేసింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన పాక్‌‌ 19.5 ఓవర్లలో 147కు ఆలౌటైంది. మహ్మద్‌‌ రిజ్వాన్‌‌ (42 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 43) టాప్‌‌ స్కోరర్‌‌.  భువనేశ్వర్‌‌ (4/26), పాండ్యా దుమ్మురేపారు. తర్వాత ఇండియా -19.4- ఓవర్లలో 148/5- స్కోరు చేసి గెలిచింది. విరాట్‌‌ కోహ్లీ (34 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 35), రవీంద్ర జడేజా (29 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 35) రాణించారు. పాండ్యాకు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

భువీ జోరు.. పాండ్యా హోరు

టాస్‌‌ గెలవడం ఇండియాకు వరంగా మారితే.. బౌలింగ్‌‌ పిచ్‌‌పై మ్యాచ్‌‌ ఆరంభం, అంతం భువనేశ్వర్‌‌దే జోరు. ఎదుర్కొన్న తొలి బాల్‌‌ను బౌండ్రీకి తరలించిన కెప్టెన్‌‌ బాబర్‌‌ ఆజమ్‌‌ (10)ను మూడో ఓవర్‌‌లోనే ఔట్‌‌ చేసి అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. మ్యాచ్‌‌ మధ్యలో హార్దిక్‌‌ పాండ్యా, అర్ష్‌‌దీప్‌‌ సింగ్‌‌ (2/33) చెలరేగారు. బాబర్‌‌ ఔట్‌‌తో భయపడిన రిజ్వాన్‌‌, ఫఖర్‌‌ జమాన్‌‌ (10) సింగిల్స్‌‌కే పరిమితమయ్యారు. ఆరో ఓవర్‌‌లో ఫఖర్‌‌ను ఆవేశ్‌‌ ఖాన్‌‌ (1/19) ఔట్‌‌ చేయడంతో  పవర్‌‌ప్లేలో పాక్‌‌ 43/2 స్కోరు చేసింది. తర్వాత స్పిన్నర్లు చహల్‌‌, జడేజా రాకతో రిజ్వాన్‌‌, ఇఫ్తికార్‌‌ (28).. తర్వాతి నాలుగు ఓవర్లలో 25 రన్స్‌‌ రాబట్టారు. మొత్తానికి ఫస్ట్‌‌ టెన్‌‌లో పాక్‌‌ 68/2 స్కోరుకు చేరింది. 12వ ఓవర్‌‌లో చహల్‌‌ బాల్‌‌ను ఇఫ్తికార్‌‌ సిక్సర్‌‌గా మలిచి వేగం పెంచాడు. అప్పటివరకు బాగా ఆడిన పాక్‌‌ను 13వ ఓవర్‌‌లో పాండ్యా దెబ్బకొట్టాడు. తన తర్వాతి రెండు ఓవర్లలో మూడు వికెట్లు తీశాడు. 13వ ఓవర్‌‌ ఫస్ట్‌‌ బాల్‌‌కు పాండ్యా బాల్​నును ఆడే క్రమంలో ఇఫ్తికార్‌‌... కార్తీక్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు.  దీంతో మూడో వికెట్‌‌కు 45 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది.15వ ఓవర్‌‌లో మూడు బాల్స్‌‌ తేడాలో రిజ్వాన్‌‌, కుష్దీల్‌‌ షా (2)ను పెవిలియన్‌‌కు పంపాడు. ఫలితంగా పాక్‌‌ 15 ఓవర్లలో 103/5తో కష్టాల్లో పడింది. ఆసిఫ్‌‌ అలీ (9), షాదాబ్‌‌ ఖాన్‌‌ (10) ఇన్నింగ్స్‌‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేసినా సక్సెస్‌‌ కాలేదు. వరుస ఓవర్లలో ఆసిఫ్‌‌, మహ్మద్‌‌ నవాజ్‌‌ (1) ఔటయ్యారు. వచ్చి రాగానే రవూఫ్‌‌ (13 నాటౌట్‌‌) రెండు ఫోర్లు బాదాడు. కానీ 19వ ఓవర్‌‌లో భువీ దెబ్బకు షాదాబ్‌‌, నసీమ్‌‌ షా (0) ఎల్బీ అయ్యారు. చివర్లో షానవాజ్‌‌ (16) రెండు సిక్సర్లు కొట్టడంతో పాక్‌‌ మంచి టార్గెట్‌‌నే నిర్దేశించింది. 

ఆదుకున్న జడేజా.. ముగించిన హార్దిక్

టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ​ఇండియాను పాక్ డెబ్యూ పేసర్​, 19 ఏండ్ల నసీమ్​ షా (2/27) వణికించాడు.  రెండో బాల్‌‌కే రాహుల్‌‌ (0)ను బౌల్డ్​ చేశాడు.  నాలుగో బాల్‌‌కు కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌‌ను ఫఖర్‌‌ జమాన్‌‌ జారవిడిచాడు. దీంతో కాస్త వెనక్కి తగ్గిన కోహ్లీ, రోహిత్‌‌ (12) ఆచితూచి ఆడారు. నాలుగో ఓవర్‌‌లో కోహ్లీ సిక్స్‌‌తో టచ్‌‌లోకి వచ్చాడు. ఆ వెంటనే మరో రెండు ఫోర్లు కొట్టడంతో పవర్‌‌ప్లేలో ఇండియా 38/1 స్కోరు చేసింది. అప్పటివరకు క్రీజులో ఇబ్బందిపడ్డ హిట్‌‌మ్యాన్‌‌ రోహిత్‌‌ 8వ ఓవర్‌‌లో నాలుగో బాల్‌‌ను భారీ సిక్సర్‌‌ బాదాడు. ఆఖరి బాల్‌‌ను కూడా అదే స్థాయిలో గాల్లోకి లేపగా బౌండ్రీ వద్ద ఇఫ్తికార్‌‌ క్యాచ్‌‌ అందుకున్నాడు. తర్వాతి ఓవర్‌‌లో కోహ్లీ కూడా అదే రీతిలో ఔట్‌‌కావడంతో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు వికెట్లు నవాజ్‌‌ (3/33) ఖాతాలోకి వెళ్లాయి. ఈ ఇద్దరు రెండో వికెట్‌‌కు 49 రన్స్‌‌ జోడించారు. అయితే ఇదే ఓవర్‌‌లో జడేజా లాంగాన్‌‌లో సూపర్‌‌ సిక్స్‌‌ దంచడంతో తొలి 10 ఓవర్లలో ఇండియా 62/3 స్కోరు చేసింది. సూర్యకుమార్‌‌ (18) జడ్డూతో కలిసి సింగిల్స్‌‌, డబుల్స్‌‌ తీయడంతో స్కోరు బోర్డు నెమ్మదిగా కదిలింది. అయితే 15వ ఓవర్లో  నసీమ్‌‌ షా.. సూర్యను క్లీన్‌‌బౌల్డ్‌‌ చేయడంతో నాలుగో వికెట్‌‌కు 36 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. వచ్చి రావడంతోనే హార్దిక్‌‌ ఫోర్‌‌తో కుదురుకోగా, 16, 17 ఓవర్లలో 19 రన్స్‌‌ రావడంతో ఇండియా విజయానికి 18 బాల్స్‌‌లో 32 రన్స్‌‌ అవసరమయ్యాయి. ఈ దశలో జడేజా 4, 6 బాదడంతో విజయ సమీకరణం 12 బాల్స్‌‌లో 21 రన్స్‌‌గా మారింది.  19వ ఓవర్లో పాండ్యా 4, 4, 4 కొట్టి జట్టుపై ఒత్తిడి తగ్గించాడు.  కానీ లాస్ట్‌‌ ఓవర్‌‌లో జడేజా ఔట్‌‌కావడంతో మళ్లీ ఉత్కంఠ మొదలైంది. అయితే, నాలుగో బాల్​కు పాండ్యా భారీ సిక్సర్‌‌తో మ్యాచ్​ ముగించాడు. 

సంక్షిప్త స్కోర్లు

పాకిస్తాన్‌: 19.5 ఓవర్లలో 147 ఆలౌట్‌ (రిజ్వాన్‌ 43, ఇఫ్తికార్‌ 28, భువనేశ్వర్‌ 4/26, పాండ్యా 3/25).

ఇండియా: 19.4 ఓవర్లలో 148/5 (కోహ్లీ 35, జడేజా 35, పాండ్యా 33*, నవాజ్‌ 3/33).

విజయ్‌‌ సందడి


ఇండియా–పాకిస్తాన్‌‌ మ్యాచ్‌‌లో తెలుగు హీరో విజయ్‌‌ దేవరకొండ స్టేడియంలో సందడి చేశాడు. తన కొత్త చిత్రం లైగర్‌‌ ప్రమోషన్స్‌‌లో భాగంగా స్టార్‌‌ స్పోర్ట్స్‌‌ చానెల్‌‌ లైవ్‌‌లో మాట్లాడాడు.  స్టేడియంలో కూర్చొని మ్యాచ్‌‌ చూశాడు. అవకాశం వస్తే  విరాట్‌‌ కోహ్లీ బయోపిక్‌‌లో హీరోగా నటిస్తానని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పాడు.