ఇంటర్నెట్ బందయింది ..9,218 కోట్లు లాసైంది

ఇంటర్నెట్ బందయింది ..9,218 కోట్లు లాసైంది
  • 2019లో 370, సీఏఏ, ఎన్నార్సీ ఆందోళనలతో దేశంలో పలుమార్లు నెట్‌ షట్‌డౌన్‌
  • ఎకానమీకి భారీ నష్టం..ఇరాక్, సూడాన్ తర్వాత మూడో ప్లేస్

జమ్మూకాశ్మీర్ లో ఇటీవల నెలల తరబడీ ఇంటర్నెట్ బంద్ అయింది. ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ, ఎన్ఆర్ సీ, ఎన్ పీఆర్ వంటి ఆందోళనల నేపథ్యంలో దేశంలోని అనేక ఇతర ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ ను తాత్కాలికంగా బంద్ చేశారు. అయితే, ఇట్లా ఇంటర్నెట్ బంద్ కావడం వల్ల ఒకవైపు ప్రజలకు ఇబ్బందులు వస్తే.. మరోవైపు మన దేశ ఎకానమీకి సైతం భారీ స్థాయిలో నష్టం జరిగిందట. ఈ నష్టం సుమారుగా రూ. 9 వేల కోట్లకు పైనే ఉంటుందట. బ్రిటన్ కు చెందిన ‘టాప్10వీపీఎన్’ టెక్ రీసెర్చ్ కంపెనీ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయాలు వెలుగుచూశాయి.

థర్డ్ ప్లేస్ లో ఇండియా..

ప్రపంచవ్యాప్తంగా 2019లో ఇంటర్నెట్ బ్లాకౌట్ వల్ల ఎకానమీకి తీవ్ర నష్టం కలిగిన దేశాల్లో ఇరాక్, సూడాన్ ల తర్వాత ఇండియా మూడో స్థానంలో ఉందని నివేదిక తెలిపింది. ఇరాక్ లో 263 గంటలు ఇంటర్నెట్ షట్ డౌన్ అయిందని, 230 కోట్ల డాలర్ల  (రూ.16 వేల కోట్లు) నష్టం జరిగిందని వెల్లడించింది. సూడాన్ లో 1,560 గంటలు ఇంటర్నెట్ ఆగిపోవడం వల్ల190 కోట్ల డాలర్లు (రూ.13 వేల కోట్లు) లాస్ అయిందని పేర్కొంది. ఇక ఇండియాలో 2019లో 4,196 గంటల పాటు ఇంటర్నెట్ షట్ డౌన్ అయిందని, దీనివల్ల 130 కోట్ల డాలర్ల (రూ.9,218 కోట్లు) నష్టం జరిగిందని నివేదిక తెలిపింది.

కాశ్మీర్ లో రూ.7 వేల కోట్ల లాస్.. 

గతేడాది జమ్మూకాశ్మీర్‌లో ఇంటర్నెట్ ఆగినందుకే 110 కోట్ల డాలర్ల (రూ.7 వేల కోట్లు) లాస్ అయిందని, సీఏఏ వ్యతిరేక నిరసనల కారణంగా యూపీలో 6.3 కోట్ల డాలర్ల (రూ. 446 కోట్లు) నష్టం, మిగతా ప్రాంతాల్లో10 కోట్ల డాలర్ల (రూ.709 కోట్లు) ఆర్థిక నష్టం జరిగిందని టాప్10వీపీఎన్ పేర్కొంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 18,225 గంటలు షట్ డౌన్స్ జరిగాయని, వీటివల్ల 800 కోట్ల డాలర్ల (రూ.56,727 కోట్లు) నష్టం కలిగిందని నివేదిక వివరించింది.