ర్యాపిడ్ డెవలప్​మెంట్ కోసం.. రోజుకు 24 గంటలు పనిచేయాలి : మోదీ

ర్యాపిడ్ డెవలప్​మెంట్ కోసం.. రోజుకు 24 గంటలు పనిచేయాలి : మోదీ
  • ‘వికసిత్​ భారత్’ ప్రారంభంలో ప్రధాని మోదీ
  • యువత తమ ఆలోచనలు పంచుకోవాలని సూచన

న్యూఢిల్లీ : దేశానికి నాయకత్వం వహించేందుకు యువత రెడీ అవ్వాలని.. అభివృద్ధి, జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందిన ఇండియా కోసం దేశంలోని ప్రతి యువకుడిని ఒక యాక్షన్​ ప్లాన్​తో కనెక్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని చెప్పారు. వికసిత్ భారత్ @2047: వాయిస్​ ఆఫ్ యూత్​ను సోమవారం మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని రాజ్​భవన్​లలో వర్క్​షాప్​లను ఏర్పాటు చేశారు. ఈ వర్క్​ షాప్​లలో టీచర్లు, ప్రొఫెసర్లు, వీసీలు, ఎడ్యుకేషనల్​ ఇన్ స్టిట్యూట్ల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ వారందరితో వర్చువల్​గా మాట్లాడారు. యువత దేశాభివృద్ధికి అవసరమైన ఆలోచనలను పంచుకోవడానికి వికసిత్ భారత్ ఒక మంచి ప్లాట్ ఫామ్ అని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియా అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్నదని తెలిపారు. ఈ అమృత్ కాల్ లో ప్రతి సెకండ్​ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

దేశంలో జనాభా వేగంగా పెరుగుతున్నదని.. రాబోయే 25 నుంచి 30 ఏండ్లలో పని చేసే వయస్సు జనాభా పరంగా ఇండియా టాప్​ప్లేస్​లో ఉండబోతున్నదని మోదీ చెప్పారు. “యువశక్తే దేశ మార్పుకు ప్రతినిధి.. ఆ మార్పుతో బెనిఫిట్ పొందేది కూడా యువతనే. రాబోయే 25 ఏండ్ల పాటు కాలేజీలు, యూనివర్సిటీలు యువత కెరీర్‌‌కు నిర్ణయాత్మకం కానున్నాయి.  టీచర్లు, వర్సిటీలు ఇండియాను వేగంగా అభివృద్ధిచెందిన దేశంగా మార్చడానికి దారులు వెతకాలని, అభివృద్ధికి అవకాశం ఉన్న రంగాలను గుర్తించాలి. యువకులే కొత్త సమాజాలు, సమూహాలు సృష్టించబోతున్నరు. భవిష్యత్తులో కొత్త సమాజం, అభివృద్ధిచెందిన ఇండియా ఎలా ఉండాలో నిర్ణయించే హక్కు వారిదే” అని అన్నారు.