సాగర తీరానా జోరు సాగనీ!..ఇవాళ సఫారీలతో తొలి టెస్టు

సాగర తీరానా జోరు సాగనీ!..ఇవాళ సఫారీలతో తొలి టెస్టు

విశాఖపట్నం:  ప్రతిష్టాత్మక గాంధీ–మండేలా టెస్ట్‌‌ సిరీస్‌‌కు ఇండియా, సౌతాఫ్రికా రెడీ అయ్యాయి. మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో భాగంగా బుధవారం ఇక్కడి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో మొదలయ్యే తొలి టెస్ట్‌‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి.  ఈ ఫార్మాట్‌‌లో స్వదేశంలో సౌతాఫ్రికాపై, ఓవరాల్‌‌గా  మెరుగైన రికార్డు ఉన్న కోహ్లీసేన అదే జోరుతో హోమ్‌‌గ్రౌండ్‌‌లో వరుసగా పదకొండో సిరీస్‌‌  గెలిచి వరల్డ్‌‌ రికార్డు సృష్టించాలని పట్టుదలగా ఉంది. 2013 నుంచి స్వదేశంలో ఆడిన పది సిరీస్‌‌ల్లో విజయం సాధించిన ఇండియా..  ఆస్ట్రేలియా పేరిట ఉన్న వరల్డ్‌‌ రికార్డును సమం చేసింది.  ఈ సిరీస్‌‌లో గెలిస్తే హోమ్‌‌గ్రౌండ్‌‌లో వరుసగా అత్యధిక సిరీస్‌‌లు నెగ్గిన జట్టుగా  కొత్త చరిత్ర లిఖిస్తుంది. ఈ మ్యాచ్‌‌లో నెగ్గి అందుకు తొలి అడుగు బలంగా వేయాలని భావిస్తోంది.  నాలుగేళ్ల కిందట ఇండియా టూర్‌‌కు వచ్చిన సౌతాఫ్రికాను 3-–0తో వైట్‌‌వాష్‌‌ చేయడం టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు. మరోవైపు సంధిదశలో ఉన్న సౌతాఫ్రికాకు ఈ సిరీస్‌‌ పెద్ద పరీక్షగా నిలవనుంది. ప్రాక్టీస్‌‌ మ్యాచ్‌‌లో ఫర్వాలేదనిపించినా అసలు సమరంలో ఎంతవరకు నిలుస్తుందో చూడాలి.

సాహా ఇన్‌‌.. పంత్‌‌ ఔట్‌‌..

ఈ సిరీస్‌‌లో ఇండియా టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ ప్రయోగాలు చేస్తోంది. మంగళవారమే తుది జట్టును ప్రకటించింది.  ఫామ్‌‌ కోల్పోయి, నిర్లక్ష్యపు షాట్లతో వికెట్‌‌ పారేసుకుంటున్న యంగ్‌‌ వికెట్‌‌ కీపర్‌‌ రిషబ్‌‌ పంత్‌‌పై  వేటు వేసి,  అతని స్థానంలో 34 ఏళ్ల వెటరన్‌‌ వికెట్‌‌ కీపర్‌‌ వృద్ధిమాన్‌‌ సాహాను తీసుకుంది.  గాయం కారణంగా టీమ్‌‌కు దూరమైన సాహా.. దాదాపు 22 నెలల తర్వాత తిరిగి బరిలోకి దిగనున్నాడు. ఇండియాలో  మంచి రికార్డు ఉండడంతోపాటు అనుభవం, మెరుగైన టెక్నిక్‌‌ కారణంగా మేనేజ్‌‌మెంట్‌‌ అతని వైపు మొగ్గు చూపింది.  మరోవైపు లిమిటెడ్‌‌ ఓవర్ల క్రికెట్‌‌లో అందనంత ఎత్తుకు ఎదిగిన రోహిత్‌‌ శర్మ ఈ టెస్టుతో ఓపెనర్‌‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. మయాంక్‌‌ అగర్వాల్‌‌తో కలిసి అతను ఇన్నింగ్స్‌‌ను ఆరంభించనున్నాడు. షార్ట్‌‌ ఫార్మాట్‌‌లో ఎన్నో  రికార్డులు తన పేరిట లిఖించుకున్న రోహిత్‌‌.. లాంగ్‌‌ ఫార్మాట్‌‌లోనూ అదే స్థాయి ఆటతీరుతో జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నాడు.  వామప్‌‌ మ్యాచ్‌‌లో డకౌటైన అతను.. ఫ్రెష్‌‌గా ఈ సిరీస్‌‌ను ప్రారంభించాలని యోచిస్తున్నాడు. రోహిత్‌‌ కుదురుకునే వరకు అవకాశాలిస్తామని టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ భరోసానిచ్చిన క్రమంలో ఈ మ్యాచ్‌‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగుతున్నాడు. వన్‌‌డౌన్‌‌లో పుజారా, నాలుగోస్థానంలో కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ బాధ్యత తీసుకుంటారు.  మూడేళ్ల కిందట ఇక్కడ ఇంగ్లండ్‌‌తో జరిగిన ఏకైక టెస్టులో అద్భుత ఆటతీరుతో కోహ్లీ మ్యాన్‌‌ ఆఫ్‌‌ దిమ్యాచ్‌‌గా నిలిచాడు.

హోమ్‌‌గ్రౌండ్‌‌లో విహారి ‘తొలి టెస్ట్‌‌’

మిడిలార్డర్‌‌లో అజింక్యా రహానెతో కలిసి జట్టు బాధ్యతలు మోయనున్న లోకల్‌‌ స్టార్‌‌, తెలుగు క్రికెటర్‌‌ హనుమ విహారిపై కూడా అందరి దృష్టి ఉంది. స్వదేశంలో విహారి ఆడుతున్న తొలి టెస్ట్‌‌ ఇది.  ఇప్పటివరకు అతను ఆడిన ఆరు టెస్టులు విదేశీగడ్డపైనే జరగడం విశేషం. తన హోంగ్రౌండ్‌‌లో స్వదేశంలో  మొదటి మ్యాచ్‌‌ను స్పెషల్‌‌గా మార్చుకోవాలని హనుమ కోరుకుంటున్నాడు. వెస్టిండీస్‌‌పై కెరీర్‌‌లో తొలి సెంచరీ కొట్టి మంచి ఫామ్‌‌లో ఉన్న విహారి తనకు పూర్తి అవగాహన ఉన్న గ్రౌండ్‌‌లోనూ బ్యాట్‌‌తో పాటు మూడో స్పిన్నర్‌‌గా  సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఏడో నంబర్‌‌లో సాహా బరిలోకి దిగనుండగా.. చాలా రోజుల తర్వాత  సీనియర్‌‌ స్పిన్నర్లు  రవిచంద్రన్‌‌ అశ్విన్‌‌, రవీంద్ర జడేజా స్పిన్‌‌ విభాగాన్ని నడిపించనున్నారు.  గత డిసెంబర్‌‌లో చివరి టెస్టు ఆడిన అశ్విన్‌‌.. పూర్వపు ఫామ్‌‌ కోసం తహతహలాడుతున్నాడు. వెస్టిండీస్‌‌ టూర్‌‌లో ఆకట్టుకున్న జడేజా అదే తరహా ఆటతీరును కొనసాగిస్తే జట్టుకు తిరుగుండదు. బుమ్రా గైర్హాజరీలో  సీనియర్లు ఇషాంత్‌‌ శర్మ, మహ్మద్‌‌ షమీ పేస్‌‌ బాధ్యతలు మోయనున్నారు.

 సఫారీలు ఏం చేస్తారో..

1991లో ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌లో రీఎంట్రీ ఇచ్చాక ఇండియా టూర్‌‌కు సౌతాఫ్రికా రావడం ఇది ఏడోసారి. అయితే గత టీమ్‌‌ల కంటే ఈసారి ప్రొటీస్‌‌ బలహీనంగా కన్పిస్తోంది. లెజెండరీ ప్లేయర్లు డివిలియర్స్‌‌, హషీమ్‌‌ ఆమ్లా, ఇమ్రాన్‌‌ తాహిర్‌‌ రిటైర్మెంట్‌‌ ప్రకటించడంతో సఫారీలు సంధి దశలో ఉన్నారు. ఈనేపథ్యంలో చాలామంది కొత్త ఆటగాళ్లతోనే బరిలోకి దిగుతోంది. 2015లో ఇండియా టూర్‌‌లో ఆడిన ఆటగాళ్లలో కేవలం ఐదుమంది మాత్రమే ప్రస్తుత టీమ్‌‌లో ఉన్నారు. అందరి కంటే ఎక్కువగా కెప్టెన్‌‌ ఫా డుప్లెసిస్‌‌పై జట్టు ఆధారపడుతోంది. టీ20 సిరీస్‌‌లో రాణించిన వికెట్‌‌ కీపర్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ క్వింటన్‌‌ డికాక్‌‌పై కూడా ఆశలు పెట్టుకుంది. ఆ సిరీస్‌‌లో నాయకుడిగాను డికాక్‌‌ నిరూపించుకోవడం ప్లస్ పాయింట్‌‌. ఇక వామప్‌‌ మ్యాచ్‌‌ల్లో సత్తాచాటిన ఐడెన్‌‌ మార్‌‌క్రమ్‌‌, టెంబా బవ్యుమా ఫామ్‌‌లో ఉండడం సానుకూలాంశం. డీన్‌‌ ఎల్గర్‌‌, థేనియస్‌‌ డిబ్రూన్‌‌లు బ్యాట్‌‌తో సత్తాచాటాలని టీమ్​ మేనేజ్​మెంట్​ భావిస్తోంది. ఇక బౌలింగ్‌‌లో కగిసో రబాడ, లుంగీ ఎంగిడి, వెర్నన్‌‌ ఫిలాండర్‌‌ లాంటి వరల్డ్‌‌క్లాస్‌‌ ప్లేయర్లతో పటిష్టంగా ఉంది. కేశవ్‌‌ మహారాజ్‌‌ స్పిన్‌‌ బాధ్యతలు చూస్తున్నాడు.  టీ20  సిరీస్‌‌లో టీమిండియాను నిలువరించడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది.

జట్లు

ఇండియా: కోహ్లీ (కెప్టెన్‌‌), రోహిత్‌‌, మయాంక్‌‌, పుజారా, రహానె, విహారి, సాహా, అశ్విన్‌‌, జడేజా, షమీ, ఇషాంత్‌‌.

సౌతాఫ్రికా (అంచనా): డుప్లెసిస్‌‌ (కెప్టెన్‌‌), మార్‌‌క్రమ్‌‌, ఎల్గర్‌‌, బవ్యుమా, డి బ్రూన్‌‌, డికాక్‌‌, రబాడ, జుబేర్‌‌, ఫిలాండర్‌‌, ఎంగిడి, మహారాజ్‌‌