భారత్​ –చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత..సైనికులకు గాయాలు 

భారత్​ –చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత..సైనికులకు గాయాలు 

ఇండియా - చైనా బార్డర్​ లో ఉద్రిక్తత ఏర్పడింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ లోని తవాంగ్‌ సెక్టార్‌ వద్ద ఇరు దేశాల సైనికులు ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. డిసెంబరు 9న వాస్తవాధీన రేఖ వద్ద ఈ ఘర్షణ చోటుచేసుకోగా.. ఇరు దేశాలకు చెందిన పలువురు సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఎల్‌ఏసీ సమీపంలోకి చైనా సైనికులు చొచ్చుకు రావడంతో ఈ ఘర్షణ జరిగిందని భారత ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో అక్కడ శాంతి, సామరస్య వాతావరణాన్ని పునరుద్ధరించేందుకు ఇరు దేశాల సైనికాధికారులు ఫ్లాగ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఇరు దేశాల సైన్యాలు అక్కడి నుంచి తమ బలగాల్ని వెనక్కి రప్పించినట్టు సమాచారం. తూర్పు లద్దాఖ్‌లో ఘర్షణ తర్వాత ఇండియా,చైనా బార్డర్​ లో ఈ తరహా ఘటన జరగడం ఇదే తొలిసారి.

అంతకుముందు 2020 జూన్‌ లో గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. అయితే ఆ ఘటనలో 40 మంది చైనా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు.  తాజాగా అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడంతో సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.