ఆటో రంగంలో ఆటుపోట్లు ఆగుతయా?

ఆటో రంగంలో ఆటుపోట్లు ఆగుతయా?

వెలుగు, బిజినెస్‌‌డెస్క్కారు, ఆటో కదలడం లేదు.. సేల్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ సారి బడ్జెట్‌‌లో అయినా ఆదుకోకపోతే, కుయ్యో ముర్రో అనడమే. ఒకవైపు ఎన్‌‌బీఎఫ్‌‌సీల్లో లిక్విడిటీ సంక్షోభం, మరోవైపు ఎకానమీలో పరిస్థితులు బాగోలేకపోవడం, బీఎస్‌‌ 6 నార్మ్స్ అమలు,  ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెంపు, బ్యాంక్‌‌లు రుణాలు ఇవ్వడానికి రూల్స్‌‌ కఠినతరం చేయడం .. అన్నీ కలిసి వచ్చి ఆటో  రంగంపైనే పడ్డాయి. గత ఇరవై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు పడిపోయాయి. షోరూంలలో బండ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. భారీ ఎత్తున డిస్కౌంట్లు ప్రకటిస్తున్నా… ప్రతి నెలా కంపెనీలు వరుసపెట్టి నెగిటివ్ సేల్స్‌‌నే నమోదు చేస్తున్నాయి. ఈ దెబ్బకి దిగ్గజ కంపెనీలు సైతం ప్రొడక్షన్‌‌ను ఆపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రొడక్షన్ ఆగడంతో దేశంలోనే అతిపెద్ద ఎంప్లాయ్‌‌మెంట్ క్రియేటర్‌‌గా పేరొందిన ఈ రంగంలో ఉద్యోగాల కోత ప్రారంభమైంది. పరోక్షంగా, ప్రత్యక్షంగా ఈ రంగంలో పనిచేస్తోన్న లక్షల మంది ఉద్యోగులను ఆటో కంపెనీలు, డీలర్లు  ఇంటికి పంపించేశారు. అంతేకాక కార్లపై జీఎస్టీ కూడా అధికంగానే ఉంది. దీనికి తోడు మార్కెట్‌‌లో లిక్విడిటీ లేకపోవడంతో, వినియోగదారులు కార్ల కొనుగోలుకు బ్రేక్ చెప్పారు.

దీంతో 2019లో కార్ల అమ్మకాలు 14 శాతం మేర తగ్గి 23.07 మిలియన్ యూనిట్లుగా నమోదయ్యాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్(సియామ్) డేటా రివీల్ చేసింది. ఏప్రిల్ 1 తర్వాత బీఎస్‌‌ 6 నార్మ్స్ వచ్చాక  కూడా కనీసం రెండు క్వార్టర్ల వరకు రిటైల్ డిమాండ్ డల్‌‌గానే ఉంటుందని ఇండస్ట్రీ అంచనావేస్తోంది. ఈ నేపథ్యంలో కార్ల కంపెనీలు ఈసారి బడ్జెట్‌‌ పై ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాయి. సేల్స్ తగ్గుతున్నప్పటి నుంచి ఆటో ఇండస్ట్రీ తమపై ఉన్న జీఎస్టీని తగ్గించాలని కోరుతూనే ఉంది. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్‌‌ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఆటో ఇండస్ట్రీపై అత్యధికంగా 28 శాతం జీఎస్టీ రేటు ఉంది. దీన్ని 18 శాతానికి తగ్గించాలని కోరుతోంది. జీఎస్టీ తగ్గిస్తే.. రిటైల్ డిమాండ్ పెరిగి, ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూలు వస్తాయని ఆటో ఇండస్ట్రీ చెబుతోంది. ఒకవేళ జీఎస్టీ తగ్గించకపోతే, రిటైల్ సేల్స్ మరింత పడిపోయి, జీఎస్టీ రెవెన్యూ తగ్గిపోతుందని హెచ్చరిస్తోంది.

స్క్రాపేజ్ పాలసీ…

ఇండియన్ రోడ్లపై పొల్యూషన్‌‌ క్రియేట్ చేసే ట్రక్కులు, బస్సులు చాలానే చక్కర్లు కొడుతున్నాయి. వీటికి స్వస్తి చెప్పకపోతే, పొల్యూషన్  మరింత పెరుగుతుంది. ఈ పొల్యూషన్‌‌తో  ప్రజల ఆరోగ్యానికి పెద్ద ముప్పే పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. పొల్యూషన్‌‌ తగ్గించేందుకు ప్రపంచంలోని  చాలా దేశాలు, విధానాలలో మార్పులు చేస్తున్నాయి. దీంతో మన దేశంలోనూ  స్క్రాపేజ్ పాలసీని త్వరగా అమలు చేయాలని ఇండస్ట్రీ కోరుతోంది. ఈ పాలసీతో కేవలం ట్రక్కులు, బస్సుల ఓనర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వడమే కాకుండా.. ఒక సమయానికి మించి వెహికిల్స్‌‌ను వాడటానికి వీలుండదు.

ఈవీ బ్యాటరీ తయారీకి ప్రోత్సాహకాలు…

లిథియం అయాన్ సెల్స్ దిగుమతులపై కస్టమ్ డ్యూటీ నుంచి ఊరట ఇవ్వాలని ఇండస్ట్రీ కోరుతోంది. ఇది ఇండియాలో ఈవీ ఎకో సిస్టమ్ డెవలప్‌‌ అవ్వడానికి ఎంతో అవసరమని, ముఖ్యంగా బ్యాటరీ మానుఫ్యాక్చరింగ్‌‌కు ఎంతో కీలకమని అంటోంది. ప్రభుత్వం కూడా ఇండియాలో ఈవీ బ్యాటరీలు తయారు చేసే వారికి ప్రోత్సహకాలు ఇచ్చేందుకు చూస్తోంది.

కరెంటు బండ్లు కొంటే రాయితీలు..

ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వెహికిల్స్‌‌ వినియోగం వెంటనే పెరిగేందుకు ప్రభుత్వం ఇన్సెంటివ్స్‌‌ ప్రకటిస్తోంది.  ఎలక్ట్రిక్‌‌ వెహికిల్స్‌‌ తయారీదారులకే కాకుండా, కస్టమర్లకూ ఈ ఇన్సెంటివ్స్‌‌ ఉండేలా చొరవ తీసుకుంటోంది.  ఫేమ్ 2 స్కీమ్ కింద రూ.10 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఈ స్కీమ్‌‌ను కార్ల కొనుగోలుదారులందరికీ వర్తింప చేయాలని ఇండస్ట్రీ కోరుతోంది. ఒక్కో వెహికిల్ కొనుగోలుపై రూ. లక్షన్నర వరకు ఇన్సెంటివ్‌‌ ఇవ్వాలని అడుగుతోంది. ఈ స్కీమ్ కింద ప్రస్తుతం కమర్షియల్ వాడకానికి మాత్రమే ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వెహికిల్స్ కొనేవారికి ప్రయోజనాలను కల్పిస్తున్నారు.

20 ఏళ్ల కిందట బడ్జెట్.. సాయంత్రమే

2000 సంవత్సరం వరకు బడ్జెట్‌‌ను ఫిబ్రవరిలో చివరి వర్కింగ్ డే నాడు సాయంత్రం 5 గంటలకు ప్రజెంట్ చేసేవారు. 2001లో ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఈ ట్రెడిషన్‌‌ను మార్చేసి, ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టడం స్టార్ట్ చేశారు. సాయంత్రం 5 గంటలనేది బ్రిటీష్ పార్లమెంట్‌‌కు అనుకూలమని, మనకు మార్నింగ్‌‌ అనుకూలమని చెప్పారు.