ఆ ఆరు రోజులు అత్యంత ఘోరం: అశ్విన్

ఆ ఆరు రోజులు అత్యంత ఘోరం: అశ్విన్

దుబాయ్: వెటరన్ ప్లేయర్, కింగ్స్ ఎలెవన్ మాజీ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఈయేడు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్-13లో పాల్గొనడం కోసం దుబాయ్ కు చేరుకున్న ఈ ఆఫ్ స్పిన్నర్.. ఆరు రోజుల క్వారంటైన్ పీరియడ్ లో ఉండాల్సి వచ్చింది. క్వారంటైన్ పీరియడ్ గురించి అశ్విన్ చెప్పిన విషయాలను ఢిల్లీ క్యాపిటల్స్ తన యూట్యూబ్ చానెల్ లో అప్ లోడ్ చేసింది. క్వారంటైన్ లో ఉన్న ఆరు రోజుల సమయం తన జీవితంలో అత్యంత ఘోరమని అశ్విన్ చెప్పాడు.

‘గత ఆరు నెలలుగా నేను ఇంట్లోనే ఉన్నా. నా యూట్యూబ్ చానెల్ పనులతో బిజీగా ఉన్నా. అలాగే ఇన్ స్టాగ్రామ్ లైవ్ తో ఎప్పుడూ ఏదోటి చేస్తూ గడిపా. కానీ ఆ 6 రోజులు (క్వారంటైన్ పీరియడ్) నా లైఫ్ లో వరస్ట్ టైమ్ గా చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి రోజు నేను బయట చూస్తుంటే ఒకవైపు దుబాయ్ లేక్, మరో వైపున బుర్జ్ ఖలీఫా కనిపించాయి. అది అద్భుతంగా అనిపించింది. కానీ ఎంతసేపు వాటినే చూస్తూ ఉంటాం. ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ విపరీతమైన వేడి. మామూలుగా నేను మొబైల్ ను ఎక్కువగా వాడను. రెండు నుంచి రెండున్నర గంటల సమయం మాత్రమే యూజ్ చేస్తా. కానీ గత వారం రోజుల్లో 6 గంటలు వాడా. నేను అనారోగ్యానికి గురయ్యా. నా ఏకాగ్రత పూర్తిగా ఆ ప్లేస్ మీదే ఉండటంతో పుస్తకాలు కూడా చదవలేకపోయా. అయితే అదృష్టవశాత్తూ ఆరు రోజుల గడువు ముగిసింది. అందరికీ నెగిటివ్ గా వచ్చింది. మొత్తానికి మేం బయటపడ్డాం’ అని అశ్విన్ పేర్కొన్నాడు.