అన్ని కంపెనీల పాలసీలు ఒకే చోట బీమా సుగమ్

అన్ని కంపెనీల పాలసీలు ఒకే చోట బీమా సుగమ్

న్యూఢిల్లీ: మరింత మందికి బీమా సేవలను అందుబాటులోకి తేవడం, దీనికి సంబంధించిన అన్ని సేవలను ఒకే చోట అందించడానికి ఇన్సూరెన్స్​ రెగ్యులేటరీ అండ్​ డెవెలప్​మెంట్​ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్​డీఏఐ) బీమా సుగమ్​ పేరుతో ఒక ప్లాట్​ఫారమ్​ను అందుబాటులోకి తేనుంది. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఈ పోర్టల్​ మొదలవుతుంది. దీనివల్ల ఇన్సూరెన్స్​ మార్కెట్​పూర్తిగా డిజిటైజ్​ అవుతుందని, పాలసీదారులకు మేలు జరుగుతుందని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. ఈ పోర్టల్​ద్వారా అన్ని కంపెనీల పాలసీలను కొనుక్కోవచ్చు. ఇతర సేవలను పొందవచ్చు. లైఫ్​, నాన్​–లైఫ్​ ఇన్సూరెన్స్​ పాలసీలు అందుబాటులో ఉంటాయి.  కంపెనీల నుంచి కోట్స్​ పొందవచ్చు. పాలసీ సేవలతోపాటు పాలసీ వివరాలను భద్రపర్చడం, క్లెయిమ్స్​సెటిల్​ చేయడం, బీమా ఏజెంట్లను మార్చుకోవడం వంటి పనులకు బీమా సుగమ్​ పోర్టల్​ను వాడుకోవచ్చు. లైఫ్​, మోటార్​, హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీలను నేరుగా కొనుక్కోవచ్చు. ఎలక్ట్రానిక్​ ఇన్సూరెన్స్​ అకౌంట్ (ఈ–ఐఏ) ద్వారా ఈ సేవలను అందిస్తారు. అంటే ఇది వన్​ స్టాప్​ ఆన్​లైన్​ ఇన్సూరెన్స్​ ప్లాట్​ఫారమ్​గా పనిచేస్తుంది. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. పాలసీ ఎక్స్​, పాలసీ బజార్​, బ్యాంకులు, బ్రోకర్లు, బీమా ఏజెంట్లను ఫెసిలిటేటర్లుగా వాడుకోవాలని ఐఆర్​డీఏ భావిస్తోంది. దీనివల్ల మరింత మందికి బీమా సేవలు అందుతాయి. పోర్టల్​లో అన్ని పాలసీల డేటా పూర్తిగా ఉంటుంది కాబట్టి పాలసీ హోల్డర్లు తమకు అనువైన పాలసీని సులువుగా ఎంచుకోవచ్చు. మధ్యవర్తులకు/ఏజెంట్లకు కమీషన్​ చెల్లించాల్సిన అవసరం ఉండదు కాబట్టి తక్కువ ధరకే పాలసీని కొనుక్కోవచ్చు. కొత్త ఇన్సూరెన్స్​ శాండ్​బాక్స్​ ప్రొడక్టులకు వేగంగా అనుమతులు వచ్చే అవకాశాలు ఉంటాయి.  దీనివల్ల మరిన్ని కంపెనీలు ఈ రంగంలోకి వస్తాయి. బీమా సుగమ్​ ప్లాట్​ఫారమ్​ను ఐఆర్​డీఏ పర్యవేక్షిస్తుంది. దీనికి ఇనీషియల్ క్యాపిటల్‌‌గా దాదాపు రూ.85 కోట్లు అవసరం కానుండగా.. లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ 30శాతం (రూ.25 కోట్లు), జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ 30శాతం (రూ.25 కోట్లు),  పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ 35శాతం (రూ.30 కోట్లు), బ్రోకర్స్ అసోసియేషన్ 5శాతం (రూ.3 కోట్లు) నిధులు అందించనున్నాయి. బీమా సుగమ్​ కార్యకలాపాలకు మరిన్ని నిధులు అవసరం కాబట్టి, మరికొన్ని బీమా కంపెనీలు పెట్టుబడిదారులుగా చేరతాయని ఐఆర్​డీఏ వర్గాలు తెలిపాయి.

ఆధార్​ వెరిఫికేషన్​ చాలు..

పూర్తిగా డిజిటల్​పద్ధతిలో సేవలు అందుతాయి కాబట్టి పాలసీ కొనడానికి కస్టమర్లు ఆధార్​ను వెరిఫై చేస్తే సరిపోతుంది. రకరకాల డాక్యుమెంట్లు అందజేయాల్సిన అవసరం ఉండదు. అంతేగాక పాలసీ స్థితిగతులను బీమా సుగమ్​ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్​ చేసుకోవచ్చు. ఈ పోర్టల్​ ద్వారా ఎలక్ట్రానిక్​ బీమా/ఎలక్ట్రానిక్​ ఇన్సూరెన్స్​ అకౌంట్లు జారీ అవుతాయి. కాగితాల పాలసీలు ఉండవు. ఎలక్ట్రానిక్​ పద్ధతిలోనే పాలసీలను చెక్​ చేసుకోవాలి. ఇదే విధానంలో క్లెయిమ్​లకు దరఖాస్తు చేసుకోవాలి. దీనివల్ల నామినీలకు/లబ్దిదారులకు వేగంగా బీమా డబ్బులు అందే అవకాశాలు ఉంటాయని ఇన్సూరెన్స్​ సెక్టార్ ఎక్స్​పర్టులు చెబుతున్నారు.  ఫిజికల్​ పాలసీ డాక్యుమెంట్లు ఉండవు కాబట్టి పాలసీహోల్డర్​కు మరింత గోప్యత ఉంటుంది. ఎలాంటి కాగితాలూ అవసరం లేకుండా పాలసీని రెన్యువల్​ చేసుకోవచ్చు. అయితే ప్లాట్‌ఫారమ్ వసూలు చేసే చార్జి గురించి ఐఆర్​డీఏ వివరాలను అందించనప్పటికీ,  మధ్యవర్తులకు చెల్లించే కమీషన్‌లు బాగా తగ్గుతాయని అంటున్నారు. ఫలితంగా పాలసీదారుడికి ప్రీమియంలు చౌకగా మారుతాయి. పాలసీదారు, ఆయన కుటుంబం  బీమా పాలసీల కోసం వారికి నచ్చిన రిపాజిటరీని ఎంచుకోవచ్చు. ఒకే చోట ఉండే ఇన్ఫర్మేషన్​ లింక్‌లు నామినీలు/లబ్దిదారులకు క్లెయిమ్ సెటిల్​మెంట్లను సులభతరం చేస్తాయి.   బీమా సుగమ్​ వల్ల  బీమా బ్రోకర్లు,  వెబ్ అగ్రిగేటర్లు తీవ్రమైన పోటీని ఎదుర్కొనే అవకాశం ఉంది.