ఆధార్ కార్డుపై రూ.3 లక్షల లోన్.. నిజమేనా..

ఆధార్ కార్డుపై రూ.3 లక్షల లోన్.. నిజమేనా..

ఆధార్ కార్డు ఉంటే రూ.3లక్షల లోన్ ఇస్తారా.. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వార్త ప్రకారం ప్రధాన మంత్రి లోన్ యోజన (పథకం) కింద ఆధార్ కార్డు హోల్డర్లు రూ. 3లక్షల వరకు రుణాన్ని పొందుతారు. ఈ సమాచారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) తనిఖీ చేపట్టగా.. అలా వచ్చే మెసేజ్ లు, వార్తలు నకిలీవని తేలింది. ఈ పేరుతో వచ్చేవన్నీ మోసపూరిత సందేశాలేనని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో  స్పష్టం చేసింది.

ఆధార్ కార్డ్ ఉన్న వారందరికీ కేంద్ర ప్రభుత్వం రూ.3లక్షల రుణాన్ని అందజేస్తోందని చెబుతున్నారని పీఐబీ రాసుకొచ్చింది. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వార్త... ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకేనని తెలిపింది. వాస్తవాలను సరిగ్గా తనిఖీ చేయకుండా ఆధార్ కార్డుకు సంబంధిత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని పీఐబీ ప్రజలను కోరింది.

క్లెయిమ్: ఆధార్ కార్డ్ హోల్డర్‌కు ప్రధానమంత్రి రుణ పథకం కింద రూ. 3లక్షల రుణం లభిస్తుంది.

వాస్తవం: ఈ వార్త తప్పు. అటువంటి పథకం ఏదీ భారత ప్రభుత్వం అమలు చేయడం లేదు.

ఇలాంటి మెసేజ్ వైరల్ కావడం ఇదేం మొదటిసారి కాదు. గతేడాది నవంబర్‌లో ఆధార్ కార్డు ఉన్నవారందరికీ రూ.4.78 లక్షల రుణం అందజేస్తామంటూ ఇదే తరహా నకిలీ మెసేజ్ వైరల్ అయింది.

తప్పుడు క్లెయిమ్‌లతో కూడిన ఇటువంటి మోసపూరిత సందేశాలను ఫార్వార్డ్ చేయవద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ సందర్భంగా వినియోగదారులను కోరింది.

PIB ఫాక్ట్-చెకింగ్ 

ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న తప్పుడు సమాచారాలను, నకిలీ వార్తలను అరికట్టేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిసెంబర్ 2019లో ఈ వాస్తవ తనిఖీ విభాగాన్ని ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్“వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సర్క్యులేట్ అవుతున్న ప్రభుత్వ విధానాలు, పథకాలకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని గుర్తిస్తుంది”.

https://twitter.com/PIBFactCheck/status/1650459648787632128