విక్రమ్​ కథ ఆనాడే క్లోజ్

విక్రమ్​ కథ ఆనాడే క్లోజ్
  • ల్యాండింగ్​ రోజే పాడైపోయిందన్న ఇస్రో సైంటిస్టులు
  • 200 కిలోమీటర్ల వేగంతో జాబిలితో ఢీ
  • ఆటోమేటిక్​ ల్యాండింగ్​ ప్రోగ్రాంలో లోపాలు
  • నాలుగు ఇంజన్లకు బదులు ఒక్క ఇంజన్​నే పెడితే బాగుండేది

విక్రమ్​ స్పందిస్తుందని యావత్​ భారతావని 14 రోజులుగా ఆశలతో ఉంది. కానీ, అది చడీ చప్పుడు లేకుండా చందమామ ఒడిలో నిద్రపోతోంది. సూర్యుడు ఉన్నన్ని రోజులూ నిద్రలోనే ఉంది. ఇప్పుడు చీకటి పడడంతో శాశ్వత నిద్రలోకి జారిపోతోంది. కానీ, విక్రమ్​ ల్యాండింగ్​ రోజైన సెప్టెంబర్​ 7నే అది పూర్తిగా ‘డెడ్​’ అయిందన్న విషయం ఎవరికీ తెలియదు. ఇస్రో టాప్​ సైంటిస్టులు స్వయంగా చెబుతున్న మాటిది. అవును, ల్యాండింగ్​ రోజే విక్రమ్​ పూర్తిగా చేయిదాటిపోయిందని చెబుతున్నారు. ఆటోమేటిక్​ ల్యాండింగ్​ ప్రోగ్రామ్​ (ఏఎల్​పీ)లో వచ్చిన లోపం వల్లే విక్రమ్​కు పెద్ద యాక్సిడెంట్​ జరిగిందంటున్నారు. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో జాబిల్లిని విక్రమ్​ ఢీకొట్టిందంటున్నారు. అంత స్పీడ్​తో ఢీకొట్టడం వల్ల అందులోని పరికరాలు, వ్యవస్థలన్నీ పాడైపోయాయంటున్నారు. ‘‘కచ్చితంగా విక్రమ్​ తన కాళ్లపై నిలబడలేదు. అక్కడ పడిన నీడలో దాని రెండు కాళ్లు పైకి ఉండడం కనిపించింది. కాబట్టి అది తలకిందులుగానైనా పడి ఉండొచ్చు లేదంటే ఓ పక్కకు ఒరిగి ఉండొచ్చు” అని చంద్రయాన్​–2 సైంటిస్టు ఒకరు చెప్పారు. చందమామకు 330 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడే విక్రమ్​తో సంబంధాలు తెగిపోయాయని చెప్పారు. అంతకుముందు ఇస్రో చెప్పినట్టు 2.1 కిలోమీటర్ల ఎత్తులో విక్రమ్​తో లింక్​ కట్​ అయిపోలేదన్నారు. ‘‘విక్రమ్​ తలకిందులుగా అయినప్పుడు బ్రేకులుగా పనిచేయాల్సిన థ్రస్టర్లు, యాక్సిలరేటర్లుగా మారి స్పీడ్​ను పెంచేశాయి” అని ఆయన చెప్పుకొచ్చారు. బెంగళూరులోని యూఆర్​ రావు శాటిలైట్​ సెంటర్​ టీం తయారు చేసిన ల్యాండింగ్​ ప్రోగ్రామ్​లో తప్పులు దొర్లడం వల్లే క్రాష్​ అయి ఉండొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ టీంలు తయారు చేసిన ప్రోగ్రామ్​ను పరిశీలిస్తున్నామన్నారు. విక్రమ్​లో సింపుల్​ టెక్నాలజీని వాడి ఉంటే బాగుండేదని ఇస్రో మాజీ అధికారి ఒకరు చెప్పారు. ఒక్కసారి అనుకున్న మిషన్​లో పదే పదే మార్పులు చేయొద్దని, చివరిదాకా ఒకటే ఉండాలని ఆయన అన్నారు. ‘‘స్పేస్​ టెక్నాలజీ అంటేనే చాలా కష్టమైనది. అంత కష్టమైన పనిని మరిన్ని కఠినమైన వాటిని చేర్చి మరింత కష్టంగా మార్చకూడదు. విక్రమ్​ విషయంలో అదే జరిగింది. ఉదాహరణకు విక్రమ్​కు నాలుగు ఇంజన్లను పెట్టారు. అవన్నీ ఒకేలా ఒకేసారి పనిచేసేలా డిజైన్​ చేశారు. అవి చాలదన్నట్టు ఐదో ఇంజన్​ను మధ్యలో పెట్టారు” అని చెప్పారు. అన్ని ఇంజన్లు కాకుండా 3,500 న్యూటన్ల శక్తి ఉన్న ఒకే ఒక్క ఇంజన్​ను పెట్టి ఉంటే బాగుండేదన్నారు. చంద్రుడిపై ల్యాండ్​ అయిన ఇతర దేశాలు ఒకే ఒక్క ఇంజన్​ను వాడాయని, అందులో సక్సెస్​ అయ్యాయని గుర్తు చేశారు. నిజానికి ముందు అనుకున్న దాని కన్నా చంద్రయాన్​–2 ప్రయోగంలో చాలా మార్పులు చేశారని ఆ మాజీ అధికారి చెప్పుకొచ్చారు. ల్యాండర్​లో నాలుగు ఇంజన్లే పెట్టాలని ముందు అనుకున్నా, ఆ తర్వాత చంద్రుడిపైన లేచే దుమ్మును తట్టుకోవాలన్న ఉద్దేశంతో ఐదో ఇంజన్​ను ఏర్పాటు చేశారన్నారు. కానీ, దాని వల్ల స్పేస్​ క్రాఫ్ట్​ బరువు పెరిగిపోయిందని, ఆ తర్వాత రాకెట్​ బరువులో మార్పులు చేయాల్సి వచ్చిందని వివరించారు. ఆ ఐదో ఇంజన్​ను ఆన్​ చేసినప్పుడే అందులోని వ్యవస్థలన్నీ పనిచేయడం మానేశాయన్నారు. ఫెయిల్యూర్స్​కు సంబంధించి ఇస్రో అధికారులు మరిన్ని సిమ్యులేషన్లు చేస్తే బాగుండేదన్నారు.