నల్గొండ, వెలుగు: రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వానికి కనీస అవగాహన, చిత్తశుద్ధి లేవని మండిపడ్డారు. సోమవారం నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీళ్లు మరో 15 రోజుల్లో ఖాళీ అయిపోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి నుంచి సముద్రంలోకి వృథాగా పోతున్న నీళ్లను వాడుకునే తెలివి సీఎంకు లేదని విమర్శించారు. తమ హయాంలో తీవ్రమైన కరువు ఉన్నా నాగార్జున సాగర్ కింద పంటలకు నీళ్లిచ్చి కాపాడామని, ఇప్పుడు కనీసం మిషన్ భగీరథ నీళ్లు కూడా సరిగ్గా సరఫరా చేయడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు శిష్యుడి పాలనలో రాష్ట్రానికి మళ్లీ 2014 నాటి దుర్భిక్ష పరిస్థితులు వచ్చాయని, ఏపీ సీఎం.. రాష్ట్రం నుంచి 50 టీఎంసీల నీటిని దోచుకెళ్తుంటే ఈ ప్రభుత్వానికి కనీసం సోయి లేదని ఆరోపించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటిపారుదల రంగంపై కనీస అవగాహన లేదని, ఆయన మాట్లాడేవన్నీ అబద్ధాలేనని, ఆయనకు దమ్ముంటే తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. కాళేశ్వరం గొప్పదనం ఏంటో, దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో నిరూపించి మీ కళ్లు తెరిపిస్తా అని అన్నారు. నిత్యం అబద్ధాలు మాట్లాడుతున్న ఉత్తమ్ రెడ్డి తన పేరును అబద్ధాల రెడ్డిగా మార్చుకోవాలన్నారు. కేవలం కరెంట్ బిల్లులు కట్టాల్సి వస్తుందనే దురుద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును పక్కనబెట్టి రైతుల జీవితాలను బలి చేస్తోందని ఆరోపించారు. కన్నెపల్లి రిజర్వాయర్ బాధ్యతలను తమకు అప్పగిస్తే బసవాపూర్ వరకు నీళ్లిచ్చి చూపిస్తామని, ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడి ఉన్నామన్నారు.
