పార్టీ పేరులోంచి తెలంగాణ పదం అందుకే తీసేసిండు: జగ్గారెడ్డి

పార్టీ పేరులోంచి తెలంగాణ పదం అందుకే  తీసేసిండు: జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్​లో ఏ మూలనో సమైక్య భావన దాగి ఉందని, అందుకే పార్టీ పేరు నుంచి తెలంగాణ పదాన్ని తీసేశారని పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా హాల్​లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పదం తొలగించడంతోనే  కేసీఆర్ బలం పోయిందన్నారు. కేసీఆర్ ఇప్పుడు ఏపీలోకి  కూడా వెళ్తున్నారని, అందుకే చంద్రబాబు తెలంగాణలోకి వచ్చారన్నారు. 

సైలెంట్​గా ఉన్న చంద్రబాబు తెలంగాణకు రావడానికి కేసీఆరే అవకాశం ఇచ్చారన్నారు. ఏపీ జనాన్ని  కేసీఆర్ అట్రాక్ట్​ చేయలేరని, చంద్రబాబు మాత్రం తెలంగాణ ఓటర్లను ప్రభావితం చేయగలరని అన్నారు. తెలంగాణలో కూటములు, పొత్తులపై చాలా మార్పులు చోటుచేసుకుంటాయని జగ్గారెడ్డి చెప్పారు. బీఆర్​ఎస్​ సక్సెస్​ అయ్యే పరిస్థితి  ఏ మాత్రం లేదన్నారు. 

మైనార్టీల లోన్ల కోసం నిధులు పెంచాలి

మైనార్టీ వెల్ఫేర్​ స్కీమ్​లో లోన్ల కోసం రూ.1,500 కోట్లు కేటాయించాలని సీఎం కేసీఆర్​కు జగ్గారెడ్డి లేఖ రాశారు. ప్రస్తుతం మైనార్టీ కార్పొరేషన్​కు కేటాయించిన రూ.120 కోట్లు ఏ మూలకూ సరిపోవన్నారు. లోన్లకు అప్లికేషన్  గడువును నెల రోజులపాటు పెంచాలని డిమాండ్​ చేశారు.