మంత్రి కొప్పులను ప్రశ్నించినందుకు..  నా వడ్లు కొంటలె: రైతు రాజన్న

మంత్రి కొప్పులను ప్రశ్నించినందుకు..  నా వడ్లు కొంటలె: రైతు రాజన్న
  • ట్రాక్టర్, వడ్లు పోలీస్ స్టేషన్​లోనే ఉన్నయ్ : రైతు రాజన్న
  • డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ బూతులు తిట్టిండని ఆరోపణ
  •  సోషల్ మీడియాలో వైరలవుతున్న రాజన్న వీడియో

జగిత్యాల, వెలుగు:  వడ్లు కొనుగోలు చేయడం లేదంటూ ఈనెల 3వ తేదీన మినిస్టర్ కొప్పుల ఈశ్వర్ క్యాంపు ఆఫీస్ ముందు ధాన్యం పోసి నిరసన తెలిపిన రైతును బీఆర్ఎస్ లీడర్లు, అధికారులు వేధిస్తున్నారు. కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చి నెలన్నర అవుతున్నా ఎందుకు కొంటలేరని ప్రశ్నించినందుకే తనపై కక్షగట్టినట్లు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన రైతు సట్టంశెట్టి రాజన్న తెలిపాడు. తన ట్రాక్టర్, వడ్లు ఇంకా పోలీస్ స్టేషన్​లోనే ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకున్న మూడు ఎకరాల్లో పండించిన ధాన్యాన్ని రాజన్న స్థానిక పీఏసీఎస్​కు తీసుకెళ్లాడు. అకాల వర్షానికి వడ్లన్నీ తడిసిపోయాయి. అదే టైంలో మినిస్టర్ కొప్పుల ఈశ్వర్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నెలలు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయలేదు. నాట్లు వేసుకునే టైం దగ్గరపడటంతో రైతుల దీన స్థితి తెలియాలనే ఉద్దేశంతో జూన్ 3న ధర్మపురి మండల కేంద్రంలోని మినిస్టర్ కొప్పుల క్యాంప్ ఆఫీస్ ముందు వడ్లు పోసి నిరసన తెలిపాడు. విషయం తెలుసుకున్న సీఐ కోటేశ్వర్, ఎస్ఐ కిరణ్ అక్కడికి చేరుకుని ట్రాక్టర్​తో సహా వడ్లను పోలీస్ స్టేషన్​కు తరలించారు.

3 కిలోల తరుగుకు ఒప్పుకుంటేనే కాంటా

మంత్రి కొప్పుల ఈశ్వర్ క్యాంప్ ఆఫీస్ ముందు వడ్లు పోసి నిరసన తెలిపినందుకు అతని అనుచరుడు, డీసీఎంఎస్ చైర్మన్​ శ్రీకాంత్​రెడ్డి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని రైతు రాజన్న వీడియోలో తెలిపాడు. బస్తాకు మూడు కిలోల తరుగుకు ఒప్పుకుంటేనే కాంటా వేస్తున్నారని ఆరోపించాడు. ప్రశ్నించినోళ్లను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. క్యాంప్ ఆఫీస్ ముందు ధాన్యం పోసిన రోజు కూడా పోలీసుల ముందే శ్రీకాంత్​రెడ్డి బూతులు తిట్టాడని వివరించాడు. ‘‘నువ్వు ఎక్కడికెళ్లి.. ఎవరితో చెప్పుకున్నా.. నన్ను ఎవరేం చేయలేరు. నాకు కొప్పుల ఈశ్వర్ సపోర్ట్ ఉంది”అంటూ బెదిరిస్తున్నాడని రాజన్న తెలిపాడు. తాము పడుతున్న బాధ మంత్రికి తెలియాలనే ఉద్దేశంతోనే అలా చేశానని, ఏ పార్టీ లీడర్లతో సంబంధం లేదని చెప్పాడు.