పురాతన వస్తువులకు కేరాఫ్​ ఆ మ్యూజియం

 పురాతన వస్తువులకు కేరాఫ్​ ఆ మ్యూజియం

పాతకాలం నాటి ఇండ్లను గుర్తుకుతెచ్చే గదులు.. వాటి గోడలపై అద్భుతమైన పెయింటింగ్​లు... రవివర్మ నుంచి లక్ష్మా గౌడ్​ వరకు ఫేమస్​ ఆర్టిస్ట్​ల చేతుల్లో ప్రాణం పోసుకున్న చిత్రాలు... తోడుగా వందల ఏండ్ల కిందటి లాంతర్లు, వెండి తమలపాకు పెట్టెలు, పైథానీ చీరలు.. ఇంకా మరెన్నో పురాతన వస్తువులకు కేరాఫ్​ ఆ మ్యూజియం. దాని పేరు ‘జపుర్జ’. పుణెలోని ఖడక్​వాస్లా లేక్​ ఒడ్డున ఎనిమిది ఎకరాల్లో ఉంది. అందులో ఎనిమిది ఆర్ట్​ గ్యాలరీలు కనిపిస్తాయి. దాదాపు 200 మంది కూర్చోగల ఆడిటోరియం, యాం ఫీథియేటర్​, కేఫ్​, మ్యూజియం షాప్​ కూడా ఉన్నాయి.

పుణెలోని​ ‘పీఎన్​జీ సన్స్’​ జువెలరీ షాప్​ ఓనర్​ అజిత్​ గాడ్గిల్​ ఈ మ్యూజియం ఏర్పాటుచేశాడు. చిన్నప్పటి నుంచి పెయింటింగ్స్​తోపాటు రకరకాల పాత వస్తువులంటే ఇష్టపడే అజిత్​.. వాటితో ఇప్పుడీ మ్యూజియం పెట్టాడు. ఇందులో ఎం.ఎఫ్.​ హుస్సేన్​, రవివర్మ, ఎస్.​హెచ్.​ రజా, కె.హెచ్.​ అరా, కె.లక్ష్మా గౌడ్​ వంటి ఫేమస్ ఆర్టిస్ట్​లు వేసిన చిత్రాలు స్పెషల్​ అట్రాక్షన్​. ఈ ఏడాది మేలో ఈ మ్యూజియం ఓపెన్​ అయింది. అప్పటి నుంచి ఇది విజిటర్స్​తో కళకళలాడుతోంది. పుణెకు వెళ్లే టూరిస్ట్​లు చూడాల్సిన లిస్ట్​లో చేరింది. పెయింటింగ్​లు, పురాతన వస్తువులు చూడాలనుకునేవాళ్లు తప్పక వెళ్లాల్సిన మ్యూజియమిది.