సిటీలో 10 కి.మీల దూరానికి గంటకుపైగా జర్నీ

సిటీలో 10 కి.మీల దూరానికి గంటకుపైగా జర్నీ
  • లింక్ రోడ్లు, ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నా మార్పు లేదు
  • ఫుట్‌‌‌‌పాత్‎ల ఆక్రమణలు, క్వాలిటీ లేని రోడ్లు
  • ఇవే ప్రధాన కారణాలుంటున్న ట్రాన్స్​పోర్టేషన్​ ఎక్స్​పర్ట్స్

హైదరాబాద్, వెలుగు: సిటీలో మెయిన్ రోడ్లపై కిలో మీటరు  దూరం వెళ్లాలన్నా పది నుంచి పదిహేను నిమిషాల టైమ్​ పడుతుంది. అదే 10, 15 కిలో మీటర్లైతే గంటల తరబడి ట్రాఫిక్ ​జామ్ లోనే ఉండాల్సిన పరిస్థితి. ఉంది.   ఉదయం, సాయంత్రం ఏ ఏరియాలో చూసి నా ట్రాఫిక్​రద్దీ కనిపిస్తుంది. మెట్రోలు, ఫ్లై ఓవర్లు వచ్చినా ట్రాఫిక్ జామ్ లో ఎలాంటి మార్పు లేవు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్​ వాడకం సరిగా లేకపోవడం, మెట్రోలో వెళ్లాలన్నా ఇంటి నుంచి స్టేషన్​ వరకు వాహనాల్లో వెళ్లడం, షేరింగ్ ట్రావెల్ చేయడం వంటి వాటిపై జనాలు ఇంట్రెస్ట్ ​చూపకపోవడంతోనే రోడ్లపై వాహనాల సంఖ్య పెరుగుతుంది. దీనికితోడు రోడ్ల  కు ఇరు వైపులా పార్కింగ్ లు, చిరు వ్యాపారాలు, ఫుట్ పాత్ ల ఆక్రమణల కారణంగా ట్రాఫిక్​ ప్రాబ్లమ్ ​ఉంటుంది. దీంతో సమయానికి  చేరుకోవాల్సినా టైమ్ ​ఎక్కువగా తీసుకుంటుంది. సిటీలో కోటికి పైగా జనాభా ఉంటే, 60 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. ప్రతి ఏడాది వాహనాల సంఖ్య లక్షల్లో పెరగడం, జనాభాకి అనుగుణంగా రోడ్ల విస్తరణ లేకపోవడం, గుంతలు పడే రోడ్లు ట్రాఫిక్ కు ​ప్రధాన కారణాలని ట్రాన్స్ పోర్టేషన్ నిపుణులు పేర్కొంటున్నారు. 

జనాలు పెరుగుతుంటే..
బల్దియా లెక్క ప్రకారం సిటీలో 7,900 కిలో మీటర్ల రోడ్లు ఉన్నాయి. 1950లో 13 లక్షల జనాభా ఉంటే, 2021 కి  కోటికి పైగా చేరింది. జనాభా పెరుగుదలను బట్టి రోడ్లను విస్తరించడం లేదు. సిటీలో పీక్ అవర్ లో ట్రాఫిక్ జామ్ పెరుగుతుంది. రోడ్లు విశాలంగా లేక పోవడం, ఫుట్ పాత్ లను ఆక్రమించడం, రోడ్లమీద నడవడం, చిరువ్యారులు తోపుడు బండ్లు పెట్టుకోవడం, రోడ్లపై గుంతలు ఉండడం.. ఇలాంటి కారణాలతో వాహనాలు స్పీడ్​గా వెళ్లక ట్రాఫిక్ జామ్​ లు అవుతున్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్​ అధిగమించడానికి ప్రభుత్వం మెట్రో రైల్, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్​మెంట్​ప్రోగ్రాం అమలు చేస్తుంది. ఫ్లై ఓవర్ల నిర్మాణం, ఎలివేటెడ్ కారిడార్స్ వంటివాటి కోసం ప్లాన్​ చేసింది. కానీ నిధుల కొరతతో పనులు ముందుకు సాగడంలేదు. 

బల్దియాకు నిధుల కొరత 
సిటీలో రోడ్ల నిర్వహణ బల్దియా పరిధిలో ఉం డగా నిధుల లేవు.  రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల మాట అటుంచితే ఉన్న వాటిని కూడా సరిగా మెయింటెన్ చేయడం లేదని పలువురు ట్రాన్స్ పోర్టేషన్ నిపుణులు పేర్కొంటున్నారు.  బల్దియా ఫండ్స్ కోసం ప్రభుత్వం పైనే ఆధారపడగా, సరిపడా నిధులు ఇవ్వకపోతుండగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందంటున్నారు. రాష్ట్ర జనాభాలో సుమారు 30శాతం మంది సిటీలోనే ఉంటున్నారు. ఇక్కడి నుంచి అన్ని ముఖ్య కార్యకలాపాలు జరుగుతుంటాయి. రాష్ట్ర బడ్జెట్ లో బల్దియాకు అధిక నిధులిచ్చి  సదుపాయాలు మెరుగుపరచాలని సూచిస్తున్నారు.  ఇండియన్ రోడ్ కాంగ్రెస్ అంచనాల ప్రకారం.. ఒకసారి సిమెంట్ రోడ్డు వేస్తే 10 ఏండ్ల దాకా క్వాలిటీతో ఉండాలి. తారురోడ్డు అయితే ఆరేడు ఏండ్ల దాకా  ఎలాంటి మరమ్మతులు రాకుండా ఉండాలి.  బల్దియా ఏ రోడ్డు వేసినా ఏడాదికే చెడిపోయి వాహనదారులకు  ఇబ్బంది కలుగుతుంది. జనాభాను దృష్టిలో పెట్టుకుని సరైన రోడ్ల ప్రణాళిక డెవలప్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు రావు. 

రోడ్లపైకి వస్తే ఇరుక్కుపోవడమే..
సిటీలో మెయిన్ ​ప్రాబ్లమ్స్​లో ట్రాఫిక్ ఒకటి. 90 శాతం ఏరియాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఉండగా, కిలోమీటర్ల పొడవునా రోడ్లపై వాహనాలు నిలిచి ఉండడం కామన్​గా మారింది. ఇంటి నుంచి రోడ్లపైకి వచ్చేవారంతా ట్రాఫిక్ లో ఇరుక్కుపోవాల్సిందే. అమీర్ పేట, ఎర్రగడ్డ, పంజాగుట్ట, ఖైరతాబాద్ సర్కిల్, అసెంబ్లీ, లక్డీకాపూల్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, కూకట్​పల్లి, ఎల్​బీనగర్​.. ఇలా ఏ ఏరియాలో చూసినా వాహనాల రద్దీ కనిపిస్తుంటుంది. జనాలు రోజు వారి లైఫ్​లో  కొన్ని గంటలు ట్రాఫిక్​జామ్​లతోనే కోల్పోతుంటారు. ఎంప్లాయీస్, స్టూడెంట్స్, వ్యాపారులు ఇలా తమ పనుల కోసం బయటకు వెళ్లేవారు ఉదయం ఇంటి నుంచి 8 గంటలకే బయలుదేరినా,  వెళ్లాల్సిన ఏరియాకు చేరుకునే సరికి 9.30, 10 గంటలు అవుతుందని చెప్తున్నారు. రోడ్లపై డ్యామేజీలు, ట్రాఫిక్ జామ్ లతో హెల్త్ ఇష్యూస్, సిక్ నెస్, బ్యాక్ పెయిన్ వంటి ప్రాబ్లమ్స్​బారిన పడుతున్నామని అంటున్నారు. 

విదేశాలతో పోల్చితే..
వెహికల్స్ పై షేరింగ్ గా వెళ్తే ట్రాఫిక్​జామ్ ఇబ్బంది ఉండదు. విదేశాల్లో సిస్టమెటిక్​గా ఉంటుంది. మన వద్ద అలా ఉండదు. ఫుట్ పాత్ ల మీద బిజినెస్​లు చేసేవాళ్లకు వెండర్స్ ఆక్ట్ ప్రకారం ప్రతి కిలోమీటరుకు ఒక మార్కెట్​గా పెట్టాలి. కూరగాయల మార్కెట్ లాగానే వీటిని ఏర్పాటు చేయాలి. అప్పుడు ఫుట్ పాత్ లను ఆక్రమించి వ్యాపారాలు చేయరు. 
- పద్మనాభరెడ్డి, సెక్రటరీ, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్

ఫంక్షనాలిటీ సరిగాలేదు 
సిటీలో రోడ్ నెట్‌‌‌‌వర్క్ ఫంక్షనాలిటీ సరిగా లేదు. ఎక్కడి పడితే అక్కడ రోడ్లపై ఎంట్రీస్ ఇచ్చారు. ఫ్లై ఓవర్లు కట్టినా మిక్స్‌‌‌‌డ్ ట్రాఫిక్ వల్ల ప్రయోజనం ఉండదు. సమస్య తగ్గా లంటే సరైన విధంగా ప్లానింగ్ ఉండాలి. 
- ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు, జేఎన్‌‌‌‌టీయూ