కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రమేశ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రమేశ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రమేశ్‌ కుమార్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. గాంధీలు, నెహ్రూ పేరుతో కాంగ్రెస్‌ నేతలు కావాల్సినంత డబ్బు సంపాదించారని చేసిన కామెంట్స్ ప్రకంపనలు సృష్టించాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఈడీ ప్రశ్నించటాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ దేశ వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనల సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘జవహార్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీల పేరుతో మనం 3, 4 తరాలకు సరిపడా డబ్బు సంపాదించుకున్నాం. మనం ఈ మాత్రం త్యాగం చేయలేకపోతే.. అది మనకే మంచిది కాదు.’ అని కామెంట్స్ చేశారు. 

కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై కర్నాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్‌ కే తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీ గత 60 ఏళ్లలో ఏ విధంగా దేశాన్ని దోచుకుందనే విషయాన్ని ఎంతో అందంగా వివరించిన తెలివైన నేతకు నా శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్‌ వేదికగా సెటైర్ వేశారు. 

నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించిన కేసులో జులై 21న ఈడీ ముందు సోనియాగాంధీ హాజరయ్యారు. ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగానే బెంగళూరులోని పార్టీ కార్యాలయం నుంచి క్వీన్స్‌ రోడ్‌ వరకు  మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఫ్రీడమ్‌ పార్క్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రమేశ్‌ కుమార్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతేడాది ఎమ్మెల్యే రమేశ్‌ కుమార్‌ అసెంబ్లీ వేదికగానే అత్యాచారంపై మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.