పెట్రోల్‌ను జీఎస్టీలోకి తెస్తమంటే కేసీఆర్ వ్యతిరేకించారు

పెట్రోల్‌ను జీఎస్టీలోకి  తెస్తమంటే కేసీఆర్ వ్యతిరేకించారు
  • తెలంగాణ ఖజానా కల్వకుంట్ల ఫ్యామిలీకి
  • ప్రజల పైసలను మేసిన్రు: వివేక్ వెంకటస్వామి
  • లక్షా 30 వేల ఉద్యోగాల్లో 70 వేలు కాంట్రాక్టువే
  • జీఎస్టీలోకి పెట్రోల్ను తెస్తమంటే కేసీఆర్ వ్యతిరేకించారు
  • కరోనా టైమ్లో 1,000 బెడ్లు అవసరముంటే సెక్రటేరియట్ కూల్చారని విమర్శ

సికింద్రాబాద్, వెలుగు: ‘ధనిక రాష్ట్రం తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారు. తెలంగాణ ఖజానాను ఖాళీ చేసి కల్వకుంట్ల ఖజానాను నింపుకున్నరు. రాష్ట్ర ప్రజల పైసలన్నింటినీ మేసి ఖజానాను ఖాళీ చేసిన ఘనత కేసీఆర్కే దక్కింది’ అని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి విమర్శించారు. హైదరాబాద్ రంగారెడ్డి- మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి రాంచందర్రావుకు మద్దతుగా సికింద్రాబాద్లోని నామాలగుండు బీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన సన్నాహక సమావేశానికి వివేక్ హాజరై మాట్లాడారు. ‘లక్షా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి కేటీఆర్ చెబుతున్నరు. అందులో 70 వేలు కాంట్రాక్టు ఉద్యోగాలే. ఓట్ల కోసం ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ అబద్ధాలకోరులు. కమీషన్ల కోసం ప్రాజెక్టులను రీ -డిజైన్ చేసి రూ. 36 వేల కోట్లున్న ఖర్చును రూ. లక్ష కోట్లకు పెంచారు. కమీషన్లతో వచ్చిన డబ్బుల్లో ఒక్కో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారానికి రూ.20 కోట్లిచ్చారు’ అని విమర్శించారు. 

ఆరు కేబినెట్ పోస్టులు ఆ కుటుంబానికే
‘విద్యార్థులను మర్చిండు, ఉద్యోగులను మర్చిండు, ప్రజలను మర్చిపోయి ఫామ్హౌస్కే పరిమితమయ్యిండు. రాత్రి ఒకటి ఆలోచిస్తే పొద్దున మరో నిర్ణయం తీసుకునే సీఎం ఈ రాష్ట్రానికి అవసరమా’ అని వివేక్ ప్రశ్నించారు. ప్రధాని మోడీ తీసుకొచ్చిన జన్ ధన్ ఖాతాలో డబ్బులు వేయకుండా కమీషన్ కోసం తన కార్యకర్తలకు 10 వేలు ఇచ్చారని ఆరోపించారు. రాష్ర్ట మంత్రివర్గంలోని ఆరు కేబినెట్ పోస్టులను ఆయన కుటుంబానికి ఇచ్చి ప్రజలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. కరోనా టైమ్లో వెయ్యి బెడ్లు అవసరముంటే, కొత్త ఆస్పత్రి కట్టాల్సింది పోయి ఉన్న సచివాలయాన్ని కూల్చేశారని విమర్శించారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ను తెస్తామని కేంద్రమంటే కేసీఆర్ వ్యతిరేకించారన్నారు. 

ఉద్యోగాలపై చర్చ పెడితే కేటీఆర్ పారిపోయిండు: లక్ష్మణ్
పట్టభద్రులు టీఆర్ఎస్కు ఓటేస్తారని ట్విట్టర్ పిట్ట కేటీఆర్ భ్రమ పడుతున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. లక్షా30 వేల ఉద్యోగాల భర్తీపై ఆర్ట్స్ కాలేజీ ముందు రాంచందర్రావు చర్చ పెడితే కేటీఆర్ పారిపోయారన్నారు. ఆర్ట్స్ కాలేజీలో అడుగుపెట్టాలంటే సీఎంతో సహా టీఆర్ఎస్ నాయకులు భయపడే పరిస్థితి ఉందన్నారు. పీఆర్సీ పేరుతో ఉద్యోగులను మోసం చేస్తున్నారని, కొంత మంది ప్రభుత్వ ఉద్యోగ నాయకులను పక్కన పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. బీజేపీపై తీవ్ర విమర్శలు చేసే మంత్రులే పార్టీలో చేరేందుకు దస్తీ వేసుకుని కూర్చున్నారని చెప్పారు. బండి సంజయ్ అధ్యక్షుడయ్యాక గాంధీభవన్కు ‘ఫర్ సేల్’ బోర్డు పెట్టే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. పదవి లేక ఖాళీగా ఉన్న కవితకు ఎమ్మెల్సీ ఇచ్చిన కేసీఆర్..   నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని మాజీ మేయర్ బండ కార్తీకారెడ్డి విమర్శించారు.  

ప్రశ్నించే వాళ్లు పెరుగుతారనే వర్సిటీలకు నిధులిస్తలే..
ఓయూ, వెలుగు: ‘తెలంగాణ కోసం గళం విప్పిన మీడియా, ఉద్యమంలో నిన్ను తెలంగాణ దళపతి చేసిన మీడియా ఇప్పుడు నీకు పిచ్చి మీడియాలా కనిపిస్తోందా?’ అంటూ కేటీఆర్పై వివేక్ మండిపడ్డారు. యూనివర్సిటీలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తెలంగాణ నవ నిర్మాణ్ విద్యార్థి సేన ఆధ్వర్యంలో మంగళవారం ఓయూ ఎన్సీసీ గేట్ దగ్గర చేపట్టిన జాగరణ దీక్షకు వివేక్ హాజరై దీక్షను ప్రారంభించారు. జై ప్రజాస్వామిక తెలంగాణ అంటూ ప్రసంగం ప్రారంభించారు. ఎక్కువ మంది చదువుకుంటే ప్రశ్నించే వారు పెరుగుతారనే వర్సిటీలకు కేసీఆర్ నిధులివ్వట్లేదని మండిపడ్డారు. ‘వర్సిటీలు సమస్యలకు నిలయమయ్యాయి. వీసీల్లేరు.. అధ్యాపకుల్లేరు. స్టూడెంట్లకు వసతుల్లేవు. తుగ్లక్ సీఎం రాష్ట్రాన్ని ఖాళీచేసి ఆస్తులు పెంచుకున్నరు’ అని ఆరోపించారు. ‘వర్సిటీలకు వీసీలు కావాలని విద్యార్థులు రోడ్లెక్కారని, నిధులు కావాలని అడిగిన స్టూడెంట్లపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని మండిపడ్డారు’ అన్నారు. రాష్ట్రం వచ్చాక వర్సిటీల్లో చదువుకోలేని పరిస్థితి నెలకొందని, మరో ఉద్యమానికి విద్యార్థి లోకం సిద్ధమైందని అన్నారు.