ఆన్​లైన్ బదిలీల్లోనూ అడ్డదారులు.. కేజీబీవీ ట్రాన్స్ ఫర్లలో అధికారుల ఇష్టారాజ్యం 

ఆన్​లైన్ బదిలీల్లోనూ అడ్డదారులు..  కేజీబీవీ ట్రాన్స్ ఫర్లలో అధికారుల ఇష్టారాజ్యం 
  • ఆన్​లైన్ బదిలీల్లోనూ అడ్డదారులు
  • కేజీబీవీ ట్రాన్స్ ఫర్లలో అధికారుల ఇష్టారాజ్యం 
  • వేకెన్సీ లిస్టులోని ఖాళీలు ఆప్షన్ల టైమ్​లో బ్లాక్ 
  • కాంట్రాక్టు పోస్టుల బదిలీల్లోనూ తప్పని పైరవీలు
  • బదిలీల్లో రూ.లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు  
  • ఖాళీలన్నీ చూపాలని యూటీఎఫ్ డిమాండ్

హైదరాబాద్, వెలుగు :  పారదర్శకత కోసం ఆన్​లైన్​లో బదిలీలు చేస్తున్నమంటూ ఊదరగొట్టిన ఎడ్యుకేషన్ అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. కేజీబీవీ టీచింగ్, నాన్ టీచింగ్ బదిలీల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఖాళీగా ఉన్న తక్కువ పోస్టుల్లోనూ రాజకీయ నాయకుల జోక్యంతో కొన్ని పోస్టులను హైడ్ చేస్తున్నారు. కొందరు బదిలీకి ఆప్షన్ ఇవ్వకున్నా.. అక్కడ ఆ పోస్టు ఖాళీగా ఉన్నట్లు చూపిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన కేజీబీవీ టీచర్లు, టీచర్ల సంఘాల లీడర్లకు సరైన సమాధానం చెప్పలేక దాటవేస్తున్నారు.

ఈ బదిలీల్లో రూ.లక్షలు చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలోని 475 కేజీబీవీల్లో పనిచేస్తున్న స్పెషల్ ఆఫీసర్లు (ఎస్ఓ), పీజీసీఆర్టీలు, సీఆర్టీలు, ఏఎన్ఎంలు, అకౌంటెంట్లు, పీఈటీల బదిలీలకు నెల రోజుల కింద స్కూల్  ఎడ్యుకేషన్ అధికారులు షెడ్యూల్  విడుదల చేశారు. బదిలీలన్నీ ఆన్​లైన్​లోనే నిర్వహిస్తున్నామని, పారదర్శకంగా చేస్తామని ప్రకటించారు. బదిలీలను ఉన్న జిల్లా పరిధిలో, అంతర్ జిల్లా స్థాయిలో చేపడతామని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఇచ్చిన షెడ్యూల్  ప్రకారం ప్రస్తుతం ఉన్న జిల్లాల్లోని బదిలీల ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం అంత ర్  జిల్లా బదిలీల ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే ఆప్షన్ల ప్రక్రియ పూర్తయింది. నేడో రేపో పోస్టులను అలాట్  చేయనున్నారు. ఈ ప్రక్రియలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నా, వాటిని చూపించడం లేద ని టీచర్లు చెబుతున్నారు. ముందుగా డీఈఓలు రిలీజ్  చేసిన వేకెన్సీ లిస్టుల్లో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నా.. ఆప్షన్ల టైమ్​ లో మాత్రం బ్లాక్  చేసినట్లు చెబుతున్నారు. 

ఆఫీసర్ల నుంచి నో రెస్పాన్స్  

కేజీబీవీల బదిలీల ప్రక్రియ పూర్తిగా స్కూల్ ఎడ్యుకేషన్, సమగ్ర శిక్ష అధికారులు నిర్వహిస్తున్నారు. బదిలీల్లో పోస్టులను ఖాళీగా చూపించకపోవడంపై కేజీబీవీ టీచర్లు, టీచర్ల సంఘాల నేతలు మాట్లాడినా, అధికారుల నుంచి సరైన సమాధానం రావడం లేదని టీఎస్ యూటీఎఫ్ నేతలు చెప్తున్నారు. డీఈఓలను అడిగితే.. స్టేట్ ఆఫీసుల్లోనే ఆ పోస్టులు హైడ్  చేశారని, వాస్తవానికి ఖాళీగానే ఉన్నట్లు చెప్తున్నారని వాపోతున్నారు. కొందరు రాజకీయ లీడర్లు పలుకుబడి ఉపయోగించుకొని కొన్ని పోస్టులను హైడ్  చేస్తున్నారని విమర్శించారు. 

పారదర్శకంగా నిర్వహించాలి: యూటీఎఫ్ 

కేజీబీవీ బదిలీలన్నీ పారదర్శకంగా నిర్వహించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.జంగ య్య, చావ రవి డిమాండ్  చేశారు. బ్లాక్  చేసిన ఖాళీలన్నింటినీ ఓపెన్  చేయాలని కోరారు. విద్యా శాఖలో అక్రమ బదిలీల ప్రక్రియ ఆనవాయితీగా వస్తున్నదని మండిపడ్డారు. అధికారులను దీనిపై ప్రశ్నించినా, సమాధానం చెప్పకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నదన్నారు. కేజీబీవీ బదిలీల్లో అక్రమాలను అరికట్టకపోతే, టీచర్ల నుంచి ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. 

సర్కారు మెమో ఆధారంగానే హైడ్:  అధికారులు 

ప్రభుత్వం నుంచి ఇటీవల వచ్చిన మెమో ఆధారంగానే కొన్ని పోస్టులను హైడ్  చేశారని పాఠశాల విద్యా శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. దీంట్లో కొన్ని మ్యూచువల్ ఉండగా, కొన్ని ప్రాంతాల్లో పోస్టులు ఇవ్వాలని ఆదేశాలిచ్చారని పేర్కొంటున్నారు. 

కొన్ని ఉదాహరణలు..  


    వరంగల్ జిల్లాలోని పర్వతగిరిలో పనిచేసే ఎస్ఓ బదిలీ కాక ముందే, అక్కడ ఆ పోస్టు ఖాళీగా చూపిస్తున్నారు.
    హన్మకొండ జిల్లాలోని ధర్మసాగర్ ఎస్ఓ పోస్టు ఖాళీగా ఉన్నా.. ఆప్షన్ లో మాత్రం కనిపించకుండా బ్లాక్  చేశారు. 
    రంగారెడ్డి జిల్లా కొత్తూరులో పీఈసీఆర్టీ సివిక్స్ పోస్టు ఖాళీగా ఉంది. కానీ ఆప్షన్ లో కనిపించడంలేదు. 
    వరంగల్ జిల్లా పర్వతగిరిలో సీఆర్టీ తెలుగు పోస్టు (ఇటీవల నల్లబెల్లికి అలాట్ ఆయ్యారు) ఖాళీగా ఉంది.కానీ ఖాళీల్లో కనిపించడం లేదు. 
    మహబూబ్ నగర్​ జిల్లా కేజీబీవీ గండ్వీడ్ లో పీజీసీఆర్టీ (నర్సింగ్) వేకెన్సీ ఉన్నా ఖాళీగా చూపించడం లేదు. 
    రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో సీఆర్టీ సోషల్ పోస్టు,  మంచాల మండలం పీజీసీఆర్టీ ఎకనామిక్స్ పోస్టు ఖాళీలుగా ఉన్న వాటిని చూపించడం లేదు. 
    నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు కేజీబీవీ ఎస్ఓ వెకెన్సీ ఉన్నా, చూపించడంలేదు. 
    వరంగల్ జిల్లా వర్ధన్నపేట కేజీబీవీలో పీజీసీఆర్టీ బోటనీ పోస్టు ఖాళీగా ఉన్నా చూపించడం లేదు.