- గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకొని కేసీఆర్ చేసిన తప్పే కాంగ్రెస్ చేసింది
- తుంగతుర్తి ఇష్యూపై సమన్వయ కమిటీ వేయాలి
- అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటా : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మోత్కూరు (యాదాద్రి), వెలుగు : 'ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చేరి పెత్తనం చలాయించే 'రూలింగ్ పార్టీ లీడర్ల'తో పాత కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది. బీఆర్ఎస్లో పదేండ్లు ఉండి.. లాభం పొందినోళ్లు.. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి ముందు సీట్లలో కూర్చుంటుంటే పాతోళ్లు వెనుకకుపోతున్నరు. కొత్తగా వచ్చినోళ్లు అసలైన కార్యకర్తలపై కేసులు కూడా పెడుతున్నరు' అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో కాంగ్రెస్లీడర్ఎలుగు యాదయ్య కుటుంబాన్ని బుధవారం పరామర్శించారు.
అనంతరం మోత్కూరులో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకొని కేసీఆర్ఏ తప్పు చేశారో..? ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీ కూడా అదే తప్పు చేసిందన్నారు. మెజారిటీ ఉన్నప్పటికీ బీఆర్ఎస్నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం వల్ల ఓడిన కాంగ్రెస్అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చేరిన వాళ్లతో కాంగ్రెస్‌కు ఏం లాభమని ప్రశ్నించారు. కొత్తగా వచ్చినోళ్లు పార్టీ పదవులు తీసుకోవడంతో పాటు పాత కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాలతో పాటు అనేక చోట్ల ఇదే పరిస్థితి నెలకొందన్నారు. తుంగతుర్తిలో మందుల సామేల్ ను కాంగ్రెస్ కార్యకర్తలే గెలిపించారన్నారు. కొత్తగా వచ్చినోళ్ల కారణంగా పాత కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరగకుండా సమన్వయ కమిటీ వేయాలని తాను జగ్గారెడ్డికి సూచించినట్లు తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. వారికి అన్యాయం జరగకుండా పార్టీ ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ అవసరమైతే ఏఐసీసీ పెద్దలతో కూడా మాట్లాడతానని చెప్పారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై లాఠీచార్జీ చేయడం దారుణం అన్నారు. ధర్నా చేస్తున్న రాహుల్‌గాంధీ, ప్రియాంకా వాద్రాను అరెస్ట్ చేయడం
సరికాదన్నారు.
