వికారాబాద్‌‌‌‌‌‌‌‌ను  టూరిజం హబ్ చేయండి

వికారాబాద్‌‌‌‌‌‌‌‌ను  టూరిజం హబ్ చేయండి

న్యూఢిల్లీ, వెలుగు: వికారాబాద్‌‌ను టూరిజం హబ్‌‌గా తీర్చిదిద్దాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలోని శాస్త్రి భవన్‌‌లో బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. వికారాబాద్‌లో టూరిజానికి అనువైన ప్రాంతాల గురించి మంత్రికి వివరించారు. సమావేశంలో తెలంగాణలో పర్యాటక అంశాలపై చర్చించారు.  హైదారాబాద్ కు సమీపంలో ఉన్న వికారాబాద్ ఐటీ ఉద్యోగులను, పర్యాటక ప్రేమికులను ఆకర్షిస్తోందని తెలిపారు. పరిగిలోని లక్నవరం చెరువు, వికారాబాద్‌‌లోని సర్పాన్ పల్లి చెరువులను పీపీపీ మోడల్ లో టూరిజం స్పాట్లుగా మార్చేందుకు చొరవ చూపాలని కోరారు. వాటర్ స్పోర్ట్స్, బోటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దామగుండం ఫారెస్ట్ ట్రెక్కింగ్ కు అనువైన ప్రాంతమని, చాలా మంది వీకెండ్ లో ఇక్కడి వస్తారన్నారు. కోట్ పల్లిలో వంద కోట్లతో ప్రొగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్, జస్టిస్ కొండా మాధవ రెడ్డి ఫౌండేషన్ కింద చేపట్టిన టూరిజం డెవలప్​మెంట్ కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.అనంతగిరి హిల్స్ లోని అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ఫిలిగ్రీం హబ్ గా మార్చాలని కోరారు. యాదాద్రి ఆలయంలో పదో వంతైనా ఇక్కడ డెవలప్​ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం హార్స్ రైడింగ్ ఫేమస్ అవుతోందని, వికారాబాద్ జిల్లాలో ఈ హార్స్ రైడింగ్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కేంద్రం పార్లమెంట్‌‌లో ప్రవేశపెట్టిన ఇన్ ల్యాండ్ వెసిల్స్ బిల్లు బాగుందన్నారు. తాను చేసిన విజ్ఞప్తులపై కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని విశ్వేశ్వర్​రెడ్డి తెలిపారు. వికారాబాద్ ను వాటర్ స్పోర్ట్స్, ట్రెక్కింగ్, ఫిలిగ్రీం సెంటర్, హార్స్ రైడింగ్ వంటి వినోదాత్మక కేంద్రంగా మార్చేందుకు సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు చెప్పారు.

ఢిల్లీ తెలంగాణ భవన్​లో మనోళ్లకే ఉద్యోగాలు ఇవ్వాలి

ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో తెలంగాణ వాళ్లకే ఉద్యోగాలు ఇవ్వాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్​ చేశారు. ఇక్కడ నియమించిన 74 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో నలుగురు మాత్రమే తెలంగాణ వాళ్లు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో రెసిడెంట్ కమిషనర్ గౌరవ్  ఉప్పల్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.