కొండపోచమ్మ సాగర్​ కాల్వకు గండి

కొండపోచమ్మ సాగర్​ కాల్వకు గండి
  • తుక్కాపూర్​ సర్జ్ పూల్  నుంచి నీళ్లు పంప్​ చేసిన ఆఫీసర్లు
  • అప్పటికే వానతో కాల్వ నిండా నీళ్లు
  • భారీ వరదతో ఎర్రవల్లి దగ్గర్లో తెగిన కెనాల్
  • శుక్రవారం తెల్లారి నుంచి మధ్యాహ్నం దాకా పొలాల్లోకి ప్రవాహం
  • మిడ్​మానేరు నుంచి లిఫ్ట్​ చేసిన నీళ్లు వృథా
  • పంపింగ్​ ఆపేసి, గండిని పూడ్చిన ఆఫీసర్లు
  • మధ్యాహ్నం కల్లా పరిస్థితి అదుపులోకి

సిద్దిపేట/గజ్వేల్, వెలుగుమల్లన్న సాగర్​ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్​కు నీళ్లను తరలించే గ్రావిటీ కెనాల్​కు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఎర్రవల్లి సమీపంలో గండి పడింది. మిడ్​మానేరు నుంచి వివిధ దశల్లో లిఫ్టు చేసి తెచ్చిన నీళ్లు వృథాగా పోయాయి. శుక్రవారం తెల్లారి నుంచి మధ్యాహ్నం దాకా నీళ్లు పొలాల్లోకి పారాయి. కాల్వ లైనింగ్​ పనుల్లో క్వాలిటీ లేకపోవడం, ఎగువన కురిసిన వర్షాలకు వచ్చే వరదను అంచనా వేయకుండా నీటి పంపింగ్​ కొనసాగించడమే గండికి కారణమని తెలుస్తోంది. ఆఫీసర్లు మల్లన్నసాగర్​ నుంచి నీళ్ల పంపింగ్​ను నిలిపేసి.. జేసీబీలతో గండిని పూడ్చారు.

ఇటు పంపింగ్​.. అటు వరద..

మిడ్​మానేరు నుంచి వివిధ దశల్లో అనంతగిరికి, అక్కడి నుంచి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్​ మీదుగా కొండ పోచమ్మ సాగర్​కు అధికారులు కొద్దిరోజులుగా నీటిని తరలిస్తున్నారు. మల్లన్న సాగర్ పూర్తికాకపోవడంతో ఈ రెండు రిజర్వాయర్ల మధ్య 17 కిలోమీటర్ల పొడవుతో గ్రావిటీ కెనాల్ తవ్వారు. 20 మీటర్ల వెడల్పు, ఎనిమిది మీటర్ల లోతు తవ్వి.. పూర్తి స్థాయిలో లైనింగ్​ చేసిన ఈ కెనాల్​కు తాజాగా గండిపడింది.

మల్లన్నసాగర్​ వద్ద తుక్కాపూర్​ సర్జ్​పూల్​ నుంచి మూడు మోటార్లతో ఆఫీసర్లు గురువారం నీటి పంపింగ్​ చేపట్టారు.అయితే గురువారం రాత్రి కొండపాక మండలంలో10 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. ఆ వరద కాల్వలోకి చేరింది. ఆఫీసర్లు దీనిని అంచనా వేయకుండా నీటి పంపింగ్​ చేశారు. భారీగా నీళ్లు రావడంతో ఎర్రవల్లి శివారులో శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల టైంలో కెనాల్​ తెగింది. సమీపంలోని పొలాల్లోకి భారీగా నీళ్లు పోవడం మొదలైంది. విషయం తెలుసుకున్న ఆఫీసర్లు ఉదయం మల్లన్నసాగర్ సర్జ్​పూల్ వద్ద నీటి పంపింగ్ నిలిపేశారు. జేసీబీలను తెప్పించి కాల్వ గండి పూడ్చే పనులు చేపట్టారు. మధ్యాహ్నానికల్లా పరిస్థితి అదుపులోకి వచ్చింది. కొడకండ్ల వద్ద కాల్వలో మట్టి పేరుకుపోవడం, కాల్వ లైనింగ్​పనుల్లో క్వాలిటీ లేకపోవడం కూడా గండికి కారణమైందని భావిస్తున్నారు. గత నెల 29న కొండ పోచమ్మ సాగర్​రిజర్వాయర్​ను సీఎం కేసీఆర్​ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. రెండు వారాల్లోనే కాల్వకు గండిపడడం చర్చనీయాంశంగా మారింది.

ప్రాజెక్టు రిజర్వాయర్​ వద్దకు సీఎం

సీఎం కేసీఆర్​ శుక్రవారం ఆకస్మికంగా కొండపోచమ్మ సాగర్​ రిజర్వాయర్​ను పరిశీలించారు. సాయంత్రం తన ఫాంహౌస్​​ నుంచి మర్కూక్​ మీదుగా కొండపోచమ్మ సాగర్​ కట్టపైకి చేరుకున్నారు. వెహికల్​లోనే రిజర్వాయర్​ కట్టపై ఒక రౌండ్​ తిరిగారు. మెల్లగా వెళ్తూ కట్టను, నీటిని పరిశీలించారు. తర్వాత మర్కూక్​ పంపుహౌస్​​ నుంచి రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోస్తున్న డెలివరీ సిస్టం వద్ద కొద్దిసేపు ఆగి.. పంపింగ్​ తీరును పరిశీలించారు. ఆ సమయంలో రెండు మోటార్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. ఈ సందర్భంగా కాసేపు అధికారులతో మాట్లాడారు. రిజర్వాయర్లో ఈత కొట్టడానికి ఎవరూ రాకుండా చూడాలని ఆదేశించారు. రిజర్వాయర్​ చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేసి, టూరిజం పరంగా అభివృద్ధి చేయాలని సూచించారు. సీఎం ఆకస్మికంగా రావడంతో కొందరు ఆఫీసర్లు, సెక్యూరిటీ సిబ్బంది తప్ప లోకల్​ లీడర్లెవరూ కనిపించలేదు. మీడియా ప్రతినిధులను సైతం రిజర్వాయర్​ కట్టపైకి అనుమతించలేదు. సుమారు అరగంట తర్వాత సీఎం తిరిగి ఫామ్​హౌస్​కు వెళ్లిపోయారు.

అవినీతికి ఇదే నిదర్శనం: వివేక్‌‌

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్  ఆంధ్రా కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారని.. కమీషన్ల కోసం క్వాలిటీలేని పనులతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్​ వెంకటస్వామి మండిపడ్డారు. ప్రారంభించిన పది రోజులకే కొండ పోచమ్మ కాల్వ తెగి నీళ్లు వృథా పోయాయని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాజెక్టుల పేరుతో జనాన్ని మభ్యపెడుతూ, కేసీఆర్, మేఘా కృష్ణారెడ్డి కలిసి నడుపుతున్న అవినీతి బాగోతానికి ఈ ఘటనే నిదర్శనమని ఆరోపించారు.

బలిపీఠంపై బక్కరైతు