ఆందోళనలో ప్రాజెక్టు బాధితులు

ఆందోళనలో ప్రాజెక్టు బాధితులు

వరద నీటిలో మునుగుతున్న కొండపోచమ్మ సాగర్​ కింది పొలాలు
ఆందోళనలో ప్రాజెక్టు బాధితులు
శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకోలు

సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: కొండ పోచమ్మ ప్రాజెక్టు ముంపు గ్రామమైన బైలంపూర్ కు చెందిన గువ్వ రవి కుటుంబానికి ఐదెకరాల పొలం ఉండేది. ప్రాజెక్టు నిర్మాణానికి రెండున్నర ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. మిగిలిన భూమి ప్రాజెక్టు కట్టకు దిగువన ఉంది. ఆ భూమిలో వ్యవసాయం చేద్దామంటే వానాకాలం పైనుంచి వర్షపు నీరు వచ్చి అక్కడ నిలిచిపోతోంది. ఇటీవల రవి రెండున్నర ఎకరాల్లో వరి సాగు కోసం నారుమడి రెడీ చేశాడు. పది రోజుల క్రితం కురిసిన వర్షాల వల్ల ఆ ప్రాంతమంతా నీరు నిలిచి చిన్నపాటి చెరువులా మారింది. అక్కడ నిలిచిన నీటిని అధికారులు పంపుల ద్వారా ప్రాజెక్టులోకి తోడిస్తున్నారు. కానీ ఈ ప్రక్రియ ముగిసేసరికి దాదాపు మూడు మాసాలకు పైనే పడుతుంది. అప్పటికీ సీజన్ ముగిసిపోతుందని, ఇక పంటలెలా పండించాలని రవి వాపోతున్నాడు. ఈ సమస్య ఒక్క  రవిది మాత్రమే కాదు.. ఈ ప్రాంతంలోని దాదాపు వంద మంది రైతులది. కొండపోచమ్మ సాగర్​ప్రాజెక్టులో భూమి కోల్పోయిన రైతులు మిగిలిన కాస్త పొలంలోనైనా పంటలు పండించుకుందామంటే వీలు లేకుండా పోయింది. పొలాల్లోకి ఏటా వరద నీరు చేరి చెరువులా మారుతున్నాయి. దాంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 
.
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలంలోని బైలంపూర్ గ్రామం కొండపోచమ్మ సాగర్​ రిజర్వాయర్ నిర్మాణంతో ముంపునకు గురైంది. గ్రామస్తులను ఆర్అండ్ఆర్ కాలనీకి తరలించారు. కట్ట పక్కనే బైలంపూర్ కు చెందిన వంద మంది రైతులవి దాదాపు 120 ఎకరాల మేర భూములున్నాయి. మిగులు భూములున్నది పల్లపు ప్రాంతం కావడంతో వర్షం నీరు ఇటువైపుగా వస్తోంది. రిజర్వాయర్ నిర్మించకముందు ఇటువైపు వచ్చే నీరు పాములపర్తి చెరువులోకి వెళ్లిపోయేది. రిజర్వాయర్ కట్ట నిర్మాణంతో వర్షపు నీరు ముందుకు సాగక అక్కడే నిలిచిపోతోంది. వానాకాలం సీజన్లో వరద నీటితో ఈ భూములు చెరువుల్లా మారుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించినపుడే ఈ సమస్య ఉత్పన్నం కావడంతో రైతులు పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. గత ఏడాది మూడు మోటార్లను ఏర్పాటు చేసి నిలిచిన నీళ్లను రిజర్వాయర్ లోకి తోడడం షురూ చేశారు. కానీ తక్కువ సామర్థ్యం కలిగిన మోటార్లను ఉపయోగించడం వల్ల ఎక్కువ టైం పడుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో దాదాపు వంద ఎకరాల మేర నీరు నిలిచి ఆ ప్రాంతమంతా చెరువులా మారింది. అధికారులు మోటార్లతో నీటిని తోడుతున్నా ఖాళీ అయ్యే నాటికి కనీసం మూడు మాసాలకు పైనే పడుతుందని, ఇక ఈ సీజన్ లో తాము ఎలా వ్యవసాయం చేయాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య శాశ్వత పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. 

వరద నీటిని మళ్లిస్తే.. 
ఇటీవల కురిసిన వర్షాల వల్ల వరద నీరు నిలిచి కోతకొచ్చిన స్వీట్ కార్న్, మక్కలు, కూరగాయల పంటలు మునిగిపోయాయి.  దాదాపు పది ఎకరాల్లో కోతకు వచ్చిన స్వీట్ కార్న్ మునిగిపో వడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దాదాపు 40 మంది రైతులు వరి సాగు కోసం నారును రెడీ చేసు కున్నారు. ఆ భూములన్నీ ఇప్పుడు నీళ్లల్లో మునిగి పోయాయి. వరద నీటి వల్ల బోర్లలోకి మట్టి చేరి, మోటార్లు కూరు కుపోయి ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. వరద నీటిని సంగారెడ్డి కెనాల్కు మళ్లిస్తే ముంపు ముప్పు శాశ్వతంగా తప్పుతుందని సూచిస్తున్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు నీటిని తరలించడం కోసం సంగారెడ్డి కాల్వను నిర్మించారు. ఈ ప్రాంతానికి కేవలం కిలో మీటరు దూరంలో ఉన్న సంగారెడ్డి కాల్వలోకి నీటిని మళ్లించడమే ఏకైక మార్గంగా పేర్కొంటున్నారు. 

శాశ్వత పరిష్కారం చూపాలె
కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్వాసితుల మిగులు భూముల్లో ఏర్పడిన సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి. ఏటా వంద మంది రైతుల భూముల్లోకి వర్షపు నీరు చేరడంతో వారికి కనీస ఉపాధి కరవవుతోంది. ఈ విషయంలో అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. ఆ భూముల్లో పంటల సాగుకు ఇబ్బందులు లేకుండా చూడాలి.      
- రమేశ్​యాదవ్, బీజేపీ ములుగు మండల అధ్యక్షుడు