కుదిరితే పార్ట్​నర్​షిప్​ లేదంటే క్యాష్​..

కుదిరితే పార్ట్​నర్​షిప్​ లేదంటే క్యాష్​..

వరంగల్రూరల్‍, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పర్మిషన్​ ఇచ్చిన 159 బార్ల కోసం గురువారం ఉదయం జిల్లాల్లో నిర్వహించిన లక్కీ డ్రా ఇలా ముగిసిందో లేదో అలా లిక్కర్​ వ్యాపారులు, లీడర్లు రంగంలోకి దిగారు. ఉదయం 11 గంటల నుంచి జిల్లా కేంద్రాల్లో ఆఫీసర్లు డ్రా తీయడం మొదలుపెట్టేసరికే ప్రాంగణాలన్నీ కార్లతో నిండిపోయాయి. వేల మంది పోటీపడితే కేవలం 159 మందినే అదృష్టం వరించడంతో వాళ్లకు ఆఫీసర్లు కంగ్రాట్స్​ చెప్పడమే ఆలస్యం అన్నట్లుగా లిక్కర్‍ మాఫియా, పొలిటికల్‍ లీడర్లతో కూడిన స్పెషల్​ టీమ్​లు ఎంటరయ్యాయి. ‘బాస్‍ ఎక్కడ మీది.. ఎన్ని టోకెన్లు వేసినవ్‍.. బిజినెస్‍లో ఇదే ఫస్టా ఇంకా షాపులు ఏమైనా ఉన్నాయా..’ అంటూ ఎంక్వైరీ షురూ చేశారు. ‘అన్న మాట్లాడుతడంటా.. ’ అంటూ పలుచోట్ల పెద్ద లీడర్లతో ఫోన్లు కలిపి ఇచ్చారు. ‘కుదిరితే పార్ట్​నర్​షిప్​.. లేదంటే క్యాష్​ ఆఫర్’ ​అంటూ మంతనాలు మొదలుపెట్టారు. బార్‍ దక్కించుకున్నవాళ్ల సెల్‍ నంబర్‍, ఇంటి అడ్రస్‍తో సహా ఫుల్‍ డిటైల్స్​ తీసుకుంటూ హల్​చల్​ చేశారు. ఈ ఫీల్డ్​లో కొంత అనుభవం ఉన్నవాళ్లు తెలివిగా ఎస్కేప్​అవగా, మిగిలినవాళ్లు లిక్కర్‍ మాఫియా చేతిలో ఇబ్బందులు పడ్డారు. నెక్ట్స్​ ఏం జరగబోతుందో ఊహించుకుంటూ టెన్షన్‍ పడ్డారు.

అటు డ్రా.. ఇటు టెన్షన్​..

సర్కారు స్టేట్‍వైడ్‍ మరో 159 బార్లకు పర్మిషన్​ ఇచ్చింది. గత నెల 25న ఎక్సైజ్‍ డిపార్ట్​మెంట్​ప్రకటన జారీ చేస్తే గడువు ముగిసే టైంకు ఎవరూ ఊహించని రీతిలో 8,464 అప్లికేషన్లు వచ్చాయి. వైరాలో ఒక్క షాప్‍ కోసం 381, యాదగిరిగుట్టలో 317, నేరేడుచర్లలో 276, తొర్రూర్‍ బార్​ కోసం 271 మంది పోటీ పడ్డారు. ఇలా సగటున ప్రతి బార్​ కోసం 200 మందికంటే ఎక్కువ పోటీపడ్డారు. గురువారం డ్రా కావడంతో ఎక్సైజ్‍ ఆఫీసర్లు జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన లక్కీ డ్రా సెంటర్లన్నీ జనంతో  కిటకిటలాడాయి. లిక్కర్​డాన్లు, లీడర్లు కూడా తరలివచ్చారు. లక్కీ డ్రా తీస్తున్నంత సేపు అందరూ టెన్షన్​ ఫీలయ్యారు. బార్​ దక్కినవాళ్లు ఆనందంతో చేతులుపైకెత్తి కేరింతలు కొడితే దక్కనివాళ్లలో కొందరు నిరాశపడుతూ వెళ్లిపోయారు. కానీ ఎప్పటి నుంచో లిక్కర్​ దందాలో ఉన్నవాళ్లు, లీడర్లు  మాత్రం అక్కడి నుంచి కదలకుండా బార్లు దక్కినవాళ్ల సమాచారం సేకరిస్తూ ఉండిపోయారు. కొత్తగా ఈ ఫీల్డ్​లోకి వచ్చినవాళ్లను నయానో, భయానో ఒప్పించే ప్రయత్నం చేశారు. బార్​ నడపాలంటే  పొలిటికల్​, పోలీస్​ సపోర్ట్​ కావాలని, అందువల్ల తమకు వదిలేస్తే బెస్ట్​ ఆఫర్​ ఇస్తామని, లేదంటే పార్ట్​నర్​షిప్​ తీసుకోవచ్చని సలహా ఇచ్చారు. బార్లు దక్కినవాళ్ల ఫోన్​ నంబర్లు మాఫియా చేతుల్లోకి వెళ్లడంతో లైసెన్స్​ చేతికివచ్చే లోపు ఏమి జరుగుతుందోనని బార్లు దక్కించుకున్నవాళ్లు టెన్షన్​ పడుతున్నారు.

సర్కారుకు.. అసలు కంటే కొసరే ఎక్కువ!

ప్రభుత్వం ప్రస్తుతం కొత్తగా 159 బార్లకు పర్మిషన్‍ ఇచ్చిన నేపథ్యంలో లైసెన్స్​ఫీజు రూపంలో సర్కారుకు ఏటా రూ.65 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు ఆదాయం పెరగనుంది. వీటిని దక్కించుకోవడం కోసం నాన్‍ రిఫండబుల్‍ రూపంలో వచ్చిన అప్లికేషన్ల డబ్బులే సర్కారుకు ఎక్కువ ఇన్‍కమ్‍ తెచ్చిపెట్టాయి.  గతనెల 25 నుంచి జిల్లాల్లో ఆబ్కారీ ఆఫీసర్లు అప్లికేషన్లు తీసుకున్నారు. అప్లై చేసుకోడానికి మొదట్లో ఫిబ్రవరి 8 వరకు గడువు ఇవ్వగా.. తర్వాత 16కు పెంచారు. ఫస్ట్​ ఇచ్చిన టైంలోగా 7,393 మంది అప్లై చేసుకోగా, రెండో గడువు నాటికి ఈ సంఖ్య 8,464కు పెరిగింది. ఒక్కో అప్లికేషన్​కు రూ.లక్ష ఫీజు ఉండగా, ఈ 20 రోజుల్లోనే ఎక్సైజ్‍ డిపార్టుమెంట్‍కు  రూ.84.64 కోట్లు వచ్చాయి. అంటే ఏడాది లైసెన్స్​ ఫీజు కంటే ఇది రూ.14 కోట్ల నుంచి రూ.20 కోట్లు ఎక్కువ కావడం విశేషం.