పౌష్టికాహారం పేరుతో గర్భిణీలకు మురిగిన గుడ్లు

పౌష్టికాహారం పేరుతో గర్భిణీలకు మురిగిన గుడ్లు
  • టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్ల కక్కుర్తి
  • బెంబేలెత్తున్న చిన్నారులు,గర్భిణీ మహిళలు
  • పంపిణీ నిలిపివేయమని అంగన్ వాడీ కార్యకర్తలకు అధికారుల సూచన

అంగన్ వాడీ కేంద్రాల్లో నాణ్యత కరువవుతోంది. పౌష్టికాహారం అందించాల్సిన స్థానంలో గర్భిణీలకు, బాలింతలకు నాసిరకం పదార్ధాలను అంటగడుతున్నారు. బలవర్ధక పదార్ధాలకు బదులు మురిగిన కోడిగుడ్లను ఇస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల టెండర్ల దక్కించుకున్న కాంట్రాక్టర్లే ఈ కక్కుర్తికి పాల్పడుతున్నారు.

మంగళగిరి ఐసీడీఎస్ పరిధిలో ఈ అక్రమం వెలుగు చూసింది. ఐసీడీఎస్ అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లు ఈ అక్రమానికి పాల్పడుతున్నారని, వారు సరఫరా చేస్తున్న పదార్ధాలతో అనారోగ్యం పాలవుతున్నామని గర్భిణులు, బాలింతలు ఆరోపిస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో సుమారు నెల నుంచి తరచూ మురిగిన కోడిగుడ్లను సరఫరా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

తాజాగా  తాడేపల్లి మండలం ఉండవల్లి లోని ఓ అంగన్ వాడీ కేంద్రంలో ఓ గర్భిణీ మహిళకు కోడిగుడ్లు ఇచ్చారు. అయితే ఆమె అనుమానం వచ్చి ఇక్కడ తినలేనని చెప్పి ఇంటికివెళ్ళి పగులగొట్టి చూడగా అవి మురిగిపోయాయి. దీంతో ఆమె  బెంబేలెత్తి విషయాన్ని తన భర్తకు తెలియజేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం తెలుసుకున్న ఐపీడిఎస్ అధికారులు ఆ గుడ్లను పరీక్షించగా అవి నాసిరకం అని తేలడంతో వెంటనే పంపిణీ నిలిపివేయాలని అంగన్ వాడి కార్యకర్తలకు సూచించారు. ఈ సరుకును సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.