దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి రూ. 500కే వంట గ్యాస్

దారిద్య్ర  రేఖకు దిగువన ఉన్న వారికి రూ. 500కే వంట గ్యాస్

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రాజస్ధాన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేవలం రూ. 500కే వంట గ్యాస్ అందిస్తామని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలకు ఎవరూ దూరం కాకూడదని, ప్రస్తుతం ధరల పెరుగుదల సమస్య తీవ్రంగా ఉందని వెల్లడించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర రాజస్ధాన్ లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం అశోక్ గెహ్లాట్ ఈవిషయాన్ని ప్రకటించారు.  

వచ్చే నెల బడ్జెట్ కు సిద్ధమౌతున్నట్లు, ఉజ్వల పథకం కింద పేదలకు ప్రధాని నరేంద్ర మోదీ ఎల్‌పీజీ కనెక్షన్లు, గ్యాస్ ఓవెన్‌లు అందిస్తున్నారనే విషయాన్ని సీఎం అశోక్ గెహ్లాట్ గుర్తు చేశారు. అయితే.. గ్యాస్ ధరలు ఇప్పుడు రూ.400 నుంచి రూ.1,040 మధ్య ఉన్నాయని సీఎం గెహ్లాట్ తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్1 తర్వాత దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి, ఉజ్వల యోజన లబ్దిదారులకు రూ.500కే  వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం రాజస్ధాన్ లో అసెంబ్లీ ఎన్నికల జరుగనున్న క్రమంలో సీఎం అశోక్ గెహ్లాట్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.