రోడ్ల పక్కన ఫ్రైడ్ రైస్, నూడుల్స్ తింటున్నారా.. పంది కొవ్వు నూనె ఉండొచ్చు జాగ్రత్త

రోడ్ల పక్కన ఫ్రైడ్ రైస్, నూడుల్స్ తింటున్నారా.. పంది కొవ్వు నూనె ఉండొచ్చు జాగ్రత్త

ఫాస్ట్​ఫుడ్.. పేరు వినగానే నోట్లో నీరు ఊరాయి కదా.. ఈ వార్త చూసిన తరువాత కూడా మీరు అదే ఫీలింగ్​లో  ఉంటారా.. పంది కొవ్వుతో తయారు చేసిన నూనె కొన్ని ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లలో ఉపయోగిస్తున్నారండీ. అదీ మన హైదరాబాద్లో. కొంచం గుండె దిటవుగా చేసుకుని ఈ వార్త చదవండీ..

పంది కొవ్వుతో నూనె తయారు చేసి.. ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లకు తక్కువ ధరకు అమ్ముతున్న వ్యక్తిని మల్కాజిగిరి ఎస్​ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్న తరువాత సంచలన విషయాలు బయటకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడ్​మెట్​లోని ఆర్కేపురంలో ఉంటున్న రమేశ్​శివ(23) తన ఇంట్లో కొన్నేళ్లుగా పంది కొవ్వుతో నూనెలు తయారు చేస్తున్నాడు. పంది మాంసం అమ్మే వారి దగ్గర్నుంచి కొవ్వు సేకరించి.. దాన్ని వేడి చేసి.. కెమికల్స్ కలుపుతున్నాడు. దీంతో వచ్చిన నూనెను రోడ్డు పక్కన ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లు నడిపే వారికి తక్కువ ధరకు అమ్ముతున్నాడు. 

సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి నివాసంలో తనిఖీ చేశారు. పోర్క్​ఫ్యాట్​తో నూనె తయారు చేస్తున్న విషయం తెలుసుకుని వారు విస్తు పోయారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఏళ్లుగా ఇదే దందా జరుగుతున్నా పోలీసులకు తెలియపోవడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.  నిందితుడి చుట్టు పక్కల ప్రాంతాల వాళ్లు ఇన్నాళ్లు తాము పంది కొవ్వుతో చేసిన ఫుడ్ తిన్నామా అని ఆందోళన చెందుతున్నారు.