స్మార్ట్​ఫోన్​ కంపెనీలకు కష్టకాలం..ఆరు నెలల్లో తగ్గిన ఫోన్ల అమ్మకాలు

స్మార్ట్​ఫోన్​ కంపెనీలకు కష్టకాలం..ఆరు నెలల్లో తగ్గిన ఫోన్ల అమ్మకాలు

న్యూఢిల్లీ: స్మార్ట్​ఫోన్​ కంపెనీలకు కష్టకాలం దాపురించింది. గడచిన ఆరు నెలల్లో అమ్మకాలు బాగా తగ్గడం వల్ల ఇవి జనవరి– ఏప్రిల్ మధ్య 20శాతం (వార్షికంగా)  వరకు తమ ఉత్పత్తి సామర్థ్యాలను తగ్గించుకున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇండస్ట్రీ రీసెర్చర్​ కౌంటర్‌‌‌‌పాయింట్  తాజా లెక్కల ప్రకారం, స్మార్ట్‌‌‌‌ఫోన్ షిప్‌‌‌‌మెంట్‌‌‌‌లు  ( ప్రాక్సీ ఆఫ్​ సేల్స్) -2022  అక్టోబర్–-డిసెంబర్​ కాలంలో 30శాతం (వార్షికంగా),  2023 జనవరి–-మార్చిలో 18శాతం తగ్గాయి. భారతదేశపు అతిపెద్ద మొబైల్ ఫోన్ రిటైలర్, రిలయన్స్ రిటైల్ కూడా జనవరి–-మార్చి క్వార్టర్​లో  మొబైల్ ఫోన్లకు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్​లకు గిరాకీ తగ్గిందని వెల్లడించింది. మొబైల్ ఫోన్ పరిశ్రమ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నెమ్మదించిందని, డిమాండ్‌‌‌‌ తగ్గుతోందని జైనా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ జైన్ అన్నారు. ఈ గ్రూప్​ కార్బన్ బ్రాండ్‌‌‌‌ పేరుతో ఫోన్లను అమ్మడమేగాక, అనేక కంపెనీలకు స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌లను తయారు చేసి ఇస్తుంది.  డిమాండ్ తగ్గిపోవడంతో కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయని,  కొంత కాలం పాటు పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఈ ఏడాది జనవరి నుండి హ్యాండ్‌‌‌‌సెట్ అవుట్‌‌‌‌పుట్ 20శాతం వరకు తగ్గిందని కౌంటర్‌‌‌‌పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ వెల్లడించారు. ప్రీమియం సెగ్మెంట్ ఇప్పటికీ బాగానే ఉందని, ఎంట్రీ  మిడ్-టైర్ సెగ్మెంట్లలో గిరాకీ తగ్గడంతో కంపెనీలు ఉత్పత్తిని 15–-20శాతం తగ్గించాయని వివరించారు.  "ప్రస్తుతం, చాలా బ్రాండ్ల దగ్గర దాదాపు పది వారాలకు సరిపోయే ఇన్వెంటరీ (అమ్ముడుపోని సరుకు) ఉంది. ఏప్రిల్–-జూన్ క్వార్టర్​ వరకు ఫోన్ల ఉత్పత్తి తక్కువగానే ఉండవచ్చు. ఈ క్యాలెండర్ సంవత్సరంలో జూన్​ తరువాత పరిస్థితి కొంత మెరుగుపడవచ్చు" అని పాఠక్ చెప్పారు. 

2022లోనూ ఇదే పరిస్థితి..

కిందటి ఏడాది ఏప్రిల్–-జూలైలో,  దీపావళి తర్వాత.. అంటే నవంబర్–-డిసెంబర్‌‌‌‌లోనూ పరిశ్రమ ఫోన్ల తయారీని తగ్గించింది. ఈ క్యాలెండర్ సంవత్సరంలో  ప్రొడక్షన్​ను తగ్గించడం ఇదే మొదటిసారి.  ఇలాంటి తగ్గింపులు ప్రస్తుతస్థాయిలతో పోలిస్తే అప్పుడు 5–-10శాతం తక్కువగా ఉన్నాయని కొందరు ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్స్​ చెప్పారు.  థర్డ్-పార్టీ ఎలక్ట్రానిక్ తయారీదారు డిక్సన్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ లాల్ మాట్లాడుతూ మొబైల్ ఫోన్ డిమాండ్ ఊపందుకోవడం లేదని,  కొన్ని కంపెనీలు భారతదేశం నుండి హ్యాండ్‌‌‌‌సెట్‌‌‌‌లను ఎగుమతి చేస్తున్నందున భారీగా తగ్గుదల కనిపించడం లేదని వివరించారు.  షావోమీ ఇండియా ప్రెసిడెంట్ మురళీకృష్ణన్ ఇదే విషయం గురించి మాట్లాడుతూ 2022 సంవత్సరంలోనూ డిమాండ్​ మెరుగ్గా ఏమీ లేదని, అమ్మకాలు తక్కువగా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఇన్వెంటరీలో చాలా వరకు ఈ సంవత్సరం చివరి నాటికి అమ్ముడవుతుందని అంచనా వేశారు. స్మార్ట్​ఫోన్​ మేకర్ల తాజా లాంచ్‌‌‌‌లకు విపరీతమైన రెస్పాన్స్​ వచ్చిందని చెప్పారు. మార్కెట్ సవాళ్లు ఉన్నప్పటికీ, ఇక నుంచి అమ్మకాలు బాగుంటాయనే ఆశ ఉందని ఆయన వివరించారు.