సౌండ్ తగ్గించమన్నందుకు కత్తితో పొడిచి చంపిన పక్కింటివాళ్లు

సౌండ్ తగ్గించమన్నందుకు కత్తితో పొడిచి చంపిన పక్కింటివాళ్లు

ఢిల్లీలో దారుణం జరిగింది. సౌండ్ తగ్గించమన్నందుకు ఒక వ్యక్తిని పొడిచి చంపారు పక్కింటివాళ్లు. ఈ విషాద ఘటన మహేంద్ర పార్క్ ప్రాంతంలోని భడోలాలో మంగళవారం జరిగింది. సుశీల్ చంద్ అనే వ్యక్తి తన కుటుంబసభ్యులతో స్థానికంగా నివసిస్తున్నాడు. వారి పక్కింట్లో అల్లం వ్యాపారం చేసే సత్తార్ కుటుంబం ఉంటోంది. అయితే మంగళవారం సత్తార్ కొడుకులు షహ్నావాజ్ మరియు ఆఫక్ సౌండ్ పెద్దగా పెట్టి మ్యూజిక్ వింటున్నారు. ఆ శబ్దం ఎక్కువగా వస్తుండటంతో.. సుశీల్ వెళ్లి సౌండ్ తగ్గించమని చెప్పాడు. ఆ విషయంలో సుశీల్‌కు మరియు సత్తార్ కుటుంబసభ్యలకు గొడవ జరిగింది. అది గమనించిన సుశీల్ సోదరులు సునీల్, అనీల్ కూడా అక్కడికి వచ్చి సత్తార్ ఫ్యామిలీతో మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా సత్తార్ ఫ్యామిలీ సుశీల్ మరియు అతని సోదరులపై కత్తులతో దాడికి దిగారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీరిని సుశీల్ కుటుంబసభ్యులు బాబు జగ్జీవన్ రామ్ మెమోరియల్ (బీజేఆర్ఎం) ఆస్పత్రికి తరలించారు. అక్కడికి వెళ్లగానే పరిశీలించిన వైద్యులు.. సుశీల్ చనిపోయినట్లుగా నిర్ధారించారు. అనీల్, సునీల్‌లకు ప్రథమ చికిత్స చేసిన అనంతరం.. మెరుగైన వైద్యం కోసం సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘర్షణలో సత్తార్ భార్య షాజహాన్ కూడా గాయపడటంతో ఆమెకు బీజేఆర్ఎం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

సునీల్ స్టేట్మెంట్ ఆధారంగా.. సత్తార్ మరియు అతని ఇద్దరు కుమారులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సుశీల్‌కు గతంలో క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. సుశీల్ మృతదేహానికి బీజేఆర్ఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

కాగా.. మృతుడి కుటుంబాన్ని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బుధవారం పరామర్శించారు. బాధితుడి కుటుంబానికి న్యాయం కలిగేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో మాట్లాడి వారి కుటుంబానికి ఆర్థికసాయం చేస్తామని ఆయన అన్నారు.

For More News..

డిఫరెంట్ ఐడియా: ప్రీ-వెడ్డింగ్ ఫొటోషూట్ కోసం రెంటుకు ఆర్టీసీ బస్

వైరల్ పోస్ట్: పసుపురంగు తాబేలును ఎప్పుడైనా చూశారా?

తెలంగాణలో కొత్తగా 1,504 కరోనా కేసులు