నేటి నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు

నేటి నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు
  • నేటి నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు
  • అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన పోలీస్ బలగాలు
  • ఏడాదిలో 160 మంది నక్సల్స్ మృతి

భద్రాచలం/జయశంకర్ భూపాలపల్లి/మహాముత్తారం, వెలుగు: చత్తీస్ గఢ్ – తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాల్లోని పరిస్థితులు నువ్వా.. నేనా అన్నట్లు ఉన్నాయి. వారం రోజుల పాటు మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించగా.. వాటిని అడ్డుకునేందుకు పోలీస్​బలగాలు రెడీ అయ్యాయి. ఏజెన్సీ ఏరియాల్లో రెడ్​ అలెర్ట్​ ప్రకటించడంతో ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. నక్సలైట్ ఉద్యమ నిర్మాత చారుమజుందార్1972 జులైలో మృతి చెందగా అప్పటి నుంచి మావోయిస్టు పార్టీ అమరులను స్మరించుకునేందుకు జులై 28 నుంచి వారం పాటు సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తోంది. గతంలో కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో ఏటా రెడీమేడ్ స్థూపాలు ఏర్పాటు చేసి వారోత్సవాలు నిర్వహించేవారు. మావోయిస్టులు క్రమంగా ఈ ప్రాంతాల్లో పట్టు కోల్పోవడంతో కొన్నేళ్లుగా నిర్వహించట్లేదు. కాగా మావోయిస్టు పార్టీకి 2020–21 సంవత్సరంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. అగ్ర నాయకులతోపాటు మొత్తం160 మంది నక్సల్స్ మరణించారు. ఓ వైపు పోలీసులు తరుముతుంటే.. మరో వైపు కరోనా కామ్రేడ్లను అతలాకుతలం చేసింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ సారథి యాపా నారాయణ అలియాస్ హరిభూషణ్‍, కేంద్ర కమిటీ సభ్యుడు కత్తి మోహన్‍రావు, భారతక్క అలియాస్‍ సిద్దబోయిన సారక్క, గడ్డం మధుకర్‍, గంగాల్‍, సందె గంగన్న, రామాల్‍(సుధీర్‍), సుక్కాల్‍, లక్మాల్‍, జనగక మ్యాధురీ(విజేందర్‍), భిక్షపతి తదితర నేతలతో పాటు పార్టీ సానుభూతిపరులు ఆలెం కిరణ్‍, మల్లేశం వంటి వారు చనిపోయారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు  తప్పకుండా నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో భద్రాద్రికొత్తగూడెం, ఉమ్మడి వరంగల్​జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. 

వారం రోజులు సభలు

మిలీషియా సభ్యుల నడుమ స్థూపాలు నిర్మించి నివాళ్లు అర్పిస్తారని.. వాటిని అడ్డుకునేందుకు భద్రతా బలగాలు కూంబింగ్​ముమ్మరం చేశాయి. మరోవైపు మావోయిస్టులు నిర్బంధాలను అధిగమించి వారోత్సవాలు నిర్వహించాలని పట్టుదలతో ఉన్నారు. తెలంగాణ – చత్తీస్‍గఢ్ సరిహద్దుల్లోని పరిస్థితులు నువ్వా.. నేనా.. అన్నట్లుగా ఉండగా గిరిజన పల్లెలు అట్టుడుకుతున్నాయి. ఇటీవలే దండకారణ్యంలో మావోయిస్టు మాస్టర్​ మైండ్ ​హిడ్మాకు పేలుడు పదార్థాలు చేరవేస్తున్నారంటూ ఎన్‍ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్​ఏజెన్సీ) కొందరు కాంట్రాక్టర్లను తెలంగాణలోని 5 జిల్లాల్లో అరెస్ట్ చేసింది. వారిలో భద్రాచలం డివిజన్​నుంచి ఇద్దరు కాంట్రాక్టర్లను ఎన్‍ఐఏ అదుపులోకి తీసుకుంది. అలాగే తెలంగాణ, చత్తీస్‍గఢ్​పోలీసులు, సీఆర్పీఎఫ్​జవాన్లు మావోయిస్టు మిలీషియా సభ్యులను అదుపులోకి తీసుకుంటున్నారు. సుక్మా జిల్లా కిష్టారం పోలీసులు ఇటీవల మావోయిస్టు కమాండర్ టైగర్​హుంగాను అరెస్ట్ చేశారు.17 దాడుల్లో ప్రధాన సూత్రధారిగా ఉన్న హుంగా అరెస్ట్ సరిహద్దు పోలీసుల విజయంగా చెబుతున్నారు.

డేగ కన్ను..

మావోయిస్టు వారోత్సావాలను అడ్డుకునేందుకు భద్రాద్రికొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని సరిహద్దు పోలీస్​స్టేషన్ల పరిధిలో రెడ్​ అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టు ప్రభావిత గిరిజన గ్రామాలపై డేగ కన్ను వేశారు. ఇందుకోసం ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. కూంబింగ్​కొనసాగిస్తూనే ప్రజాప్రతినిధులకు నోటీసులు జారీ చేశారు. తమ అనుమతి లేకుండా పల్లెల్లోకి వెళ్లొద్దనిసూ చించారు. హిట్​లిస్టులో ఉన్నవారందరినీ గ్రామాలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని పేర్కొన్నారు. ఆర్టీసీ కూడా భద్రాచలం నుంచి చర్ల, వెంకటాపురం, వాజేడు, పేరూరు, చత్తీస్‍గఢ్​వెళ్లే బస్సు సర్వీసులను తగ్గించింది. రాత్రి వేళ సర్వీసులను రద్దు చేసింది.