భూమి పూజకు రాష్ట్రపతి కోవింద్‌ను ఆహ్వానించాల్సింది

భూమి పూజకు రాష్ట్రపతి కోవింద్‌ను ఆహ్వానించాల్సింది

బీఎస్పీ అధినేత్రి మాయావతి

లక్నో: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను అయోధ్య రామ మందిర భూమి పూజ వేడుకకు ఆహ్వానించాల్సిందని యూపీ మాజీ సీఎం మాయావతి అన్నారు. దళిత కమ్యూనిటీకి చెందిన కోవింద్‌ను ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు పిలిస్తే బాగుండేదని బహుజన్ సమాజ్‌వాది పార్టీ అధినేత్రి చెప్పారు.

‘ఈనెల 5న అయోధ్యలో నిర్వహించిన భూమి పూజకు ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్‌ను ఆహ్వానించాల్సింది. ఆయన హాజరు మంచి సందేశాన్ని పంపేది. దళిత కమ్యూనిటీకి చెందిన వారు కూడా ఆ ఈవెంట్‌లో పాల్గొనాలని ఉత్సుకత చూపారు. కానీ వారిని నిర్లక్ష్యం చేశారు’ అని మాయావతి చెప్పారు. దళిత కమ్యూనిటీకి చెందిన జునా అఖాడా మహామండలేశ్వర్ స్వామి కన్హయ్యా ప్రభునందన్ గిరిని కూడా భూమి పూజకు పిలవలేదన్నారు. ఆయనను పిలిచి ఉంటే రాజ్యాంగంలోని కుల రహిత సమాజమనే లక్ష్యాన్ని నెరవేర్చే అవకాశం ఉండేదన్నారు.

లక్నోలో 108 అడుగుల పరశురాముడి విగ్రహాన్ని తయారు చేయాలన్న సమాజ్‌వాది పార్టీ ప్రపోజల్‌పై మాయావతి మండిపడ్డారు. బ్రాహ్మణుల ఓట్లను ఆకర్షించడానికి ఎస్పీ యత్నిస్తోందన్నారు. ‘బీఎస్పీ పాలనలో ప్రారంభించిన పలు పథకాలకు వివిధ కులాలకు చెందిన ప్రముఖ సాధువుల పేర్లు పెట్టాం. అయితే ఎస్పీ అధికారంలోకి వచ్చాక ఈ స్కీమ్స్‌కు కులవాద మనస్తత్వంతో పేర్లు మార్చింది. ఇప్పుడు పరశురాముడి విగ్రహం గురించి మాట్లాడే బదులు అప్పుడే దాన్ని రూపొందించాల్సింది’ అని మాయావతి స్పష్టం చేశారు.