మారితే మళ్లీ పొత్తు: ఎస్పీతో దోస్తీ పై మాయావతి

మారితే మళ్లీ పొత్తు: ఎస్పీతో దోస్తీ పై మాయావతి

మతవాద బీజేపీని ఓడించే అవకాశాన్ని సమాజ్​వాదీ పార్టీ చేజేతులా జారవిడిచిందని బహుజన్​ సమాజ్​ పార్టీ చీఫ్​ మాయావతి ఆక్షేపించారు. యాదవుల ఓట్లు ఎక్కువగా ఉన్న సీట్లలో కూడా ఎస్పీ ఘోరంగా ఓడిపోయిందని, బేస్​ ఓట్లనే సాధించుకోలేనివాళ్లు.. కూటమికి అనుకూలంగా  ఓట్లేశారని భావించలేమన్నారు. ఉత్తరప్రదేశ్​లో 11 అసెంబ్లీ స్థానాలకు త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీచేస్తుందని స్పష్టం చేసిన ఆమె, మహాకూటమి నుంచి ఎందుకు తప్పుకున్నామో వివరించారు. అయితే ఇది పర్మనెంట్​ బ్రేకప్​ కాదని, ఎస్పీలో మార్పొస్తే మళ్లీ పొత్తు పెట్టుకుంటామనీ తెలిపారు.

‘‘ఎస్పీ చీఫ్​ అఖిలేశ్​, ఆయన భార్య డింపుల్​ నన్నెంతో గౌరవించారు. మాది రాజకీయ అవకాశవాద పొత్తు కాదు. బాబాసాహెబ్​ అంబేద్కర్​ మిషన్​ను ముందుకు తీసుకెళ్లే పార్టీగా గొప్ప మానవతా లక్ష్యంతో, పాత గొడవలన్నీ మర్చిపోయి ఎస్పీతో కలిసి పనిచేశాం. మాది సులువుగా తెగిపోయే బంధం కాదు. మున్ముందు కష్టసుఖాల్లో కలిసే ఉంటాం. అయితే రాజకీయాల్లో రియాలిటీని గుర్తించడం చాలా ఇంపార్టెంట్​. లోక్​సభ ఎన్నికలపై మేం చేసిన రివ్యూలో తేలిందేంటంటే, సమాజ్​వాదీ పార్టీ తన బేస్​ ఓటు బ్యాంకు(యాదవుల ఓట్లు) కోల్పోయింది. లోలోపల ఏం జరిగిందో, ఎందుకు యాదవులు సొంత పార్టీకి దూరమయ్యారో తెలియాల్సిఉంది. యాదవ ఓటర్లు ఎక్కువున్న స్థానాల్లోనూ ఎస్పీ స్ట్రాంగ్​ క్యాండేట్లు ఓడిపోవడం మమ్మల్ని(బీఎస్పీని) ఆలోచనలో పడేసింది. ఈవీఎంలపైనా మాకు అనుమానాలున్నాయి. బీఎస్పీ, ఎస్పీ బేస్​ ఓట్లు ఒక్కటైన తర్వాత కూడా కూటమి అభ్యర్థులు ఓడాల్సిందికాదు. సరిగ్గా ఈ కారణమే ఎస్పీ నుంచి బీఎస్పీ దూరమయ్యేలా చేసింది. పొత్తుకు కట్టుబడి ఓట్లేసేలా ఎస్పీ కార్యకర్తల్ని మార్చుకునే బాధ్యత అఖిలేశ్​పై ఉంది. ఆ పనిలో ఆయన సక్సెస్​ అయ్యారనిపిస్తే మళ్లీ కలిసి పనిచేస్తాం. దానికి కొంత టైమ్​
పడుతుంది. ఈలోపు జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుంది”అని మాయావతిచెప్పారు.

మాదీ ఒంటరిపోరే: అఖిలేశ్​..

బీఎస్పీ చీఫ్​ మాయావతి ప్రకటనపై ఎస్పీ చీఫ్​ అఖిలేశ్​ యాదవ్​ స్పందించారు. ‘‘ఒకవేళ మహాకూటమి అంటూ లేకుంటే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మేం కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతాం. పార్టీ నేతలతో చర్చించి ఫైనల్​ నిర్ణయం తీసుకుంటాం. అయితే కూటమి ఎందుకు ఫెయిలైందో ఇప్పుడే చెప్పలేను. అన్నిటికంటే ముందు పార్టీ కోసం ప్రాణాలొదిలిన కార్యకర్తలకు న్యాయం దక్కేలా చూస్తాం’’అని అఖిలేశ్​ చెప్పారు. మంగళవారం ఘాజీపూర్​లో పర్యటించిన ఆయన, ఇటీవల చనిపోయిన ఎస్పీ కార్యకర్త కుటుంబాల్ని పరామర్శించారు. 80 లోక్​సభ
స్థానాలున్న యూపీలో కూటమిగా పోటీచేసిన బీఎస్పీకి10, ఎస్పీకి 5 సీట్లు మాత్రమే దక్కిన సంగతి తెలిసిందే.