జీ7 సమ్మిట్: ట్రంప్ ఆహ్వానానికి ఏంజెలా మెర్కెల్ నో

జీ7 సమ్మిట్: ట్రంప్ ఆహ్వానానికి ఏంజెలా మెర్కెల్ నో

బెర్లిన్: అమెరికాలో జరగనున్న గ్రూప్ ఆఫ్ సెవెన్ (జీ7) సమ్మిట్‌కు హాజరు కావాలంటూ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆహ్వానాన్ని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ నిరాకరించినట్లు అక్కడి అధికార వర్గాలు శనివారం వెల్లడించాయి. వాషింగ్టన్ లో జూన్ నెలాఖరున జీ7 సమ్మిట్ జరగనుంది. ట్రంప్ ఆహ్వానానికి కృతజ్ఞతలు చెప్పిన మెర్కెల్.. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత కష్ట కాలంలో తాను రాలేనని చెప్పినట్లు జర్మనీ ప్రభుత్వ ప్రతినిధి స్టెఫెన్ సీబర్ట్ మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో జరగాల్సి జీ 7 శిఖరాగ్ర సమావేశం కరోనా ఎఫెక్టుతో జూన్ కు వాయిదా పడింది. ప్రపంచం అంతటా వైరస్ విస్తరించిన నేపథ్యంలో చాలా దేశాలు సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నాయి. ఇలాంటి సమయంలో జీ 7 సదస్సును నేరుగా నిర్వహిస్తామని ట్రంప్ ఇదివరకే కామెంట్ చేశారు. సభ్య దేశాల ప్రతినిధులు నేరుగా సమావేశానికి హాజరయ్యే విషయం పరిశీలిస్తున్నామని వైట్​హౌస్​ వద్ద మీడియాతో అన్నారు. సభ్యులందరి ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించడంతో కరోనా వైరస్ సాధారణ స్థాయికి వచ్చిందనే గొప్ప సంకేతం ప్రపంచానికి ఇవ్వవచ్చు అని అన్నారు. కిందటేడాది జరిగిన జీ7 సదస్సు ప్రాన్స్ లో జరగగా.. ఈ ఏడాది అమెరికాలో జరగనుంది.