మమ్మల్ని గెలిపించండి.. పెట్రోల్, గ్యాస్, పాల రేట్లు తగ్గిస్తాం

మమ్మల్ని గెలిపించండి.. పెట్రోల్, గ్యాస్, పాల రేట్లు తగ్గిస్తాం

వచ్చే నెల 6న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో  ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. ఇందులో భాగంగా ప్రతిపక్ష డీఎంకే శనివారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే స్థానికులకు 75 శాతం ఉద్యోగాలకు కల్పించేందుకు చట్టాన్ని తెస్తామని చెప్పింది. చెన్నైలోని డీఎంకే  ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో ఆ పార్టీ నేత అధినేత ఎంకె స్టాలిన్‌ విడుదల చేశారు. పెట్రో, డీజిల్‌ ధరలను తగ్గిస్తామని తెలిపారు. లీటర్‌ పెట్రోల్‌పై రూ.5 డీజిల్‌పై రూ.4 తగ్గిస్తామని, వంటగ్యాస్‌ సిలిండర్‌పై రాయితీ ఇస్తామని, మహిళలకు 12 నెలల ప్రసూతి సెలవులు కల్పిస్తామన్నారు. విద్య, ఉపాధికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. విద్యార్థులకు ట్యాబ్‌లతో పాటు డేటా కార్డులను ఉచితంగా అందిస్తామని తెలిపారు స్టాలిన్.

అంతేకాదు...ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తే.. ఆర్థిక సాయం, అన్నాడిఎంకే మంత్రుల అవినీతిపై విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు, నీట్‌ పరీక్ష రద్దు దిశగా చర్యలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ఉన్న రిజర్వేషన్‌ను 30 శాతం నుండి 40 శాతానికి పెంపు, ఆస్తి పన్ను పెంపు రద్దు, వంటగ్యాస్‌ సిలిండర్‌పై రూ.100 రాయితీ, రాష్ట్ర వ్యాప్తంగా కలైంజ్ఞర్‌ క్యాంటీన్లు, పాల ధర లీటర్‌పై రూ.3 తగ్గింపు, కరోనాతో నష్టపోయిన బియ్యం కార్డుదారులకు రూ.4వేల సాయం, జర్నలిస్టుల కోసం ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు, అసెంబ్లీ సమావేశాలు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం, మధ్యాహ్న భోజన సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్పు వంటివి మేనిఫెస్టోలో ఉన్నట్లు తెలిపారు స్టాలిన్‌.