ఒక్కరోజే 200కు పైగా కుక్కలను పట్టుకున్నరు

 ఒక్కరోజే 200కు పైగా కుక్కలను పట్టుకున్నరు

హైదరాబాద్/గండిపేట, వెలుగు: వీధి కుక్కలను పట్టుకెళ్లాలని సిటీలోని అన్ని ఏరియాల నుంచి జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బుధవారం ఒక్కరోజే ట్విట్టర్, మై జీహెచ్ఎంసీ యాప్, హెల్ప్ లైన్ నంబర్లకు వందల్లో ఫిర్యాదులు వచ్చాయి. బాగ్​అంబర్ పేటలో కుక్కల దాడిలో బాలుడు చనిపోవడంతో జనం భయపడిపోతున్నారు. దీంతో బల్దియా సిబ్బంది ఫిర్యాదులపై ఫోకస్ పెట్టారు. మంగళవారం ఒక్కరోజే 200కు పైగా కుక్కలను పట్టుకొని స్టెరిలైజేషన్ కి తరలించినట్లు తెలిసింది. అయితే బుధవారం కూడా సిటీలోని అనేక ప్రాంతాల్లో స్థానికులపై వీధి కుక్కలు దాడి చేశాయి. అప్రమత్తమైన ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ మాసబ్ ట్యాంక్ లోని సీడీఎంఏ ఆఫీసులో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. 

మున్సిప‌‌‌‌ల్ శాఖ కార్యద‌‌‌‌ర్శి సుద‌‌‌‌ర్శన్ రెడ్డి, జీహెచ్‌‌‌‌ఎంసీ క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్ లోకేశ్​కుమార్‌‌‌‌, మున్సిప‌‌‌‌ల్ ప‌‌‌‌రిపాల‌‌‌‌న డైరక్టర్ స‌‌‌‌త్యనారాయ‌‌‌‌ణ, జోన‌‌‌‌ల్ క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్లు, వెట‌‌‌‌ర్నరీ విభాగం అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్వింద్ కుమార్ మాట్లాడుతూ గ్రేటర్​లో ప్రస్తుతం ఐదున్నర ల‌‌‌‌క్షల వీధి కుక్కలు ఉన్నాయ‌‌‌‌ని చెప్పారు. వాటిని గుర్తించి ఏబీసీ(యానిమల్‌‌‌‌ బర్త్ కంట్రోల్) స్టెరిలైజేష‌‌‌‌న్ ఆప‌‌‌‌రేష‌‌‌‌న్లు చేయాలని ఆదేశించారు. కాలనీల్లో కుక్కల కోసం నీటిని నిల్వ ఉంచేలా చూడాలని చెప్పారు. హోట‌‌‌‌ల్స్‌‌‌‌, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, చికెన్, మ‌‌‌‌ట‌‌‌‌న్‌‌‌‌ సెంట‌‌‌‌ర్ల నిర్వాహకులు వ్యర్థాలను రోడ్ల వెంట పోయకుండా క‌‌‌‌ట్టడి చేయాల‌‌‌‌న్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో అవ‌‌‌‌గాహ‌‌‌‌న కార్యక్రమాలు నిర్వహించాల‌‌‌‌ని చెప్పారు. పాంప్లెట్లు, హోర్డింగ్స్ రెడీ చేయాలని ఆదేశించారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ల సహకారంతో కుక్కల నియంత్రణ చ‌‌‌‌ర్యలు తీసుకోవాలని సూచించారు. పెంపుడు జంతువుల న‌‌‌‌మోదుకు స్పెషల్​యాప్​రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. మూసీ ప‌‌‌‌రివాహ‌‌‌‌క ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

కమిషనర్ ​లేక పోవడంతో..

వీధి కుక్కలు బాగ్​అంబర్​పేటలో బాలుడిపై దాడి చేసి పీక్కుతిన్న వీడియో చూస్తుంటేనే భయమేస్తోందని కాంగ్రెస్​లీడర్లు ఆందోళన వ్యక్తం చేశారు. లింగోజిగూడ కార్పొరేటర్ రాజశేఖర్​రెడ్డి, సీనియర్ ​లీడర్ ​ఫిరోజ్ ఖాన్ తదితరులు బుధవారం జీహెచ్ఎంసీ అధికారులను కలిసి వీధి కుక్కలను నియంత్రించాలని వినతి పత్రం ఇచ్చారు. బల్దియా కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో కుక్క బొమ్మలకు వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు. 

బీజేపీ కార్పొరేటర్ల వినతి

వీధి కుక్కల నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ బేగంబజార్ బీజేపీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, ఆ పార్టీ లీడర్లు  కొప్పుల నర్సింహారెడ్డి, డాక్టర్ సురేఖ, రాధాధీరజ్ రెడ్డి, శ్రావణ్, హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి, హబ్సిగూడ కార్పొరేటర్ చేతన మేయర్​విజయలక్ష్మిని కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. ఎండలు ముదిరితే కుక్కలు మరింత  రెచ్చిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బాలుడి మృతికి జీహెచ్ఎంసీ బాధ్యత వహించాలని, వెంటనే అతని కుటుంబానికి రూ.25లక్షల ఆర్థికసాయం అందించాలని డిమాండ్​చేశారు. అలాగే మణికొండ మున్సిపల్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ ఫల్గుణ కుమార్‌‌‌‌ బుధవారం స్థానిక ఆఫీసులో బ్లూక్రాస్‌‌‌‌ సోసైటీ, మణికొండ జంతు సంరక్షణ వలంటీర్స్‌‌‌‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధి కుక్కలు సంచరించే చోట వాహనాలు వేగంగా నడపడం, వాటిపై రాళ్లను విసరడం వంటివి చేయకూడదని సూచించారు.