తెలంగాణలో ఈ రోజు (మే13)వ తేదీ నుంచి రాబోయే ఏడు రోజుల వరకు అంటే మే 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా తేలిక నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సీనియర్ ఆఫీసర్ నాగరత్నం తెలిపారు. ఈ రోజు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నారాయణ పేట, గద్వాల జిల్లాల్లో, రేపు వీటితో పాటు మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నేడు, రేపు సాయంత్రం, రాత్రి సమయాల్లో జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
మంగళవారం, బుధవారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, గురువారం ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈరోజు నుంచి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని చెప్పారు. జూన్ మొదటి వారంలో వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయని తెలిపారు.
