జగిత్యాల జిల్లాలో ఆసక్తికర ఘటన: ప్రమాణ స్వీకారోత్సవం నాడే ఉప సర్పంచ్ పదవికి రాజీనామా

జగిత్యాల జిల్లాలో ఆసక్తికర ఘటన: ప్రమాణ స్వీకారోత్సవం నాడే ఉప సర్పంచ్ పదవికి రాజీనామా

హైదరాబాద్: సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం వేళ జగిత్యాల జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రమాణ స్వీకారోత్సవం నాడే ఉప సర్పంచ్ తన పదవికి రాజీనామా చేశాడు. వివరాల ప్రకారం.. జగిత్యాల ధర్మపురి మండలంలోని కమలాపూర్ గ్రామానికి చెందిన రాజూరి శ్రీనివాస్ థర్డ్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో 8వ వార్డు నుంచి పోటీ చేసి వార్డ్ మెంబర్‎గా విజయం సాధించాడు.

ఆ తర్వాత ఉప సర్పంచ్‎గా ఎన్నిక అయ్యాడు. కారణమేంటో తెలియదు గానీ 2025, డిసెంబర్ 22న సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్ల ప్రమాణ స్వీకారోత్సవం రోజు శ్రీనివాస్ ఉప సర్పంచ్ పదవికి రాజీనామా చేశాడు. ఈ మేరకు రాజీనామా లేఖను గ్రామ కార్యదర్శికి సమర్పించాడు. 

వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఉపసర్పంచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నాడు శ్రీనివాస్. తిరిగి వార్డు సభ్యుని హోదాలోనే ప్రమాణ స్వీకారం చేశాడు. స్థానిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా శ్రీనివాస్ ఉప సర్పంచ్ పదవికి రాజీనామా చేసి ఉండొచ్చని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ప్రమాణ స్వీకారం రోజే శ్రీనివాస్ పదవికి రాజీనామా చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.