చిట్​చాట్​కు ​కేరాఫ్‌గా మారిన​ చాయ్ అడ్డాలు

చిట్​చాట్​కు ​కేరాఫ్‌గా మారిన​ చాయ్ అడ్డాలు
  • చిట్​చాట్​కు ​కేరాఫ్​ చాయ్ అడ్డా 
  • రూట్ మార్చిన ఓనర్లు.. తక్కువ జాగలో డిఫరెంట్ సెటప్
  • ట్రెండీ పేర్లతో గ్రేటర్​లో పదుల సంఖ్యలో బ్రాంచ్​లు

హైదరాబాద్, వెలుగు: ఒకప్పుడు సిటీలో చాయ్​కి కేరాఫ్ ఇరానీ కేఫ్​లే.  ఇప్పటికీ ఇరానీ చాయ్ కి ఉండే క్రేజ్ వేరు.  కానీ క్రమక్రమంగా చాయ్​ అడ్డాల ట్రెండ్​లో చాలా మార్పులొచ్చాయి. కేఫ్​ల నుంచి రోడ్ సైడ్​ చిన్న చిన్న టీ స్టాల్స్ ఏర్పాటయ్యాయి. పొద్దున్నుంచి.. రాత్రి వరకు వందల మందికి అవి చిట్​చాట్​అడ్డాలుగా మారాయి. ప్రస్తుతం ఈ టీ స్టాల్స్  ‘టీ పాయింట్’గా మారుతున్నాయి.  సిటీలో ‘టీ పాయింట్’ ట్రెండ్ నడుస్తోంది. ఎక్కడ చూసినా ట్రెండీ పేర్లతో టీ పాయింట్లు కనిపిస్తున్నాయి. తక్కువ జాగాలోనే నాలుగైదు చైర్లతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. పదుల రకాల్లో వెరైటీ చాయ్​లకు ఇవి ఫేవరెట్ స్పాట్​గా మారాయి.  చాయ్​లతో పాటు స్నాక్స్, షేక్స్ కూడా అందుబాటులో ఉండటంతో వీటికి  జనం క్యూ కడుతున్నారు.

కొత్త కాన్సెప్టులతో..  
టీ పాయింట్లను చిన్న ప్లేస్ చూసుకుని ఏర్పాటు చేస్తుంటారు. ఉన్న స్పేస్ లోనే నాలుగైదు చైర్లతో సీటింగ్ కూడా ఉంటుంది.  ఒకటి రెండు ఫ్లేవర్లలో కాకుండా 40 నుంచి 80 వెరైటీల్లో చాయ్ లు తయారు చేస్తుంటారు. డిఫరెంట్​ టేస్టుల్లో ఉండే చాయ్​ కోసం చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారని అందుకే  కొత్త కాన్సెప్ట్​లతో బిజినెస్​లు స్టార్ట్ చేస్తున్నామని టీ స్పేస్ ఓనర్లు చెప్తున్నారు. ఒక దగ్గర సక్సెస్ అయితే సిటీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బ్రాంచ్​లను ఏర్పాటు చేస్తున్నామంటున్నారు. ఒక్కో ఫ్రాంచైజీకి రూ. 5 వేల నుంచి బ్రాండ్ ని బట్టి రూ. 40వేల వరకు పర్మిషన్ పేమెంట్​తో పాటు ప్రతి చోట ఇద్దరు నుంచి ముగ్గురితో టీమ్ ను మెయింటెయిన్ చేస్తున్నామని వారు చెప్తున్నారు.  ప్రస్తుతం సిటీలో చాయ్ పాయింట్, ఏక్ ధమ్ చాయ్, చాయ్ బాబు చాయ్, టీ పాయింట్, టీ లీఫ్, దోస్త్ టీ, టీ ట్రీ  లాంట పేర్లుతో చాలా టీ పాయింట్లు ఉన్నాయి. వీటిల్లో డిఫరెంట్ ఫ్లేవర్లలో వెరైటీ చాయ్ లు కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. 

ఫుల్ రెస్పాన్స్
ఆరు నెలల క్రితం బంజారాహిల్స్​లో దోస్త్ టీ ఫ్రాంచైజీ స్టార్ట్ చేశాం. దీనికి మెయిన్ బ్రాంచ్ మాదాపూర్​లో ఉంది. మొదట చాలా తక్కువ మంది కస్టమర్లు వచ్చేవారు. ఆ తర్వాత రెస్పాన్స్ పెరిగింది. మా దగ్గర 32 రకాల చాయ్​లు, స్నాక్స్, షేక్స్ అందబాటులో ఉన్నాయి. దోస్త్ టీ కి సిటీలో మొత్తం 22 బ్రాంచ్​లున్నాయి. డైలీ 4 నుంచి 5 వేల వరకు కస్టమర్లు వస్తారు. ఈవెనింగ్ ఫుల్ రష్ ఉంటుంది. చుట్టుపక్కల ఆఫీసులు, హాస్పిటల్స్ నుంచి జనాలు వస్తుంటారు. 
– పింటు జాదవ్, వర్కర్, దోస్త్ టీ పాయింట్ , బంజారాహిల్స్

81 ఫ్లేవర్లలో చాయ్​లు 
మణికొండలోని ఓయూ కాలనీలో 2 వారాల క్రితమే ‘81 డిగ్రీస్’ పేరుతో చాయ్ పాయింట్​ను ప్రారంభించాం. ఇప్పుడిప్పుడే బిజినెస్ అవుతోంది. సిటీలో 3 ఫ్రాంచైజీలున్నాయి.  స్ట్రాబెరీ లెమనేడ్, రాస్ బెర్రీ లెమనేడ్, పొమగ్రెనేట్ ఐస్ చాయ్, గ్రీన్ ఆపిల్ ఐస్ చాయ్ లాంటి 81 రకాల ఫ్లేవర్లలో చాయ్​లను అమ్ముతున్నం. 
–  మహేందర్, వర్కర్, 81 డిగ్రీస్ చాయ్ పాయింట్, మణికొండ