సుర్రు సమ్మర్​.... ఎల్‌నినో ప్రభావం

సుర్రు సమ్మర్​.... ఎల్‌నినో ప్రభావం



 


రోహిణి కార్తెలో రోళ్లు కూడా బద్దలవుతాయని నానుడి. ఈసారి భానుడి ప్రతాపాన్ని చూస్తే, ఆ దుస్థితి ముందే వచ్చిందనిపిస్తోంది. వేసవికాలం వస్తోందంటే ఎవరికైనా గుండెలు గుబగుబలాడటం కద్దు. ఒకవైపు మండే ఎండలు… మరొక వైపు గొంతెండిపోతున్నా దొరకని గుక్కెడు నీళ్లు..ఎప్పుడూ ఉండే ఈ దురవస్థకి తోడు ఈసారి ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయంటూ వినవస్తున్న వివిధ వాతావరణ సర్వేల హెచ్చరికలు బేజారెత్తిస్తున్నాయి. ఇది నిజమేనంటూ ఈ ఏడాది  ఫిబ్రవరి చివరి వారం  నుంచే సూర్య ప్రతాపం మొదలైంది. మార్చి నెలలోనే  వాతావరణం మండువేసవిని తలపిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు.

 గత ఏడాదితో పోల్చితే ఫిబ్రవరి నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం మొదలైంది. మార్చి నెలలో సాధారణం కంటే రోజువారీ ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఈ ఏడాది మార్చి నుంచి - మే నెలల మధ్య వేసవి చండప్రచండంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పని చేసే ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ ముందే అంచనావేసింది. 

గత ఏడాది  ( 2023) మొదలైన ఎల్ నినో ఇందుకు కారణమని, దీని వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని సదరు సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. పసిఫిక్ మహా సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి పెరగడాన్ని ఎల్ నినో అంటారు. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటి 32 -నుంచి 34 డిగ్రీల సెల్సియస్‌కు చేరితే ఆ పరిస్థితిని సూపర్ ఎల్‌నినో అంటారు. ప్రస్తుత వేసవి కాలంలో ఈ పరిస్థితి తప్పదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 మండే ఎండలకు తోడు ఈసారి విచిత్రమైన వాతావరణ పరిస్థితి నెలకొని ఉంది. నమోదవుతున్న ఉష్ణోగ్రతల కంటే ఎండ వేడిమి ఎక్కువగా ఉంటోంది. ఇలా ఉష్ణోగ్రతలకు మించి వేడి తీవ్రత ఉండటాన్ని వాతావరణ శాస్త్రవేత్తలు ‘ఫీల్ లైక్ టెంపరేచర్’ అంటారు. గాలిలో తేమ శాతం పెరగడమే వేడి తీవ్రతకు కారణం. తేమ శాతం పెరిగే కొద్దీ ఎండ వేడిమి కూడా తీవ్రంగా ఉంటుంది. దీని వల్ల ఉక్కపోత ఎక్కువవుతుంది. మండే ఎండలకు తోడు ఉక్కపోత పెరిగితే పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పరిస్థితి మార్చి మొదటి వారంలోనే  మొదలైంది.

2024  జూన్ నాటికి ఎల్‌నినో ప్రభావం క్షీణించి, పరిస్థితి సద్దుమణుగుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొంది.  మే నెల చివరి నాటికి లానినో ఏర్పడుతుందని, ఫలితంగా ఈ వర్షాకాలంలో మునుపటి కంటే వానలు బాగా పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే జరిగితే అంతకంటే కావలసినదేముంటుంది? అయితే దానికంటే ముందు ప్రస్తుత విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధం కావడం ముఖ్యం. భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఒకవైపు, బెంగళూరు వంటి మహానగరమే దాహార్తితో అల్లాడుతున్న దుస్థితి మరోవైపు ముంచుకొస్తున్న ఉపద్రవాన్ని కళ్లకు కడుతున్నాయి. దీనికి తోడు వేసవి నడిమధ్యన జరగనున్న లోక్‌సభ ఎన్నికలు సామాన్యుడి వేసవి వెతలకు గోరుచుట్టుపై రోకటి పోటుగా పరిణమిస్తున్నాయి. ఎన్నికల హడావిడిలో పడి అధికారపక్ష నాయకులు  ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి కేంద్రీకరించడం లేదన్న విమర్శలు ఇప్పటికే వినవస్తున్నాయి. ఈ నిర్లక్ష్య ధోరణి ఇలాగే కొనసాగితే, నిలువ నీడ కూడా లేని అభాగ్యులు మండుటెండలకు శలభాల్లా మాడిమసైపోవలసి వస్తుంది.

అదే జరిగితే… వేసవి కాలంలో ప్రతి రోజూ  వడదెబ్బ మృతుల సంఖ్య ఈసారి ఊహించడానికి కూడా వీలు కాదేమో. పొంచి ఉన్న మండుటెండల ముప్పు గురించి, వడదెబ్బకు లోనుకాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టడం అత్యంత ఆవశ్యకం. చలివేంద్రాల ఏర్పాటుతో సరిపెట్టకుండా, స్వచ్ఛంద సంస్థల సహకారంతో గ్రామగ్రామాన వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, వడదెబ్బకు గురైనవారిని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది.  

మండుతున్న ఎండలు ఒంట్లో ఉష్ణోగ్రతను ఇట్టే పెంచేస్తాయి. యూవీ కిరణాల ప్రభావం ముఖంతో పాటుగా మొత్తం శరీరంపై పడుతుంది. చెమట పట్టడం, తరచుగా దాహం వేయడం, అలసట కలుగుతాయి. ఎండాకాలంలో మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలాసార్లు డీహైడ్రేషన్, చర్మ సమస్యలు, మైకము, కంటి నొప్పి వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. ఈ సమస్యలకు దూరంగా ఉండాలంటే శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలి.