ఉగాది 2026 : తెలుగు వారి తొలి ప్రకృతి పండుగ ఉగాది.. పురాణాల్లోని విశిష్ఠత అందరూ తెలుసుకోవాలి..!

ఉగాది 2026 : తెలుగు వారి తొలి ప్రకృతి పండుగ ఉగాది.. పురాణాల్లోని విశిష్ఠత అందరూ తెలుసుకోవాలి..!

కాలం ఒక ప్రవాహం! అది తెలుగు పదంతో నిరంతరం సాగుతూనే ఉంటుంది. దాన్ని ఆపడం, దానికి ఎదురెళ్లడం ఎవరి తరమూ కాదు. అయితే, మనిషి తన అవసరాలకు అనుకూలంగా కాలాన్ని విభజించుకున్నాడు. అలా కాలాన్ని పరిశీలించుకుంటూ దానికి తగ్గట్లు నడుచుకుంటూ తన బుద్ధికి పదును పెట్టుకున్నాడు. ఉగాది పండుగను ప్రకృతి పండుగ ఎలా అయింది.. ప్రకృతికి ఉగాదికి గల సంబంధం ఏమిటి.. కవులు.. పండితుల విశ్లేషణ ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం...

 కాలానికి తగ్గట్టుగా కర్మలు నెరవేర్చడంతోనే మనిషి 'జ్ఞాన ప్రయాణం' మొదలైంది. అదే ఈ యుగానికి.. 'ఆది' అయింది. కాల మహిమను గుర్తు చేసుకుంటూ తెలుగు వారు చేసుకునే మొదటి పండుగే ఉగాది! స్వస్తి శ్రీచాంద్రమానేన పరాభవ నామ సంవత్సరం..  చైత్రమాసం...
 ఉత్తరాయణం వసంత రుతువు శుక్ష పక్షం ప్యాడ్యమి తిథి.. ఉగాది పండుగ ఈ ఏడాది ( 2026) మార్చి 19న వచ్చింది. అనాదిగా వస్తున్న ఈ ఉగాది.. 'యుగాది'. అన్న సంస్కృత పదం నుంచి పుట్టింది. మన వేదాలకు మంత్ర సృష్టి జరిగిన రోజు. సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే రోజు. కాలం వసంతంలోకి అడుగు పెట్టిన రోజునే ఉగాది. పండుగగా, కొత్తసంవత్సరాదిగా తెలుగువాళ్లు జరుపుకుంటున్నారు.

ప్రకృతి పండుగ

మన సంప్రదాయంలో ఏ పండుగను చూసినా అది ప్రకృతితో ముడిపడి ఉంటుంది. అందులోనూ ఉగాది అయితే దాన్ని ఏకోణంలో చూసినా ప్రకృతి ఆధారంగానే కనిపిస్తుంది. వసంత రుతువు వచ్చిందని తెలియజేసే పండుగఉగాది. 

ఉగాది నాటికి చుట్టు పక్కన ఏ చెట్టును చూసినా లేత ఆకులతో పచ్చగా కనువిందు చేస్తుంటుంది. ఆ సంతోషం కోయిల పాటల్లో, నెమలి నాట్యాల్లో కనిపిస్తుంది. వసంతుడి ఆటల్ని చూసి మనసు పరవశించి పోకుండా ఉండగలరా!

ఉగాది వెనక...

ఉగాది పండుగ వెనక ఉన్న కథనాన్ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెప్తారు. ఉగాది.. 'ఉగ' అంటే నక్షత్ర గమనం. జన్మ ఆయుష్షు అని అర్ధాలు ఉన్నాయి. వీటికి అది ఉగాది అంటే ఈ ప్రపంచం లో పుట్టిన ప్రతి జీవి ఆయుష్షుడు మొదటిరోజునే ఉగాదిగా మారిందంటారు. చైత్ర శుద్ధ పాడ్యమి నాడే కలియుగం మొదలైందని.. త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందని మరో కథనం.. ఈ రోజే శ్రీమహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించాడని పురాణాల్లో ఉంది.

 బ్రహ్మదేవుడు సృష్టిని మొదలు పెట్టిన రోజే ఉగాదని అంటారు. మొదటి తెలుగు చక్రవర్తి శాలివాహనుడు. ఉగాది రోజునే సింహాసనాన్ని అధిష్టించాడనేది కూడా ప్రచారంలో ఉంది. ఉగాది రోజు నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగగా పేరుగాంచింది. అయితే, తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉగాదిని గొప్పగా జరుపు కుంటారు..తెలుగు రాష్ట్రాలు, కర్నాటకలో ఉగాదిమహారాష్ట్రలో గుడిపాడ్వా,  తమిళనాడులో 'పుత్తాండు అనే పేరుతో, కేరళలో 'విషు', పంజాబ్​లో 'వైశాఖీ', బెంగాల్లో పొయ్​ లా బైశాఖ్​ ' అనే పేర్లతో ఉగాది జరుపుకుంటారు.

ఏమేం చేస్తారు?

రెండు మూడు రోజుల ముందు నుంచే పండగ పనులు మొదలవుతాయి. ఉగాది రోజు పొద్దున్నే ఇంటిని శుభ్రంచేసుకుంటారు. తైల అభ్యంగన స్నానం చేసి గుమ్మానికి మామిడి తోరణాలు, వేపాకు తోరణాలు కడతారు. కొత్త బట్టలు వేసుకొని కొత్త కుండ కొనడంతో సందడి మొదలవుతుంది. ఒకవైపు పచ్చడి తయారు చేస్తుంటే..మరోవైపు వేడివేడిగా భక్ష్యాలు తయారవుతుంటాయి. ఉగాది పచ్చడి...వంటలు ఇష్టమైన దేవునికి నైవేద్యంగా పెట్టి కొత్త సంవత్సరం అంతా శుభం కలగాలని కోరకుంటారు. తర్వాత ఇంటిల్ల  పాది పరగడపున ఉగాది పచ్చడి తిని, తర్వాత.. భక్ష్యాలు తింటారు. 

ఉగాదినాడు తెలంగాణలో కొన్ని పల్లెల్లో  మాంసం కూడా ఉంటారు. కోడి పుంజులను కోసి గ్రామ దేవతల మొక్కులు తీర్చుకుంటారు. కొత్త పసులు, కొత్త వ్యాపారాలు కూడా ఉగాది నాడు మొదలు పెడుతుంటారు కొందరు. ఈ రోజు చేసే తైల అభ్యంగన స్నానం (శరీరానికి నువ్వులు నూనె పట్టించి నలుగుపిండితో చేసే స్నానం): శరీరంలో ఉన్న టాక్సిన్స్ (విషపదార్థాలు)ను తొలగిస్తుంది.

పంచాంగ శ్రవణం.. కవి సమ్మేళనం

ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తారు. ఈ పంచాంగ శ్రవణం వినడం పట్ల ఈ సంవత్సరంలో జరగబోయే మంచి చెడులతో పాటు పరిణామాలు తెలుసుకుంటారు. కలియుగంలో నక్షత్ర ఫలితాలతో పాటు రాశిఫలాలు.. ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు తెలుసుకుంటారు. ఇది జాగ్రత్తగా నడుచుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే, ఉగాది రోజు కవులు ప్రత్యేకంగా కవి సమ్మేళనం' నిర్వహిస్తారు. కొత్త, పాత కవులు కొత్త ఆలోచనలు. పాత ఒరవళ్ళు కలిపి కొత్తపద్యాలు కవితలు రచించి, చదువుతారు.


ఉగాది పచ్చడి.. ఒక ఔషధం

ఉగాది పచ్చడిని ఒక్కో చోట ఒక్కో విధంగా తయారు చేస్తుంటారు. కానీ, ఎక్కడి వాళ్లైన సరే.. అందులో తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరు రుచులను తప్పకుండా ఉండేలా చూస్తారు. ఈ పచ్చడి కోసం చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్పు చింతపండు, జామకాయలు, బెల్లం, జీలకర్ర, మిరపకాయ వంటివి వాడుతుంటారు. ఇన్ని కలిపి చేసిన ఉగాది పచ్చడిని ఒక మహాఔషధమని అంటారు పెద్దలు.  ఈ ఉగాది పచ్చడిని ఈ పండుగ నుంచి శ్రీరామనవమి వరకూ లేదాచైత్ర పౌర్ణమి వరకు ప్రతిరోజూ ఉంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని. ఆ సంవత్సరమంతా రోగాలేవీ దరిచేరవనే నమ్మకం కూడా ఉంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఉగాది పచ్చడిని నింబకుసుమ భక్షణం...అశోకకళికా ప్రాశనం అంటారు.

 రుతువులలో వచ్చే మార్పుల వల్ల వచ్చే రోగాల నుంచి రక్షణగా, ఈ పచ్చడిని ఔషధంగా తీసుకోవడం పూర్వం నుంచే అనవాయితీగా వస్తోంది. పచ్చడిలో ఉండే వేప పువ్వు కడుపులో ఉన్న నులిపురుగులను చంపేస్తుంది. వేపగాలి ఆటలమ్మ అమ్మోరు వంటి అంటురోగాలను దగ్గరకి రానివ్వకుండా కాపాడుతుంది మామిడి యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంది. మిరియాలు దగ్గు జలుబు, పైత్యాలను అదుపులో ఉంచుతాయి. బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చింతపండు మలబద్దకాన్ని, నీరసాన్ని తగ్గిస్తుంది. ఉప్పు ఎండాకాలంలో వచ్చే హైడ్రేషన్ని తగ్గిస్తుంది. సంవత్సరం అంతా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సమానంగా తీసుకోవాలనే సందేశాన్ని కూడా ఉగాది పచ్చడి ఇస్తుంది. 

బెల్లం- తీపి అనేది సంతోషానికి, ఉప్పు- జీవితంలో ఉత్సాహానికి... వేప పువ్వు- చేదు బాధ తాలూకు అనుభవాలకు, చింతపండు- పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు, పచ్చి మామిడి ముక్కల పులుపు- కొత్త సవాళ్లకు.. కారం సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులకు సంకేతం అని చెప్తారు.