పెరుగుతున్న సినిమా పైరసీ (Movie Piracy) సమస్యను అరికట్టేందుకు కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) మరియు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) సంయుక్తంగా కొత్త యాంటీ పైరసీ డిస్క్లెయిమర్‌ను ప్రారంభించాయి. ఇకపై థియేటర్లలో ప్రతి సినిమా ప్రదర్శనకు ముందు ఈ హెచ్చరికను తప్పనిసరిగా ప్రదర్శించనున్నారు.
సోమవారం మార్చి 16న హైదరాబాద్‌లో నిర్వహించిన స్టేక్‌హోల్డర్ సమావేశంలో ఈ కార్యక్రమాన్ని TGCSB డైరెక్టర్ శిఖా గోయల్ (IPS) మరియు TFCC అధ్యక్షుడు దగ్గుబాటి సురేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా పైరసీ కేసుల దర్యాప్తును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (SOP)ను కూడా ఆవిష్కరించారు.
యాంటీ పైరసీ యూనిట్ ఏర్పాటు
ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యం డిజిటల్ పైరసీని అరికట్టడం, అలాగే చట్ట అమలు సంస్థలు మరియు సినిమా పరిశ్రమ మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం అని అధికారులు తెలిపారు. కొత్త SOP ద్వారా పైరసీ కేసులపై వేగవంతమైన విచారణ, కఠిన చర్యలు తీసుకునేలా ప్రణాళిక రూపొందించబడింది. ఈ చర్యలతో సినిమా లీకులు, అక్రమ ప్రసారాలపై కట్టడి సాధ్యమవుతుందని సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
థియేటర్లలో హెచ్చరికలు తప్పనిసరి
ఇకపై ప్రతి సినిమా ప్రదర్శనకు ముందు థియేటర్లలో యాంటీ పైరసీ డిస్క్లెయిమర్ ప్రదర్శన తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. ప్రేక్షకుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐపిఎస్ అధికారి శిఖా గోయల్, నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తెలిపారు. పైరసీ కారణంగా తెలుగు సినిమా పరిశ్రమకు ఏటా సుమారు రూ.13,700 కోట్ల నష్టం జరుగుతుండగా, భారతీయ సినిమా పరిశ్రమ మొత్తానికి ఇది రూ. 22,400 కోట్లకు చేరుతున్నట్లు వెల్లడించారు.
పైరసీకి ప్రధాన కారణాలు
పోస్ట్ ప్రొడక్షన్ దశలో కంటెంట్ లీక్ అవడం, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల లోపాలు, థియేటర్లలో క్యామ్‌కార్డింగ్ వంటి అంశాలు పైరసీకి ప్రధాన కారణాలుగా గుర్తించారు.
చట్టపరమైన చర్యలు
ఎవరైనా పైరసి చేయాలని డిసైడ్ అయితే, వారికి పైరసీ కేసులు Copyright Act 1957, Cinematograph Act 1952, Information Technology Act 2000 కింద నమోదు చేయబడతాయని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరించారు. అంతేకాకుండా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. ఈ చర్యలతో పైరసీపై కట్టడి సాధ్యమవుతుందని సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
